ఇరాన్ ఆయువుపట్టుపై కొట్టిన ఇజ్రాయెల్..
టెహ్రాన్ ఈశాన్య ప్రాంతంలోని సోహాంక్ పరిధిలో అరాష్ హైవే చివరన ఉన్న అక్దసియెహ్ ఆయిల్ నిల్వ కేంద్రంపై జరిగిన దాడి ఇరాన్ రక్షణ సామర్థ్యాలపై ప్రశ్నలు లేవనెత్తింది.
By: A.N.Kumar | 8 March 2026 11:41 AM ISTమధ్యప్రాచ్యం మరోసారి అగ్నిగుండంగా మారుతోంది. దశాబ్దాలుగా ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం.. ఇప్పుడు ప్రత్యక్ష సైనిక ఘర్షణల రూపంలో అత్యంత ప్రమాదకర మలుపు తీసుకుంది. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలోని కీలకమైన అక్దసియెహ్ ఆయిల్ డిపోపై జరిగిన దాడి.. ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితులను తలకిందులు చేసింది. ఈ ఘటన కేవలం ఒక ఆయిల్ డిపో విధ్వంసం మాత్రమే కాదు.. ప్రాంతీయ శక్తి సమతుల్యతలో వచ్చిన పెను మార్పుకు నిదర్శనమని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
దాడి ఘటనతో తీవ్రమైన ఉద్రిక్తతలు..
టెహ్రాన్ ఈశాన్య ప్రాంతంలోని సోహాంక్ పరిధిలో అరాష్ హైవే చివరన ఉన్న అక్దసియెహ్ ఆయిల్ నిల్వ కేంద్రంపై జరిగిన దాడి ఇరాన్ రక్షణ సామర్థ్యాలపై ప్రశ్నలు లేవనెత్తింది. ఈ కేంద్రం నగరానికి ప్రధాన ఇంధన సరఫరా దారుగా పనిచేస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలను బట్టి చూస్తే పేలుళ్ల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆకాశాన్ని తాకుతున్న భారీ మంటలు.. దట్టమైన నల్లటి పొగ మేఘాలు టెహ్రాన్ నగరాన్ని భీతావహంలోకి నెట్టాయి. సమీప ప్రాంతాల్లోని ప్రజలు విన్న భారీ శబ్దాలు.. ఇది ఒక ప్రణాళికాబద్ధమైన క్షిపణి లేదా డ్రోన్ దాడి అని స్పష్టం చేస్తున్నాయి.
వ్యూహాత్మక మార్పు: ఇజ్రాయెల్ వ్యూహం
గతంలో ఇజ్రాయెల్ దాడులు ప్రధానంగా సిరియా లేదా లెబనాన్‌లోని ఇరాన్ అనుకూల మిలిటెంట్ స్థావరాలకే పరిమితమయ్యేవి. అయితే ఇప్పుడు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, ఇజ్రాయెల్ తన 'రెడ్ లైన్స్'ను మార్చుకుందని సంకేతం ఇస్తోంది. ఇంధన నిల్వ కేంద్రాలను ధ్వంసం చేయడం ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై అలాగే యుద్ధ సామర్థ్యంపై దెబ్బ కొట్టాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది ఇరాన్ సైనిక నాయకత్వానికి ఒక బలమైన హెచ్చరిక అని పరిశీలకుల విశ్లేషణ.
అంతర్జాతీయ ప్రభావం.. ఆర్థిక పరిణామాలు
ఈ దాడి ప్రభావం కేవలం ఇరాన్‌కే పరిమితం కాకుండా ప్రపంచ చమురు మార్కెట్లపై పడటం అనివార్యం. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో నెలకొన్న అస్థిరత కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్ వంటి కీలక చమురు ఉత్పత్తిదారు దేశంలో మౌలిక సదుపాయాలు ధ్వంసమవ్వడం, సరఫరా గొలుసులపై ప్రభావం చూపి, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రమాదాన్ని రేకెత్తిస్తోంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ద్రవ్యోల్బణం వైపు నెట్టే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేదే ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంశం. ఇది ఒక పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తే ఫలితాలు ఊహాతీతం. దౌత్యపరమైన పరిష్కారాలు మరుగునపడి, సైనిక చర్యలే రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో మధ్యప్రాచ్య శాంతి మరింత మృగ్యమవుతోంది. రాబోయే గంటలు, రోజులు ఈ ప్రాంత భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
