నితీష్ ఇరవయ్యేళ్ళ అడుగులు...తేజస్వి చెడుగుడు
రెండు దశాబ్దాల కాలం ఇరవయ్యేళ్ళ ముఖ్యమంత్రిత్వం నితీష్ కుమార్ చేతిలో పెడితే ఆయన ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని తేజస్వి నిలదీస్తున్నారు.
By: Satya P | 27 Oct 2025 1:00 AM ISTబీహార్ లో రాజకీయ యుద్ధం మామూలుగా లేదు. లాలూ ప్రసాద్ రాజకీయ వారసుడిగా తండ్రి వ్యూహాలు చాతుర్యం అన్నీ పుణికి పుచ్చుకున్నారు తేజస్వి యాదవ్. తండ్రిని అలా కూర్చోబెట్టి ఆర్జేడీ మొత్తాన్ని నడిపిస్తున్నారు తేజస్వి. ఈసారి పక్కాగా సీఎం చెయిర్ నాదే అన్న ధీమాతో ఆయన ఉన్నారు. అంతే కాదు అటు ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు నితీష్ కుమార్ ల మీదనే ఆయన విమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు. తన కత్తికి అన్ని వైపులా పదును ఉందని రుజువు చేసుకుంటున్నారు.
మార్పు మొదలైంది :
రాజకీయాల్లో కొన్ని పవర్ ఫుల్ స్లోగన్స్ ఉంటాయి. అవి కరెక్ట్ గా జనాలకు కనెక్ట్ కావాలే కానీ సూపర్ డూపర్ సక్సెస్ అయితే కొడతారు. ఇపుడు ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్ కూడా అలాంటి బలమైన స్లోగన్ నే పట్టుకున్నారు. మార్పు మొదలైంది అంటూ ఆయన జనాలకు దానిని తారకమంత్రంగా చెవిలో వేస్తున్నారు. గతం అంతా వారిది భవిష్యత్తు ఇక మనది అని తేజస్వి చెబుతున్న తీరు ఆశలు కల్పిస్తున్న విధానం అయితే బీహార్ లో కొత్త మార్పులను తీసుకుని వస్తుందా అంటే ఏమో గుర్రం ఎగరావచ్చు అన్న సామెత ఉంది కాబట్టి ఏమీ ఈ దశలో చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు.
లోకల్ స్ట్రాటజీతో :
అంతే కాదు నాన్ లోకల్ లోకల్ అంటున్నారు తేజస్వి యాదవ్. బీహార్ లో నితీష్ కుమార్ ని మరోసారి గెలిపిస్తే కనుక పై నుంచి మోడీ అమిత్ షా పాలిస్తారని ఆయన జనాలను హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి బుల్లెట్ ట్రైన్లు, భారీ ప్రాజెక్టులు, నిధులు పధకాలు గొప్పలు క్రెడిట్లూ అన్నీ గుజరాత్ మహారాష్ట్ర కి తీసుకుని పోతున్నారని ఆయన ఎన్డీయే పెద్దల మీద విరుచుకుని పడ్డారు. అదే సమయంలో బీహార్ ని మాత్రం అలా వదిలేశారని నిందించారు. మళ్ళీ ఎన్డీయేని గెలిపిస్తే బీహార్ ఇలాగే ఉంటుంది తప్ప ప్రగతి ఏమిటో చూడలేదని ఆయన అంటున్నారు.
నితీష్ ఏం చేశారు :
రెండు దశాబ్దాల కాలం ఇరవయ్యేళ్ళ ముఖ్యమంత్రిత్వం నితీష్ కుమార్ చేతిలో పెడితే ఆయన ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని తేజస్వి నిలదీస్తున్నారు. నిజంగా ప్రజలకు మంచి చేస్తే అది కనిపించాలి కదా అని అంటున్నారు. ఈ రోజుకీ అభివృద్ధి ఏ రంగంలోనూ లేదని దానికి కారణం నితీష్ కాదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు ఆయనకు ఇప్పటికే ఎన్నో అవకాశాలు ఇచ్చారని ఇపుడు తనకు ఇవ్వాలని బీహార్ ని అభివృద్ధి పధంలో నడిపిస్తాను అని అంటున్నారు.
మోయలేని భారమా :
బీహార్ లో నితీష్ కుమార్ నే ముందు పెట్టుకుని బీజేపీ రాజకీయ యుద్ధం చేయాల్సిన అనివార్యత ఉంది. ఎందుకంటే జేడీయూని కాదంటే అది అసలుకే ఎసరు కాబట్టి. అలాగని ఆయన ఫేస్ తో వెళ్తూంటే రొటీన్ పాలిటిక్స్ కే మళ్ళీ ఓటేయాలా అని జనాల నుంచి వినిపిస్తోంది. మరో వైపు నితీష్ వయసు లో సగం ఉన్న తేజస్వి యువనేతగా ఉన్నారు. ఆయన పట్ల యూత్ అయితే పెద్ద ఎత్తున మొగ్గు చూపిస్తున్నారు మహిళల కోసం కూడా ఆర్జేడీ వరాలు ప్రకటించింది. మరో వైపు ఇరవయ్యేళ్ళలో ఏమి చేశారు అని ఆర్జేడీ ప్రశ్నిస్తున్న తీరుతో ఎన్డీయే కి ఇబ్బందిగానే ఉంది అని అంటున్నారు. ఇరవై ఏళ్ల నితీష్ సీఎం రికార్డు తమకు వరమా లేక భారమా అన్నది ఎన్డీయే నేతలకు అర్ధం కాకుండా పోతోందిట. అదే సమయంలో తేజస్వి యాదవ్ అయితే చెడుగుడు ఆడేస్తున్నారు. చూడాలి మరి బీహార్ దంగల్ ఏ విధంగా ముగియబోతుందో.
