917%, 367%... తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరిగిన అబార్షన్లు..!
అవును... అబార్షన్ల సంఖ్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాలు షాకింగ్ గా మారాయి.
By: Raja Ch | 17 Aug 2025 5:00 PM ISTమాతృత్వం ఓ గొప్పవరం. అది దక్కనివారికి అ విలువ తెలుస్తుందనేది నిజం! అయితే అవగాహనా లోపమో, అజ్ఞానమో, ఆవేశంలో తీసుకున్న నిర్ణయమో, ఆరోగ్య సమస్యో... కారణం తెలియదు కానీ భారతదేశంలో.. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో అబార్షన్ల సంఖ్య భారీ పెరుగుతుండటం అందోళన కలిగిస్తుంది. తాజాగా కేంద్రం ఈ లెక్కలు వెల్లడించింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విస్తుపోయే విషయాలు తెరపైకి వచ్చాయి!
అవును... అబార్షన్ల సంఖ్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాలు షాకింగ్ గా మారాయి. దక్షిణాది రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అబార్షన్లు భారీగా పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. అందులోనూ తెలంగాణలో మరింత ఎక్కువగా అబార్షన్లు జరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో గత ఐదేళ్లలోని లెక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!
2020-21లో తెలంగాణలో జరిగిన అబార్షన్ల సంఖ్య 1,578గా ఉండగా.. 2022-23లో ఆ సంఖ్య 4,071గా ఉంది. ఇక, 2023-24లో ఆ సంఖ్య 12,365కి చేరగా.. 2024-25కి వచ్చేసరికి 16,059కి పెరిగినట్లు కేంద్రం తెలిపింది. అంటే... 2020-21తో పోలిస్తే ఏకంగా 917 శాతం పెరిగినట్లన్నమాట. దీంతో.. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో గర్భస్రావాలు నమోదు కాలేదని కేంద్రం తెలిపింది!
ఇక ఏపీ విషయానికొస్తే... 5 ఏళ్లలో 367% గర్భస్రావాలు పెరిగిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా... 2020-21లో ఏపీలో అబార్షన్ల సంఖ్య 2,282గా ఉండగా.. 2024-25 నాటికి అది 10,676కు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇదే సమయంలో... కేరళలో 2020-2021లో 8,525 గర్భస్రావాలు నమోదు కాగా.. 2024-25కి ఆ సంఖ్య 25,884కు ఎగబాకిన పరిస్థితి!
12 వారాలు పూర్తి కాకముందే...!:
తెలంగాణలో భారీగా గర్భస్రావాలు పెరగడానికి గల కారణాలపై రాష్ట్ర మాతా శిశు ఆరోగ్య విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వి.కె. సుమిత్ర స్పందించారు. ఈ సందర్భంగా... చాలా అబార్షన్లు 12 వారాలు పూర్తి కాకముందే జరిగాయని.. పిండం అభివృద్ధి చెందే సమయంలో జన్యుపరమైన, క్రోమోజోములు, పుట్టుకతో వచ్చే అసాధారణ లక్షణాలు వంటి వైద్య సమస్యల వల్ల గర్భస్రావాలు జరుగుతాయని అన్నారు.
