మహిళలకు నెలకు 30 వేలు...ఆర్జేడీ ట్రంప్ కార్డు !
బీహార్ ఎన్నికల సమరం దేశానికి సరికొత్త రాజకీయాన్ని నేర్పుతోంది. ఎన్నో వ్యూహాలు మరెన్నో హామీలు ఇంకెన్నో ప్రణాళికలు ఇలా సాగుతోంది బీహార్ రాజకీయం.
By: Satya P | 23 Oct 2025 3:00 AM ISTబీహార్ ఎన్నికల సమరం దేశానికి సరికొత్త రాజకీయాన్ని నేర్పుతోంది. ఎన్నో వ్యూహాలు మరెన్నో హామీలు ఇంకెన్నో ప్రణాళికలు ఇలా సాగుతోంది బీహార్ రాజకీయం. బీహార్ లో అధికార ఎన్డీయే కూటమికి ప్రతిపక్షంలోని మహా ఘట్ బంధన్ కి మధ్య హోరా హోరీ పోరు సాగుతోంది, ఎవరు గెలిచినా అతి తక్కువ మార్జిన్ తోనే అన్నది అర్ధం అవుతోంది. దాంతో ఏ ఒక్క చిన్న అవకాశాన్ని అసలు ఏ మాత్రం వదులుకోవడానికి ఎవరూ సిద్ధ పడడం లేదు.
మహిళలకు తాయిలాలు :
సాధారణంగా ఎన్నికల్లో బలమైన ఓటు బ్యాంక్ గా మహిళలు ఉంటారు. వారు తలచుకుంటే ప్రభుత్వాలు మారుతాయి. అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా వారిని ప్రసన్నం చేసుకునేందుకే దృష్టి పెడతారు. అలా చూస్తే కనుక బీహార్ లో అధికారంలో ఉన్న ఎన్డీయే ఇప్పటికే మహిళల మీద గురి పెట్టింది. మహిళల స్వయం ఉపాధి కోసం వారి ఖాతాలలో పది వేల రూపాయలను ఇప్పటికే జమ చేసింది. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ నుంచి నితీష్ కుమార్ ఇటీవలనే ప్రారంభించారు. మహిళల ఓట్ల కోసమే అని విపక్షాలు ఈ పధకం మీద విమర్శలు చేశాయి.
ఆర్జేడీ కొత్త పధకం :
ఇక ఆర్జేడీ కూడా మహిళల కోసం కొత్త పధకాన్ని ప్రకటిస్తూ దానిని ప్రధానమైన ఎన్నికల హామీగా చేర్చింది. జీవికా సీఎం స్కీం పేరుతో ఈ పధకాన్ని ఆర్జేడీ అగ్ర నేత మహా ఘట్ బంధన్ తరఫున సీఎం అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న తేజస్వి యాదవ్ ప్రకటించారు. ఈ పధకం ప్రకారం ప్రతీ మహిళకు నెలకు వారి ఖాతాలో ముప్పై వేల రూపాయలు జమ చేస్తారు. అదే విధంగా వారికి శాశ్వత ఆదాయంగా చేసి ఆర్ధిక భరోసా కల్పిస్తామని ఆయన చెప్పారు. అదే విధంగా మహిళల ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తామని అన్నారు. ప్రస్తుతం కాంట్రాక్ట్ లో ఉన్న వారి సర్వీసుని - శాశ్వతం చేస్తామని భారీ హామీ ఇచ్చారు ఇక జీతాలను నెలకు రూ. 30 వేల రూపాయలకు పెంచుతామని కూడా ఆయన చెప్పారు. ఇక 2027 వరకు బకాయి ఉన్న రుణాలపై వడ్డీని వడ్డీ లేని క్రెడిట్‌ను మాఫీ చేస్తామని కూడా మరో హామీ ఇచ్చారు. అలాగే మహిళా దీదీలకు నెలకు రెండు వేల రూపాయలు అదనపు భత్యం అందించబడుతుందని అన్ని కేడర్‌లకు చెందిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల విలువైన బీమా కవరేజీని అందిస్తుందని కూదా ఆర్జేడీ తెలిపింది.
అతి పెద్ద ఓటు బ్యాంక్ :
బీహార్ లో మొత్తం మూడున్నర కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ ఓట్ల మీదనే ఇపుడు అధికార ఎన్డీయే విపక్ష ఆర్జేడీ ఫుల్ ఫోకస్ పెట్టేశాయి. వారి అభిమానం సంపాదించడం కోసం రెండు వైపుల నుంచి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని తమ వైపు తిప్పుకునేందుకు ఆర్జేడీ అతి పెద్ద ట్రంప్ కార్డునే వాడింది. ఏకంగా నెలకు ముప్పయి వేల రూపాయలు మహిళా దీదీలకు అంటూ తేజస్వి యాదవ్ ప్రకటించిన ఈ ఎన్నికల హామీ ఇపుడు చర్చనీయాంశం అవుతోంది.బీహార్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకంగా మారుతున్నారు. 2020లో ఎన్ డీయేని గెలిపించడంలో వారే ముందున్నారు. అందుకే ఈసారి వారి విషయంలో మహా ఘట్ బంధన్ కూడా పూర్తి శ్రద్ధ చూపిస్తోంది. అయితే ఇది అమలు చేయలేని హామీ అని బీజేపీ కొట్టి పారేస్తోంది. ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు ఆర్జేడీ వేసిన ఎత్తుగడగా చిత్రీకరిస్తోంది. చూడాలి మరి ఈ హామీల యుద్ధంలో ఎవరు మహిళల అభిమానాన్ని గెలుచుకుంటారో.
