ఐటీలో ఇలాంటి తొలగింపు ఎప్పుడూ చూడలేదు.. కంపెనీపై పోలీస్ కేసు పెట్టిన యువతి
ప్రముఖ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా సంస్థపై ఓ మహిళా ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించడం ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
By: A.N.Kumar | 23 July 2026 1:29 PM ISTప్రముఖ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా సంస్థపై ఓ మహిళా ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించడం ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అనారోగ్య సమస్యల వల్ల సెలవులు తీసుకున్నందుకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదా సరైన కారణం లేకుండా తనను ఉద్యోగం నుంచి తొలగించారని భావన అనే బాధితురాలు ఆరోపించింది. కంపెనీ యాజమాన్యం ఉద్యోగుల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
అనారోగ్య సెలవులపై వేధింపులు
బాధితురాలు భావన తెలిపిన వివరాల ప్రకారం... తీవ్రమైన ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె ఇటీవల 13 రోజుల పాటు సెలవు తీసుకుంది. వైద్య నివేదికలు అందించినప్పటికీ కంపెనీ యాజమాన్యం ఆమె పరిస్థితిని ఏమాత్రం అర్థం చేసుకోలేదు. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో నిరంతరం ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్ చేస్తూ "వెంటనే ఆఫీసుకు రావాలి" అని తీవ్ర ఒత్తిడికి గురిచేశారని ఆమె పేర్కొంది.
అనంతరం తన చిన్నారి పాప ఆరోగ్యం కూడా క్షీణించడంతో మళ్లీ సెలవు పెట్టాల్సి వచ్చిందని.. ఆ సమయంలోనూ "ఇంకెన్ని రోజులు సెలవులో ఉంటారు?" అంటూ నిలదీశారని తెలిపింది. ఆ తర్వాత ఎలాంటి వివరణ కోరకుండా.. నోటీసు ఇవ్వకుండానే ఉన్నఫళంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది.
వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సిందే!
కంపెనీలో ఉద్యోగులపై విధిస్తున్న కఠిన నిబంధనలపై కూడా భావన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆఫీసులో కనీసం వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఉందంటే అక్కడి వాతావరణం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించింది. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని, తన సుదీర్ఘ కేరీర్‌లో ఇలాంటి దారుణమైన పని సంస్కృతిని ఎక్కడా చూడలేదని ఆవేదన చెందింది. "మహిళా ఉద్యోగులకు వృత్తిపరమైన బాధ్యతలతో పాటు కుటుంబ, పిల్లల సంరక్షణ బాధ్యతలు కూడా ఉంటాయి. అనారోగ్యం, అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్ సంస్థలు మానవత్వంతో వ్యవహరించాలి" అని బాధితురాలు భావన పేర్కొంది.
న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు
తనకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ భావన పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాఫ్ట్‌వేర్ రంగానికి చెందిన మహిళా ఉద్యోగుల పట్ల ఐటీ యాజమాన్యాలు కఠినంగా వ్యవహరించకూడదని విజ్ఞప్తి చేసింది. అయితే ఈ వ్యవహారంలో బాధితురాలి ఆరోపణలపై టెక్ మహీంద్రా సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదా స్పందన వెలువడలేదు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారా లేక ప్రాథమిక విచారణ జరుపుతున్నారా అనే విషయాలపై త్వరలోనే స్పష్టత రానుంది. ఐటీ రంగంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్, ఉద్యోగుల హక్కులపై ఈ ఘటన మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.
