మీరు-మీరు చేతులు కలిపి.. తెలంగాణ గొంతు కోస్తారా?!
ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తోంది. దీనిపై తెలంగాణ, కర్ణాటకలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
By: Garuda Media | 15 Oct 2025 9:00 PM IST''మీరు-మీరు చేతులు కలిపి.. తెలంగాణ గొంతు కోస్తారా?. మేం చెబుతున్న వాదన వినిపించుకోరా? మీ ఇష్టానికి వ్యవహరించి మా హక్కులు కాలరాస్తారా?'' అంటూ.. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సుదీర్ఘ ఉత్తరం రాసింది. తీవ్రస్థాయి పదాలతో కేంద్రంపై నిప్పులు చెరిగింది. తెలంగాణ హక్కుల సంగతేంటి? ముందు అవి తేల్చాలని ప్రశ్నించింది. తెలంగాణలోనూ అనేక సమస్యలు ఉన్నాయని.. రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. తమకు కేటాయించాల్సిన జలాలపైనా స్పష్టత ఇవ్వాలన్నా రు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ లేఖ సంధించింది.
విషయం ఏంటి?
ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తోంది. దీనిపై తెలంగాణ, కర్ణాటకలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ.. ఏపీ ప్రభుత్వం గోదావరి జలాల్లో వృథాగా పోతున్న నీటిని మాత్రమే తాము వాడుకుం టామని చెబుతోంది. ఏటా వెయ్యి టీఎంసీల జలాలు సముద్రంలోకి వృథాగా పోతున్నాయని.. వీటిలో కేవలం 200 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకుంటామని చెబుతోంది. దీనికి సంబంధించి కేంద్రం వద్ద పెద్ద పంచాయతీనే కొనసాగుతోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం కేంద్రానికి మరోసారివిజ్ఞప్తి చేసి.. ప్రాజెక్టు విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరింది.
ఈ ప్రాజెక్టు డిటైల్డ్ రిపోర్టు(డీపీఆర్)ను కూడా సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి.. టెండర్లు పిలిచింది. దీని ప్రకారం.. బనకచర్ల ప్రాజెక్టు వ్యయం, నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను సదరు కంపెనీలు అందిస్తాయి. వీటిని కేంద్రానికి పంపించనున్నారు. మరోవైపు గోదావరి జలాల్లో లభ్యత ఎంత? ఎంత నీరు సముద్రంలోకి పోతోందన్న విషయాలపై కూడా ఏపీ ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేయిస్తోంది. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీ సర్కారు దూకుడుగా ఉందని.. బనకచర్ల విషయంలో కేంద్రం పరోక్షంగా సహకరిస్తోందని ఆరోపిస్తోంది.
అందుకే.. ప్రస్తుతం టెండర్ల దశకు వచ్చారని పేర్కొంది.మరికొన్ని రోజులు ఆగితే భూసేకరణ దశలోకి కూడా అడుగు పెడతారని ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఏపీప్రభుత్వాన్ని నిలువరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలోనే మీతో పొత్తు ఉందని.. ఏపీకి మితిమీరిన విధంగా సాయం చేస్తున్నారని ఆరోపించడం గమనార్హం. దీనివల్ల తెలంగాణ రైతులు, ప్రజల ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే స్పందించి ఏపీ సర్కారును నిలువరించాలని కోరింది.
