Begin typing your search above and press return to search.

భార్యను హత్తుకుని కన్నీటి వీడ్కోలు.. బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా.. వైరల్ వీడియో

బ్రిటన్ (యూకే) రాజకీయాల్లో ఒక అత్యంత అరుదైన, భావోద్వేగ క్షణం చోటుచేసుకుంది.

By:  A.N.Kumar   |   22 Jun 2026 5:45 PM IST
భార్యను హత్తుకుని  కన్నీటి వీడ్కోలు.. బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా.. వైరల్ వీడియో
X

బ్రిటన్ (యూకే) రాజకీయాల్లో ఒక అత్యంత అరుదైన, భావోద్వేగ క్షణం చోటుచేసుకుంది. దేశ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కీర్ స్టార్మర్.. తన చివరి అధికారిక ప్రసంగంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దేశానికి సేవ చేసే అత్యున్నత బాధ్యతను నిర్వర్తించడం తన జీవితంలోనే అతిపెద్ద గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్న ఆయన.. ఇకపై తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించబోతున్నట్లు ప్రకటించారు. ప్రసంగం ముగిసిన వెంటనే వేదిక దిగి.. తన భార్యను ఆప్యాయంగా హత్తుకుని ఆయన కన్నీటి వీడ్కోలు పలికిన దృశ్యం అక్కడి వారందరినీ కదిలించింది. "ఇప్పుడైనా మంచి భర్తగా, తండ్రిగా ఉండాలనుకుంటున్నా" అంటూ తన వీడ్కోలు ప్రసంగంలో కీర్ స్టార్మర్ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేశాయి. రాజకీయాల కంటే, పదవుల కంటే కుటుంబ బంధాలే మిన్న అని ఆయన చాటిచెప్పారు. గద్గద స్వరంతో ఆయన ఏమన్నారంటే "ఈ దేశంలోనే అత్యంత కీలకమైన, పెద్ద ఉద్యోగాన్ని నేను వదిలి వెళ్తున్నాను. బ్రిటన్ ప్రధానమంత్రిగా ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. అయితే, ప్రజా జీవితంలో పడి ఇప్పటివరకు నా కుటుంబానికి న్యాయం చేయలేకపోయాను. ఇప్పుడు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన మరో బాధ్యతపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. నా అద్భుతమైన భార్యకు ఒక ఉత్తమ భర్తగా చేయగలిగినదంతా చేస్తాను. నా పిల్లలకు ఒక మంచి తండ్రిగా ఉండేందుకు నా సమయాన్ని వెచ్చిస్తాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు." అంటూ ముగించారు.

సభా ప్రాంగణంలో మిన్నంటిన చప్పట్లు

ఈ మాటలు చెబుతున్న సమయంలో స్టార్మర్ తన భావోద్వేగాన్ని అదుపులో పెట్టుకోలేకపోయారు. ప్రసంగం ముగించి వేదిక దిగిన ఆయన నేరుగా సభలో ఉన్న తన భార్య వద్దకు వెళ్లి ఆమెను గట్టిగా హత్తుకున్నారు. దేశాన్ని నడిపించిన ఒక శక్తివంతమైన నాయకుడు, భార్య కౌగిలిలో ఒక సామాన్య వ్యక్తిలా మారి కన్నీరు పెట్టుకోవడం అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యానికి, ఆవేదనకు గురిచేసింది. ఈ అద్భుత దృశ్యంతో సభా ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగిపోయింది. పలువురు రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు లేచి నిలబడి ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు

ప్రధానమంత్రి హోదాలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుని, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన స్టార్మర్.. చివరికి కుటుంబానికే మొదటి ప్రాధాన్యత ఇస్తూ తీసుకున్న ఈ నిర్ణయం బ్రిటన్ ప్రజలను సైతం భావోద్వేగానికి గురిచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. "పదవి కంటే కుటుంబమే ముఖ్యమని నిరూపించిన నిజమైన నాయకుడు".. "నిజాయితీ గల భావోద్వేగ వీడ్కోలు" అంటూ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు స్టార్మర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.. ప్రజా జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా కుటుంబ బంధాల విలువ ఎంతో గొప్పదని ఆయన సందేశం మరోసారి గుర్తు చేసిందని.. స్టార్మర్ తన భార్యను హత్తుకున్న ఈ క్షణం బ్రిటన్ రాజకీయ చరిత్రలోనే అత్యంత భావోద్వేగ దృశ్యాల్లో ఒకటిగా నిలిచిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.