Begin typing your search above and press return to search.

ఏపీలో మొంథా తుఫాన్ : తెలంగాణలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ మంగళవారం అర్ధరాత్రి తీరం దాటినా, ఆ ప్రభావం కొనసాగనుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు

By:  Tupaki Political Desk   |   29 Oct 2025 10:32 AM IST
ఏపీలో మొంథా తుఫాన్ :  తెలంగాణలో భారీ వర్షాలు
X

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ మంగళవారం అర్ధరాత్రి తీరం దాటినా, ఆ ప్రభావం కొనసాగనుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వచ్చే 24 గంటలు ఏపీతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. అదేసమయంలో రానున్న ఐదు రోజులు కూడా మోస్తరు వర్షాలు కురవనున్నట్లు చెబుతున్నారు. ఏపీలోని నరసాపురం సమీపంలో తుఫాన్ తీరం దాటగా, పలు ప్రాంతాల్లో సుమారు 20 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. తెలంగాణలో నాగర్ కర్నూల్ జిల్లాలో ఉప్పునుంతలలో అత్యధికంగా 20.8 సెం.మీ. వర్షం పడింది. అదేవిధంగా అదే జిల్లాలోని అమ్రాబాద్ లో 19.7 సెం.మీ. నల్గొండ జిల్లా తెల్దేవరపల్లిలో 18.5 సెం.మీ. నాగర్ కర్నూలు జిల్లా వెల్టూరులో 18.3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.

ఇక హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఈ రోజు కూడా ఏపీతోపాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. కుమురం భీం, నిజామాబాద్, రాజన్న సిరసిల్ల, సిద్దిపేట, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ తోపాటు నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో తేలకపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

మరోవైపు ఏపీలో ఈ రోజు కూడా మొంథా ఎఫెక్ట్ తో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలియజేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరో తొమ్మిది జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, నాలుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. అదేవిధంగా వచ్చే నాలుగు రోజులు సైతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగనున్నాయని తెలిపింది. అయితే రానున్న నాలుగు రోజులు సాధారణ వర్షాలు మాత్రమే కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.

ఈ రోజు కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది.

ఇక ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం కూడా ఉన్నందున ప్రజలు ఇళ్లల్లో ఉండాలని సూచించింది. ఎప్పటికప్పుడు స్థానిక వాతావరణ పరిస్థితులు తెలుసుకోవాలని, ద్విచక్ర వాహనాలపై ఒంటరి ప్రయాణాలు మానుకోవాలని, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా వేడిచేసిన క్లోరినేషన్ చేసిన నీళ్లు మాత్రమే తాగాలని స్పష్టం చేసింది.