Begin typing your search above and press return to search.

సర్కారు సలహాదారులు ఎక్కడ ?

ముఖ్యమంత్రి ప్రజా వ్యవహారాల సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడుగా వెళ్లే ముందు దానికి అధికారికంగా రాజీనామా చేసినా, అనధికారింగా కొనసాగుతున్నట్లు చెబుతున్నారు.

By:  Garuda Media   |   22 Aug 2026 1:32 PM IST
సర్కారు సలహాదారులు ఎక్కడ ?
X

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు, వివిధ శాఖల్లో తీసుకున్న నిర్ణయాల మీద తీసుకుంటున్న నిర్ణయాల మీద వ్యతిరేకతలు పెల్లుబుకుతున్నాయి. సామాన్యుల నుండి విద్యార్థుల వరకు ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖలలో నియమించుకున్న ప్రభుత్వ సలహాదారులు ఎక్కడ అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వానికి 10 మంది క్యాబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి, బీసీ సంక్షేమ మరియు అభివృద్ధి సలహాదారుగా వి.హనుమంతరావు, పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా కె.కేశవరావు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ సలహాదారుగా షబ్బీర్ అలీ, వ్యవసాయ సలహాదారుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్న్ సలహాదారుగా హర్కర వేణుగోపాల్ రావు, అభివృద్ధి పథకాల అమలు సలహాదారుగా పి.సుదర్శన్ రెడ్డి, నీటిపారుదల సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్, పట్టణ రవాణా సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి, క్రీడా శాఖ సలహాదారుగా ఎపీ జితేందర్ రెడ్డిలు ఉన్నారు.

ముఖ్యమంత్రి ప్రజా వ్యవహారాల సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడుగా వెళ్లే ముందు దానికి అధికారికంగా రాజీనామా చేసినా, అనధికారింగా కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. వీరు కాకుండా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సలహాదారులుగా అభిజిత్ బెనర్జీ, రఘురామ్ రాజన్, దువ్వూరి సుబ్బారావు, కిరణ్ మంజుదార్ షాలు ఉన్నారు. ఇక నీటిపారుదల శాఖ సలహాదారుగా ఉన్న ఆదిత్యానాథ్ దాస్ తనకు సహాయకులుగా మరో ఇద్దరు సలహాదారులను నియమించుకున్నారు.

మరి ఇంత మంది సలహాదారులు ప్రభుత్వానికి ఏం సలహాలు ఇస్తున్నారన్న చర్చ మొదలయింది. హైడ్రాతో సామాన్యులలో మొదలైన 22ఎ నిషేధిత భూములకు సంబంధించి కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టడం హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలతో పాటు రాష్ట్రం మొత్తం అలజడి రేపుతున్నది. హైదరాబాద్ లో దశాబ్దాల కింద ప్లాట్లు కొనుక్కుని అన్ని అనుమతులతో ఇండ్లు కట్టుకుని, బ్యాంకులో లోన్లు తీసుకున్న సామాన్యులు ఇప్పుడు ఏదైనా అవసరానికి వాటిని అమ్మేందుకు వెళితే నిషేధిత జాబితాలో ఉన్నట్లు చూయిస్తుండడంతో గందరగోళం మొదలయింది.

ఇక స్వయంగా విద్యా శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పాలిటెక్నిక్ విద్యను శక్తి పథకం కిందకు తీసుకువస్తూ జీఓ 97 విడుదల చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు రోడ్లెక్కారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ లు చేస్తున్నారు. ఒక పోలీసు అధికారి విద్యార్థి గొంతు పట్టుకోవడంతో ఆయనను విధుల నుండి తప్పించారు.

పాలిటెక్నిక్ డిప్లొమా తర్వాత తాము నేరుగా బీ టెక్ రెండో సంవత్సరంలో చేరే లేటరల్ ఎంట్రీ విధానం ఈ పథకం ద్వారా రద్దు అవుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా పాలిటెక్నిక్ విద్య ప్రమాణాలు తగ్గించి ఐటీఐ శిక్షణ స్థాయికి మార్చడం మూలంగా తమ డిగ్రీ విలువ కోల్పోతుంది అన్నది వారి ఆవేదన. అందుకే జీఓ 97 రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నారు.

అటు రెవెన్యూ శాఖలో 22 ఎ, ఇటు విద్యా శాఖలో జీఓ 97 రాష్ట్రంలో అలజడికి కారణం అయ్యాయి. దశాబ్దాల కష్టంతో సంపాదించుకున్న సంపద నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో సామాన్యులు ఆవేదన చెందుతుంటే, 18 ఏళ్లు నిండని విద్యార్థులు తమ భవిష్యత్తు మీద ఆందోళనతో రోడ్డెక్కారు. మరి ఇంత మంది సలహాదారులు ఈ పరిణామాలను పసిగట్టి ప్రభుత్వానికి అప్రదిష్టం రాకుండా ఎందుకు అరికట్టలేకపోతున్నారు అన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగులుతుంది.