తెలంగాణ, ఏపీలకు మోడీ కానుక !
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఏకంగా 5 లక్షల ఇండ్లను మంజూరు చేసింది.
By: Garuda Media | 15 Sept 2026 7:00 PM ISTప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఏకంగా 5 లక్షల ఇండ్లను మంజూరు చేసింది. ఇందులో తెలంగాణకు రెండు లక్షల ఇండ్లు, ఆంధ్రప్రదేశ్ కు మూడు లక్షల ఇండ్లను మంజూరు చేసింది. 2029లో దేశంలోని నిరుపేదలకు 2 కోట్ల కొత్త ఇండ్లు మంజూరు చేసి నిర్మించి ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. దానిలో భాగంగానే తాజగా ఇండ్లను కేటాయించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం కింద ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పట్టణ ప్రాంతాలలో ఇంటి నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాలలో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాలలో రూ.1.50 లక్షల సహాయం అందిస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా మరో 40 శాతం నిధులు మంజూరు చేసి లబ్దిదారులకు అందజేయాల్సి ఉంటుంది. 60 - 40 నిష్పత్తిలో నిధులను విడుదల చేయడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం ఇస్తున్న రూ.1.50 లక్షలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో లక్ష జత చేసి లబ్దిదారులకు అందజేస్తున్నది. తెలంగాణలో కేంద్రం ఇస్తున్న రూ.1.50 లక్షలకు అదనంగా మరో రూ.3 లక్షలు జతచేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద అర్హులై, ఎంపికయిన లబ్దిదారులకు నేరుగా వారి ఖాతాలలో నిధులు జమచేయబడతాయి.
గత మూడేళ్లలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 1.78 లక్షల ఇండ్లు మంజూరు కాగా, తెలంగాణలో 3.8 లక్షల ఇండ్లు మంజూరయ్యాయి. ఏపీలో అయినా, తెలంగాణలో అయినా మంజూరు అవుతున్న ఇండ్లకు, నిర్మాణం పూర్తయిన ఇండ్లకు పొంతన ఉండడం లేదు. భూమి లభ్యత, నిదుల విడుదల ఆలస్యం, లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత లేకపోవడం, నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లు ఈ పథకం అమలులో ప్రధానంగా ఎదురవుతున్న సమస్యలు.
దశాబ్దాలుగా దేశంలో నిరుపేదలకు ఇండ్ల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం అందిస్తున్న పెరుగుతున్న జనాభా, విడిపోతున్న కుటుంబాల మూలంగా పేదలకు పక్కా ఇల్లు అన్నది ఎప్పటికప్పుడు సమస్యగానే మిగిలిపోతున్నది. ఆయా రాష్ట్రాలలో ఆయా పార్టీల ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ప్రకటిస్తున్న మేనిఫెస్టోలకు, కేంద్రం అందిస్తున్న సాయంతో అనుసంధానం లేకుండా ఇస్తున్న హామీలు కూడా ఈ పథకం విజయవంతం కాకపోవడానికి ప్రధాన కారణం. కేంద్రం నిబంధనల ప్రకారం ఇండ్లు నిర్మిస్తేనే నిధులు మంజూరు అవుతాయి. అలా అని రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారీతిన నిధులు మల్లిస్తాం అంటే కేంద్రం ఒప్పుకోదు. మొత్తానికి రెండు రాష్ట్రాలకు కొత్తగా 5 లక్షల ఇండ్లు మంజూరు చేయడం సంతోషకరమైన విషయం.
