Begin typing your search above and press return to search.

విదేశీ ప్రయాణాలు వద్దు.. హెచ్-1బీలకు మరో దిగ్గజ సంస్థ హెచ్చరిక

కొన్ని సందర్భాల్లో ఈ ఇంటర్వ్యూ తేదీలు నెలల తరబడి ఏకంగా 2026 మధ్యకాలానికి కూడా వెళ్లిపోతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల పలువురు ఉద్యోగులు అమెురికాకు తిరిగి వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

By:  A.N.Kumar   |   22 Dec 2025 8:00 PM IST
విదేశీ ప్రయాణాలు వద్దు.. హెచ్-1బీలకు మరో దిగ్గజ సంస్థ హెచ్చరిక
X

అమెరికాలో హెచ్1బీ వీసాపై పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే టెక్ దిగ్గజం గూగుల్ ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేయగా.. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా అదే బాటలో నడిచింది. హెచ్1బీ వీసా కలిగిన ఉద్యోగులు అత్యవసరం అయితే తప్ప విదేశీ ప్రయాణాలు చేయవద్దని మైక్రోసాఫ్ట్ తన సిబ్బందికి అంతర్గతంగా సూచించింది.

ఇటీవలి కాలంలో ముఖ్యంగా భారత్ లో వీసా స్టాంపింగ్ అపాయింట్ మెంట్ల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. చాలా మంది హెచ్1బీ ప్రొఫెషనల్స్ వీసా రీన్యువల్ కోసం భారత్ కు వెళ్లగా.. వారి అపాయింట్ మెంట్లు అకస్మాత్తుగా వాయిదా పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ ఇంటర్వ్యూ తేదీలు నెలల తరబడి ఏకంగా 2026 మధ్యకాలానికి కూడా వెళ్లిపోతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల పలువురు ఉద్యోగులు అమెురికాకు తిరిగి వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మైక్రోసాఫ్ట్ పంపిన నోట్ లో చెన్నై, హైదరాబాద్ వంటి అమెరికా కాన్సులేట్ లలో అపాయింట్ మెంట్ లకు తీవ్రమైన ఆలస్యం జరుగుతోందని పేర్కొంది. ఈ ఆలస్యాలకు ప్రధాన కారణం అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కఠినమైన తనిఖీలేనని సమాచారం. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా కార్యకలాపాలపై కూడా సుధీర్ఘంగా పరిశీలనలు జరుపుతుండడంతో ప్రతీ కేసు ప్రాసెసింగ్ కు ఎక్కువ సమయం పడుతోంది. దీని ఫలితంగా పెద్ద ఎత్తున బ్యాక్ లాగ్ ఏర్పడింది.

ఇప్పటికే గూగుల్ తమ ఉద్యోగులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగా వీసా అపాయింట్ మెంట్లు తీవ్రంగా ఆలస్యమవుతున్న నేపథ్యంలో అమెరికాలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు దేశం విడిచి బయటకు వెళ్లవద్దని గూగుల్ సూచించింది. ఈ మేరకు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.గూగుల్ న్యాయ నిపుణుల అంచనా ప్రకారం.. అమెరికా వెలుపలికి వెళ్లిన ఉద్యోగులు తిరిగి దేశంలోకి రావాలంటే వీసా స్టాంపింగ్ తప్పనిసరి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీసా అపాయింట్ మెంట్లు నెలల తరబడి వాయిదా పడుతున్నాయి. ఈ కారణంగా తిరిగి అమెరికాలోకి ప్రవేశించడం కష్టంగా మారే అవకాశం ఉందని సంస్థ హెచ్చరించింది. అందుకే యూఎస్ వీసాల పై ఉన్న ఉద్యోగులు అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండాలని గూగుల్ యాజమాన్యం మెయిల్ ద్వారా సూచించింది.

ఇప్పుడు గూగుల్ బాటలోనే మైక్రోసాఫ్ట్ కూడా అదే సూచనలు ఇవ్వడంతో వీసా రిన్యూవర్ విషయంలో టెక్ రంగంలో ఉన్న అనిశ్చితిపై కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది.

వీసా అపాయింట్ ల పరిస్థితి మెరుగుపడే వరకూ ఉద్యోగుల భద్రత, ఉద్యోగ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త వైఖరినే టెక్ దిగ్గజాలు అవలంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్1బీ ఉద్యోగులు విదేశీ ప్రయాణాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.

డిసెంబర్ 15 నుంచి హెచ్1బీ, హెచ్4 వీసా దరఖాస్తుదారులకు అమెరికా ప్రభుత్వం సోషల్ మీడియా వెట్టింగ్ ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానంతో వీసా అపాయింట్ మెంట్లలో భారీ జాప్యం ఏర్పడుతోంది. హెచ్1బీ, హెచ్4 మాత్రమేకాకుండా ఎఫ్, జే, ఎం వంటి ఇతర వీసాలపైనా దీని ప్రభావం ఉంటుందని గూగుల్ నిపుణులు పేర్కొన్నారు.

కొత్త వెట్టింగ్ విధానం కారణంగా వీసా ఇంటర్వ్యూలను తొలుత 2026 ఫిబ్రవరి మార్చి వరకూ రీషెడ్యూల్ చేసినట్లు అమెరికన్ ఎంబసీ అధికారులు ఇటీవల ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ తేదీలను మరింతగా వాయిదా వేసి అక్టోబర్ నెలకు మార్చినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను సవివరంగా పరిశీలించేందుకు అదనపు సమయం అవసరమవుతుండడంతోనే ఈ జాప్యం జరుగుతోందని అమెరికా అధికారులు వివరణ ఇస్తున్నారు.