Begin typing your search above and press return to search.

అన్ని వైపుల విమర్శలు.. 22ఏ భూముల వివాదంపై ఎట్టకేలకు రేవంత్ సర్కార్ కీలకనిర్ణయం

తెలంగాణలో గత కొంతకాలంగా వేలాది మంది ఆస్తి యజమానులను.. రియల్ ఎస్టేట్ రంగాన్ని కలవరపెడుతున్న 22ఏ నిషేధిత భూముల వివాదానికి చుక్కెదురు కాకుండా పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

By:  A.N.Kumar   |   24 Sept 2026 9:07 PM IST
అన్ని వైపుల విమర్శలు..  22ఏ భూముల వివాదంపై ఎట్టకేలకు రేవంత్ సర్కార్ కీలకనిర్ణయం
X

తెలంగాణలో గత కొంతకాలంగా వేలాది మంది ఆస్తి యజమానులను.. రియల్ ఎస్టేట్ రంగాన్ని కలవరపెడుతున్న 22ఏ నిషేధిత భూముల వివాదానికి చుక్కెదురు కాకుండా పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అనుమతులు ఉన్నప్పటికీ 22ఏ జాబితా కారణంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేయగా.. ఈ సమస్యను సమగ్రంగా పరిష్కరించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

అసలు ఏమిటీ 22ఏ చిక్కుముడి?

రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A ప్రకారం.. ప్రభుత్వ, అసైన్డ్, ఎండోమెంట్ (దేవాదాయ), వక్ఫ్ , కోర్టు వివాదాల్లో ఉన్న భూములను నిషేధిత జాబితాలో చేర్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే గతంలో డిజిటలైజేషన్, భూ రికార్డుల నవీకరణ.. ధరణి పోర్టల్ డేటా మైగ్రేషన్ సమయంలో జరిగిన తీవ్రమైన సాంకేతిక, పరిపాలనా లోపాల వల్ల వేలాది ప్రైవేట్ పట్టా భూములు, నివాస ప్లాట్లు కూడా పొరపాటున ఈ 22ఏ నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయి. దీంతో అత్యంత ఖరీదైన లేఅవుట్లలో అన్ని రకాల అనుమతులు పొంది.. కష్టపడి ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు తమ ఆస్తులను అమ్ముకోలేక, వాటిపై బ్యాంక్ రుణాలు పొందలేక తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు.

అనుమతులున్న లేఅవుట్లకు ఊరట

ఈ సమస్య తీవ్రతను గుర్తించిన రేవంత్ ప్రభుత్వం.. నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన లేఅవుట్లలో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై సమీక్ష చేపట్టింది. ఆమోదిత లేఅవుట్లకు మినహాయింపునిచ్చింది. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, డిటిసిపి వంటి అధికారిక సంస్థల నుంచి పక్కా అనుమతులు పొందిన లేఅవుట్లు/కాలనీలకు 22ఏ కింద పడిన ఆంక్షలను సమీక్షించి.. పెండింగ్ రిజిస్ట్రేషన్లను క్లియర్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. బాధితుల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి త్వరితగతిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు.అనుమతులున్న ప్రతి ఆస్తికి కళ్ళు మూసుకుని రిజిస్ట్రేషన్ జరగదు. సదరు భూమి సర్వే నంబర్, టైటిల్ డాక్యుమెంట్లు, అసలు నిషేధానికి గల కారణాలను రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే జాబితా నుంచి తొలగిస్తారు.

హై లెవల్ కమిటీ ఏర్పాటు.. వేగవంతమైన చర్యలు

ఈ వివాదాన్ని కేవలం రిజిస్ట్రేషన్ల సమస్యగానే కాకుండా సమగ్ర భూ పరిపాలనా సంస్కరణగా చూస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికిగానూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) డి.ఎస్. లోకేష్ కుమార్ నేతృత్వంలో త్రీమెన్ కమిటీని నియమించారు. కమిటీ చైర్మన్గా డి.ఎస్. లోకేష్ కుమార్, సభ్యులుగా బి. పాపిరెడ్డి (న్యాయ శాఖ కార్యదర్శి), రాజీవ్ గాంధీ హనుమంతు (స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ) ఈ కమిటీ 22ఏ కేటగిరీకి చెందిన 12 రకాల ప్రధాన భూ సమస్యలపై నెల రోజుల్లోగా నివేదిక ఇచ్చి వివాదరహిత భూములను నిషేధిత జాబితా నుంచి వేగంగా వేరుచేసేందుకు మార్గదర్శకాలను ఖరారు చేయనుంది.

రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరి

ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం మూలంగా ముఖ్యంగా హైదరాబాద్ రీజియన్ హెచ్‌ఎండిఏ పరిధి , వరంగల్, కరీంనగర్ వంటి ప్రధాన నగరాలు, వాటి పరిసర ప్రాంతాలలోని స్థిరాస్తి వ్యాపారంలో మళ్లీ కదలిక రానుంది. లావాదేవీలు నిలిచిపోయిన ప్లాట్లు మళ్లీ అమ్మకాలు, కొనుగోళ్లకు అందుబాటులోకి రావడం వల్ల అటు ఆస్తిదారులకు, ఇటు ప్రభుత్వ ఖజానాకు రిజిస్ట్రేషన్ ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

కొనుగోలుదారులకు సూచన

ప్రభుత్వం సరళీకరణ చర్యలు చేపట్టినప్పటికీ, కొనుగోలుదారులు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు ‘భూ భారతి’ లేదా ఐ.జీ.ఆర్ఎస్ పోర్టల్‌లలో సదరు సర్వే నంబర్ యొక్క ప్రస్తుత నిబంధనలు, 22ఏ స్థితిగతులను అధికారిక రికార్డుల ద్వారా సరిచూసుకోవడం అత్యంత అవసరం.