ఇమేజ్ పడిపోయిన తర్వాత తీన్మార్ మల్లన్న ‘కొత్త పార్టీ’
ముఖ్యంగా సోషల్ మీడియా హవాతో వచ్చిన క్రేజ్, నిలకడైన రాజకీయ శక్తిగా మారకపోతే ఆ ప్రభావం ఎక్కువ రోజులు నిలబడదు.
By: A.N.Kumar | 19 Sept 2025 10:58 AM ISTరాజకీయాల్లో ఒకే ఒక ఆయుధం చాలాసార్లు సరిపోదు. ముఖ్యంగా సోషల్ మీడియా హవాతో వచ్చిన క్రేజ్, నిలకడైన రాజకీయ శక్తిగా మారకపోతే ఆ ప్రభావం ఎక్కువ రోజులు నిలబడదు. తీన్మార్ మల్లన్న పరిస్థితి కూడా ఇప్పుడు అలానే కనిపిస్తోంది.
ఒకప్పుడు ఆయన యూట్యూబ్ లైవ్‌లు లక్షలాది మంది చూస్తూ, టీఆర్ఎస్‌పై విమర్శలు విసిరే ప్రతి మాటకూ పెద్ద హడావుడి చేసేవారు. ఆ హైప్‌ను ఆధారంగా తీసుకుని కాంగ్రెస్ వైపు పయనించిన మల్లన్న, ఆ పార్టీకి ఒక స్థాయిలో బూస్ట్ ఇచ్చాడు. కానీ తర్వాత రాజకీయ మార్పులు, పార్టీలు మారిన తీరు ఆయన ఇమేజ్‌ను దెబ్బతీసింది.
ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలను సోషల్ మీడియా ద్వారా ప్రభావితం చేసిన తీన్మార్ మల్లన్న (Q. న్యూస్ మల్లన్న) ఇప్పుడు తన ప్రాభవాన్ని కోల్పోతున్నారని చెప్పవచ్చు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన యూట్యూబ్ లైవ్‌లు, విమర్శలు లక్షలాది మంది వీక్షకులను ఆకర్షించేవి. ఆ క్రేజ్‌ను ఉపయోగించుకొని ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి, ఆ పార్టీకి ఒక స్థాయి వరకు మైలేజీ ఇచ్చాడు.
*ప్రభావం తగ్గడానికి కారణాలు
తీన్మార్ మల్లన్న ప్రజాదరణ తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక పార్టీ నుండి మరో పార్టీకి మారడం, ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఎమ్మెల్సీ అయ్యాక కూడా ఆ పార్టీని తిడుతూ సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ తర్వాత సొంత పార్టీని ప్రకటించడం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించింది. రాజకీయాల్లో ఒక వ్యక్తికి లేదా పార్టీకి నిలకడ అనేది చాలా ముఖ్యం. ఇది లేకపోవడం వల్ల ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది.
ఒక రాజకీయ పార్టీని నడిపించాలంటే కేవలం విమర్శలు చేయడం, ప్రజల్లో ఉత్సాహం కలిగించడం మాత్రమే సరిపోదు. ఒక స్పష్టమైన లక్ష్యం , రోడ్‌మ్యాప్ , ప్రజలకు ఉపయోగపడే అజెండా ఉండాలి. కానీ మల్లన్న తన సొంత పార్టీ కోసం అటువంటి బలమైన వ్యూహాన్ని రూపొందించుకోలేకపోయారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆయన ప్రసంగాల్లో ఉపయోగించే భాష, కొన్ని సందర్భాల్లో ఆయన చేసే వ్యాఖ్యలు ఆయనపై విమర్శలకు దారితీశాయి. రాజకీయాల్లో వాస్తవాలను, సమాచారాన్ని సరిగ్గా చెప్పడం చాలా ముఖ్యం. నోటి దురుసు, నిరాధారమైన ఆరోపణలు విశ్వసనీయతను దెబ్బతీస్తాయి.
సోషల్ మీడియా క్రేజ్ vs రాజకీయ శక్తి
రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి సోషల్ మీడియా ఒక మంచి వేదిక. కానీ కేవలం సోషల్ మీడియా ద్వారా వచ్చే క్రేజ్ ఒక రాజకీయ శక్తిగా మారడానికి సరిపోదు. ప్రజల ఆదరణను పొందాలంటే, ఒక బలమైన నాయకత్వం , ప్రజా సమస్యలపై అవగాహన, వాటికి పరిష్కారాలు చూపగల సత్తా ఉండాలి. తీన్మార్ మల్లన్న విషయంలో ఆయన సోషల్ మీడియా క్రేజ్‌ను రాజకీయ శక్తిగా మార్చుకోవడంలో విఫలమయ్యారు. ప్రజలు కేవలం విమర్శలు కాకుండా, మార్పును కోరుకుంటారు. ఆ మార్పును చూపించడంలో ఆయన వెనుకబడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ఆయన లైవ్‌లకు లక్షల మంది చూసే స్థాయి నుండి, వేల మంది కూడా చూడని పరిస్థితికి వచ్చారు. ఇది రాజకీయాల్లో నిలకడ, నిజాయితీ, ప్రజలకు ఉపయోగపడే లక్ష్యం ఎంత ముఖ్యమో స్పష్టంగా చూపిస్తోంది.
మొత్తంగా ఇమేజ్ మొత్తం తెలంగాణ ప్రజల్లో పడిపోయిన తర్వాత అన్నీ పార్టీలు తిరిగి చివరకు సొంత పార్టీ కాడికి వచ్చిన తీన్మార్ మల్లన్న రాజకీయ అడుగులు భవిష్యత్తు ముందు ముళ్లబాట ఉంది. దాన్ని ఎలా పూలపాన్పుగా మలుస్తాడు? ప్రజల ఆదరాభిమానాలు ఎలా సంపాదిస్తాడు..? రాజకీయంగా ఎలా ఎదుగుతాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
