తేజస్ ఎందుకు కూలింది? ఏమిటీ ‘నెగెటివ్ జి టర్న్’?
దుబాయ్ ఎయిర్ షోలో మన తేలికపాటి యుద్ధ విమానమైన తేజస్ కుప్పకూలిపోవటం షాక్ కు గురి చేసింది.
By: Garuda Media | 22 Nov 2025 9:57 AM ISTదుబాయ్ ఎయిర్ షోలో మన తేలికపాటి యుద్ధ విమానమైన తేజస్ కుప్పకూలిపోవటం షాక్ కు గురి చేసింది.దీనికి కారణం లేకపోలేదు. భారత వాయుసేనకు చెందిన తేజస్ ఇప్పుడు కీలకభూమిక పోషిస్తోంది. ఇటీవల కాలంలో మిగ్ 21 విమానాలు తరచూ ప్రమాదాలకు లోనవుతూ.. ఎంతో మంది పైలెట్ల ప్రాణాల్ని బలి తీసుకుంటున్న వేళ.. అందుకు చెక్ పెట్టేలా.. వాటిని తొలగించి తేజస్ ను తమ తదుపరి ప్రధాన యుద్ధ విమానంగా ఇండియన్ ఎయిర్ ఫోర్సు భావిస్తోంది.
అలాంటి తేజస్ కుప్పకూలిపోవటం విస్మయానికి గురి చేస్తోంది. ఇందుకు మరోకారణం లేకపోలేదు. ఇప్పటివరకు భారత వాయుసేనలో దీనికి అత్యుత్తమ భద్రతా రికార్డు ఉంది. అందుకు భిన్నంగా చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి కారణమేంటి? అసలేం జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కూలిన తేజస్ యుద్ధవిమానం తమిళనాడులోని సూలూరు స్క్రడ్రన్ కు చెందింది. 2016 నుంచి సర్వీసులో ఉంది. ప్రమాద సమయంలోనే పైలెట్ మరణించినట్లు భావిస్తున్నారు.
ఈ కూలిపోయిన యుద్ధ విమానానికి సంబంధించిన టెక్నికల్ రిపోర్టు సిద్ధమయ్యేందుకు మరికొంత సమయం తీసుకుంటుంది. అయితే.. రక్షణ రంగానికి చెందిన నిపుణులు..విమానయాన రంగానికి చెందిన నిపుణులు ప్రమాదకర సీన్ ను వీక్షించిన తర్వాత దీనిపై స్పందిస్తున్నారు. ఈ ప్రమాదానికి దారి తీసిన ప్రాథమిక అంచనాలు ఏం చెబుతున్నాయి? అన్నది చూస్తే.. తేజస్ యుద్ధ విమానం నేలను ఢీ కొట్టేందుకు ముందు నెగటివ్ జి టర్న్ విన్యాసం చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి చోటు చేసుకున్న అనూహ్య పరిణామంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇంతకూ నెగెటివ్ జి అంటే ఏంటి? ఇదెందుకు విమాన ప్రమాదానికి కారణమవుతుంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ఎయిర్ షో వీడియోల ప్రకారం లూప్ విన్యాసం పూర్తి చేసి విమానాన్ని తిరిగి సమతల స్థితికి తీసుకురావటానికి పైలట్ ప్రయత్నించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలోనే తేజస్ అకస్మాత్తుగా నేలకూలి ఉంటుందని సందేహిస్తున్నారు.
విమానయానంలో నెగెటివ్ జి అంటే సాధారణ గురుత్వాకర్షణకు వ్యతిరేక దిశలో విమానంపై.. అందులోని వస్తువులపై పని చేసే బలాలుగా చెప్పొచ్చు. విన్యాసాలు చేసేటప్పుడు అకస్మాత్తుగా కిందకి దిగేటప్పుడు లేదా గాలిలో తీవ్రమైన అలజడి ఉన్నప్పుడు ఈ బలాల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా ఇలా చేస్తున్నప్పుడు పైలట్ కు బరువు తగ్గినట్లుగా అనిపిస్తుంది. అప్పుడు పైలట్ సీటు నుంచి పైకి నెట్టివేసే బలం పని చేస్తుంటుంది.
మామూలుగా విమానయానంలోలిఫ్ట్ బలం పైకి పని చేస్తుంది. నెగెటివ్ జి విన్యాసాల్లో కిందికి పని చేస్తుంది. దీంతో విమానం కిందకు వెళ్లకుండా దాన్ని పైకి నిలబెట్టేందుకు పైలెట్ ప్రయత్నిస్తుంటాడు. ఇక్కడే నెగెటివ్ జి బలాల్ని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతే పైలట్ కు రక్త ప్రసరణ తల వైపు ఎక్కువగా ఉంటుంది. దీంతో కొన్నిసార్లు అయోమయ స్థితిలోకి వెళ్లటం.. స్ర్పహకోల్పోవటం లాంటివి సంభవిస్తాయి. ఈ బలాల ప్రభావాన్ని కంట్రోల్ చేసుకోవటానికి వీలుగా పైలట్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తుంటారు. నెగెటివ్ జి వంటి విన్యాసాల వేళ నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. దాన్ని కంట్రోల్ చేసేందుకు అత్యాధునిక ఫ్లై బై వైర్ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు. అయినా.. ప్రమాదం చోటు చేసుకోవటం ఇప్పుడు షాక్ కు గురి చేస్తోంది.
ఇదే ప్రమాదం మీద మరో వాదన కూడా వినిపిస్తోంది. తేజస్ పైలట్ ‘బారెల్ రోల్’ అనే విన్యాసాన్ని ప్రదర్శిస్తున్న సమయంలోనే ప్రమాదం జరిగిందని పేర్కొంటూ.. పైలట్ తప్పిదం ఉందా? అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. దీనికి వారు ఇస్తున్న వివరణ ఏమంటే.. బారెల్ రోల్ లో భాగంగా విమానం గాల్లో నిలువుగా 360 డిగ్రీలు చుడుతుంది. ఇలా గిరగిరా తిరగడం సంక్లిష్టమైన ప్రక్రియ కానప్పటికి.. ఇలా చేసినప్పుడు పైలట్ క్షణకాలం తలక్రిందులుగా ఉంటాడు. కచ్ఛితమైన లూప్ నకు ప్రయత్నించిన క్రమంలో మొదట పైకి ఎగసి.. తర్వాత తలకిందులుగా వెళ్లి.. మళ్లీ పైకి ఎగిసే క్రమంలో ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. విమానాన్ని మళ్లీ పైకి లేపే క్రమంలో వేగం సరిపోకపోవటంతోనే కూలిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంజిన్ లో మండలు చెలరేగటం వల్లే కూలిపోయి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తవుతోంది.
