19 ఏళ్లకే ఇంటి నుంచి పారిపోయి... ఇప్పుడు డిప్యూటీ సీఎం అభ్యర్థి!
త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజస్వి యాదవ్ ను మహాఘటబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది
By: Raja Ch | 24 Oct 2025 2:00 AM ISTత్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజస్వి యాదవ్ ను మహాఘటబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. డిప్యూటీ సీఎం అభ్యర్థిగా 'వికాస్ షీల్ ఇన్సాన్' పార్టీ (వీఐపీ) చీఫ్ ముఖేష్ సహానీని కూడా ప్రకటించింది. దీంతో... ఈ 'సన్నాఫ్ మల్లా' వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
అవును... బీహార్ అసెంబ్లీ ఎన్నికలకోసం సీట్ల సర్దుబాటుపై మల్లగుల్లాలు పడిన విపక్ష 'ఇండియా' కూటమి ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ సందర్భంగా... సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థులనూ ప్రకటించింది. ఈ క్రమంలో వెనుకబడిన వర్గానికి చెందిన ఓ యువ నేతను డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఆ సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది.
ఎవరీ ముకేష్ సహానీ..?
బీహార్ లోని దర్భంగా జిల్లాలోని సుపాల్ బజార్ గ్రామానికి చెందిన మత్స్యకార కుటుంబంలో జన్మించిన సహానీ.. 1999లో తన 19 ఏళ్ల వయసులో స్నేహితుడితో కలిసి ఇంటి నుండి ముంబైకి పారిపోయారు. ఆ తర్వాత తొందరగానే తన తండ్రి జితన్ రామ్ వద్దకు తిరిగి వచ్చాడు కానీ.. ఆరు నెలల తర్వాత మళ్ళీ ముంబైకి వెళ్ళిపోయాడు.
ఈ క్రమంలో ఒక కాస్మెటిక్స్ స్టోర్ లో సేల్స్ మ్యాన్ గా పనిచేసిన తర్వాత, సహాని సినిమాలు, టీవీ షోలకు సెట్ లు తయారు చేసే రంగంలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో ముఖేష్ సినీవరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించి.. సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. తర్వాత నితిన్ దేశాయ్, ఉమాంగ్ కుమార్ వంటి ప్రముఖ పరిశ్రమలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు.
ఈ క్రమంలోనే అతనికి బిగ్ బ్రేక్ వచ్చింది. అది.. షారుఖ్ ఖాన్ నటించిన 'దేవదాస్' సినిమాకు సంబంధించిన సెట్స్ లో పని చేయడానికి దేశాయ్ అతన్ని నియమించడమే. ఈ క్రమంలో... బిలియనీర్ ముఖేష్ అంబానీ కోసం డిజైనర్ సందీప్ ఖోస్లా ఒక ప్రదర్శన ఇచ్చినప్పుడు అతనితో కూడా సహానీ పనిచేశాడు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నుంచి ప్రేరణ పొంది..!:
ఈ క్రమంలో 2013 నాటికి.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ వంటి ప్రముఖుల నుండి ప్రేరణ పొందిన సహానీ.. రాష్ట్ర జనాభాలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ఉన్న అత్యంత వెనుకబడిన తరగతుల (ఈబీసీ) కోసం పోరాడటానికి బీహార్ కు తిరిగి వచ్చారు.
ఈ క్రమంలో... 2018లో నిషాద్ - మల్లా హక్కులను కాపాడటానికి ఆయన వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)ని ప్రారంభించారు. ఈ రెండు సామాజికవర్గాలు కలిసి బీహార్ ఓటర్లలో దాదాపు 12% ఉన్నారు.
కాగా... నిషాద్ వర్గానికి చెందిన ఈయన.. పట్నా, దర్భంగాలలో పలు సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి తన సామాజిక వర్గం 'సన్నాఫ్ మల్లా’ గా తనదైన ముద్ర వేసుకున్నారు. మల్లా అనేది నిషాద్ వర్గంలో ఉప కులంగా ఉండగా... రాష్ట్రంలో నిషాద్ ల జనాభా 9.6శాతంగా ఉండగా, సహనీకి చెందిన మల్లాలు 2.6శాతంగా ఉన్నట్లు అంచనా!
పొలిటికల్ ఎంట్రీ..!
ఈ క్రమంలో ప్రధాని మోడీ చొరవతో 2015 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ మద్దతుగా ప్రచారం చేసిన సహనీ.. అనంతరం నిషాద్ వర్గ నాయకుడిగా ఎదిగారు. అయితే.. తమ వర్గానికి ఎస్సీ హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీ నేరవేర్చకపోవడంతో బీజేపీకి ఆయన దూరమయ్యారు. అదే ఏడాది నిషాద్ వికాస్ సంఘ్ పేరుతో తన సామాజిక వర్గాన్ని ఏకీకృతం చేసే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే 2018లో వీఐపీ ని స్థాపించారు. అనంతరం.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహాగటబంధన్ లో చేరి పోటీ చేశారు. అయితే.. ఖాతా మాత్రం తెరవలేదు. ఈ క్రమంలో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎన్డీయే కూటమి తరఫున పోటీ చేయగా.. వీఐపీ తరఫున నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు.
అయితే.. ఆ ఎన్నికల్లో సహానీ మాత్రం ఓడిపోయారు. అయినప్పటికీ ఆయనను ఎమ్మెల్సీ చేసిన బీజేపీ, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి పదవి అప్పగించింది. ఈ క్రమంలో... తన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరణించడం, మరో ముగ్గురు బీజేపీలో చేరిపోవడంతో వీఐపీ కి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. సహనీ ఎమ్మెల్సీ పదవి కూడా ముగిసింది.. మంత్రి పదవి పోయింది!
మరోసారి మహాగటబంధన్ తో...!:
మహాగటబంధన్ లో ప్రధాన పార్టీలుగా ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ (ఎంఎల్) లిబరేషన్ లు సీట్ల పంపకాల కోసం కుస్తీ పడిన నేపథ్యంలో నిషాద్ వర్గానికి మరింత చేరువయ్యేందుకు విపక్ష కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే వీఐపీ నుంచి సహానీకి ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చిది. దీంతో.. ఈ వర్గం ఓటర్లు ఈసారి తమకు మద్దతుగా నిలుస్తారని విపక్ష ఇండియా కూటమి ఆశిస్తోంది.
