ప్రశ్నించండి.. సమాధానాలు చెబుతాం: ఎమ్మెల్యేలకు టీ-అసెంబ్లీ లేఖ!
గత సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.
By: Garuda Media | 29 Aug 2026 9:36 AM ISTతెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం రెడీ అవుతోంది. వచ్చే నెల 7వ తేదీ నుంచి ఈ సమావేశాలు నిర్వహించాలని అంచనా వేశారు. అయితే.. దీనిపై అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావు, సభాపతి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా. దాదాపు వచ్చే నెల 7(సోమవారం) నుంచే సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సచివాలయం లేఖలు రాసింది.
వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయని.. సభ్యులు తమ ప్రశ్నలను పంపించాలని అసెంబ్లీ సెక్రటరీ తిరుపతి లేఖల్లో పంపించారు. స్పీకర్ ప్రసాదరావు అనుమతి మేరకు ఈ లేఖలు పంపుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ శాఖలకు సంబం ధించిన ప్రశ్నలను అడవచ్చని పేర్కొన్నారు. అయితే.. విస్తృత ప్రజా ప్రయోజనం ఉంటే బాగుంటుందని లేఖల్లో సూచించారు. శాఖల వారీగా అడిగే ప్రశ్నలకు సమాధానాలను సిద్ధం చేయాల్సి ఉంటుందని తెలిపారు. వర్షాకాల సమావేశాల్లో మంత్రులు వాటికి జవాబు ఇస్తారని వివరించారు.
ఈ సారీ ఆటు పోట్లు!
గత సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. సవాళ్లు ప్రతిసవాళ్లతో సభ దద్దిరిల్లింది. ముఖ్యంగా పంటల మద్దతు ధరలు, ఇందిరమ్మ ఇళ్లు.. మహిళలకు నెల నెలా ఇస్తా మన్న రూ.1500 వ్యవహారాలతోపాటు ఆరు గ్యాంరెటీలను ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నించగా.. ప్రభుత్వ పక్షం దీటుగా సమాధానం ఇవ్వడంతోపాటు.. గత బీఆర్ ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్చకు సిద్ధమా? అని సీఎం రేవంత్ సవాల్ రువ్వారు. దీంతో నాటి సభలు హోరెత్తాయి.
ఇక, ఇప్పుడు కూడా అదే తీరులో సభలు జరగనున్నాయని తెలుస్తోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం, మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో లోటుపాట్లు, ప్రతిపక్షాలపై నమోదు చేస్తున్న కేసులు, గృహనిర్బంధాలు, సాగునీరు.. ప్రాజెక్టులు ఇలా.. అనేక అంశాలు ఈ సారి చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం కామనేనని అంటున్నారు. ఇక, ఇటీవల సీఎం రేవంత్ అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకున్న దరిమిలా.. బీజేపీ వ్యవహారం కూడా చర్చకు రానుంది. మొత్తంగా ఈ సారి కూడా సభలో ఆటు పోట్లుతప్పవన్న సంకేతాలు వస్తున్నాయి.
