మరి 'బీఆర్ఎస్' నుంచి ఎవరు పార్టీ మారినట్టు?!
తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం.. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఈ క్రమంలోనే పది మంది ఆ పార్టీ తరఫున విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేలు.. కేసీఆర్‌కు హ్యాండిచ్చి.. కారు దిగేశారు.
By: Garuda Media | 17 Jan 2026 9:00 AM ISTతెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం.. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఈ క్రమంలోనే పది మంది ఆ పార్టీ తరఫున విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేలు.. కేసీఆర్‌కు హ్యాండిచ్చి.. కారు దిగేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా మారారు. అయితే.. దీనిని సీరియస్‌గా తీసుకున్న బీఆర్ఎస్ నాయకులు.. పది మందిపై న్యాయ పోరాటానికి దిగారు. ఇటు అసెంబ్లీలో స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన లేటు చేస్తుండడంతో హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లారు.
ఇక, విధిలేని పరిస్థితిలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. స్పీకర్ ప్రసాదరావు.. పది మంది ఎమ్మెల్యేల్లో 8 మందిని విచారించారు. వీరిలో ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గత ఏడాదే క్లీన్‌చిట్ ఇచ్చారు. వారికి.. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అంతేకాదు.. అసలు వారంతా బీఆర్ ఎస్‌లోనే ఉన్నారని చెప్పారు. కేవలం ప్రభుత్వ విధానాలు నచ్చి.. వారు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఆకర్షితులు అయ్యారని పేర్కొన్నారు.
కట్ చేస్తే.. ఇప్పుడు తాజాగా మరో ఇద్దరికి కూడా స్పీకర్ ప్రసాదరావు.. వైట్ పేపర్ ఇచ్చేశారు. ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తీర్పు వెల్లడించారు. వీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని స్పష్టం చేశారు. అంటే.. మొత్తంగా ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రసాదరావు క్లీన్ ఇచ్చి నట్టు అయింది. మరోముగ్గురి విషయం మాత్రమే సస్పెన్స్‌లో ఉంది. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి.. ఇప్పటికే రాజీనామాలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
ఇక, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను విచారించినప్పటికీ.. ఆయన వ్యవహారాన్ని స్పీకర్ ప్రసాదరావు సస్పెన్సులో పెట్టారు. ఇదిలావుంటే.. మొత్తంగా 10 మందిలో ఏడుగురు పార్టీ మారలేదని స్పీకర్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. దీంతో బీఆర్ ఎస్ చేసిన వాదన కొట్టుకుపోతుందా? లేక.. సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది చూడాలి. మొత్తంగా స్పీకర్ చెప్పినట్టు.. ఎవరూ పార్టీ మారకపోతే.. ఇంకెవరు మారినట్టు? ఇన్నాళ్లు విచారణలు ఎందుకు చేసినట్టన్నది ప్రశ్న.
