పలాశ్ చాటింగ్ వ్యవహారం... క్లారిటీ ఇచ్చిన ఆ 'మరో అమ్మాయి'!
తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం... పలాశ్ ముచ్చల్ మొదట 2017లో తన మాజీ ప్రేయసి బిర్వాషా కు ప్రపోజ్ చేశాడు.
By: Raja Ch | 26 Nov 2025 10:20 PM ISTటీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం ఊహించని పరిణామాల మధ్య నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వాయిదాలకు కారణం స్మృతి తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రి పాలవ్వడమే అని అంతా భావించినా... పలాశ్ ముచ్చల్ మరో అమ్మాయితో చాటింగ్ చేసిన విషయం స్మృతికి తెలియడం కూడా మరో కారణమే అనే ప్రచారమూ సోషల్ మీడియాలో విపరీతంగా జరిగింది!
అయితే... మంధాన తండ్రి అనారోగ్యంతో బాధ పడుతున్నారని.. ఆయనను ఆస్పత్రికి తరలించారని.. ఈ పరిస్థితుల్లో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మంధాన స్పష్టంగా చెప్పిందని.. అందువల్ల వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుందని స్మృతి మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా పేర్కొన్నారు. అయితే తాజాగా స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
దీంతో... ఇది ఆ కుటుంబానికి పెద్ద ఉపశమనం అని, ఇక స్మృతి వివాహానికి సంబంధించి కొత్త తేదీ ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే... ఇక రెండో (అనధికారిక) కారణంగా చెబుతోన్న పలాశ్, మరో అమ్మాయితో చాటింగ్ చేసిన విషయం మాత్రం ఇంకా సజీవంగానే ఉందని అంటున్నారు! ఈ సమయంలో ఆ 'మరో అమ్మాయి' స్పందించింది! దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిందని తెలుస్తోంది.
అవును... స్మృతి వివాహం నిరవధికంగా వాయిదా పడటానికి ఆమె తండ్రి అనారోగ్య విషయం ఒక్కటే కారణం కాదని.. ఆమెకు కాబోయే భర్త ‘మరో అమ్మాయి’తో చాటింగ్ చేశాడని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అలాంటి ప్రచారాలు ఏమాత్రం భావ్యం కాదని చెబుతూ... "దేశం గర్వించదగిన క్రికెటర్ విషయంలో ఏమిటీ పనికిమాలిన రచ్చ?" అని 'తుపాకీ.కామ్' స్పందించిన సంగతి తెలిసిందే!
ఈ సమయంలో ఆ 'మరో అమ్మాయి' స్పందించిందని ప్రచారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... పలాశ్ చాట్ లను పోస్ట్ చేసిన వ్యక్తి తానే అని.. తన గుర్తింపును తాను ఎప్పుడూ వెల్లడించాలనుకోలేదని.. చాట్ లు మే - జూలై 2025 మధ్య జరిగాయని.. అవి ఒక నెల మాత్రమే కొనసాగాయని.. తాను అతన్ని ఎప్పుడూ కలవలేదని, ఎలాంటి సంబంధం పెట్టుకోలేదని ఆమె రాసుకొచ్చింది!
అదేవిధంగా... తాను క్రికెట్ ను ప్రేమిస్తున్నానని.. స్మృతి మంధానను ఆరాధిస్తానని చెప్పుకొచ్చింది. ఇదే క్రమంలో... తాను కొరియోగ్రాఫర్ ను కాదని.. అతన్ని మోసం చేసిన వ్యక్తినీ కాదని చెబుతూ.. తాను ఈ ఎదురుదెబ్బను ఊహించలేదని.. చాట్ లలో తాను తప్పు చేయలేదని స్పష్టంగా ఉందని తెలిపింది. ఇదే క్రమంలో... అతన్ని దెయ్యం చేసింది నేనే అని ఆమె వెల్లడించింది!
ఈ సందర్భంగా తాను ఏ స్త్రీకి ఎప్పుడూ అన్యాయ చేయాలనుకోనని.. దయచేసి నన్ను లక్ష్యంగా చేసుకోవద్దని ప్రతీ ఒక్కరినీ అభ్యర్థిస్తున్నానని.. నేను ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదని ఆమె రాసుకొచ్చింది!
పలాశ్ ముచ్చల్ ప్రపోజల్స్ పైనా చర్చ!:
సోషల్ మీడియాకు ఒకసారి స్టఫ్ గా మారితే.. ఇక ప్రతి ఒక్కరూ తమ తమ క్రియేటివిటీకి పని చెబుతారని.. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలుగా మారిపోయి మరీ పోస్టులు పెడతారని అంటారు! ఈ క్రమంలో మంగళవారం ఉదయం నుంచి సోషల్ మీడియా దాడిని ఎదుర్కొంటున్న పలాశ్ కు సంబంధించిన మరో కీలక విషయంలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అవి అతడి లవ్ ప్రపోజల్ కి సంబంధించినవి కావడం గమనార్హం.
తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం... పలాశ్ ముచ్చల్ మొదట 2017లో తన మాజీ ప్రేయసి బిర్వాషా కు ప్రపోజ్ చేశాడు. చుట్టూ బెలూన్లు, క్యాండిళ్లు, గులాబీ రేకులు నడుమ ఒక మోకాలిపై ఉంచి పలాశ్ ప్రపోజ్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో షేర్ చేయబడినప్పుడు వైరల్ గా మారింది. ఆ సమయంలో బిర్వా కాలేజీ విద్యార్థిని అని చెబుతున్నారు!
కట్ చేస్తే... ఇటీవల పలాశ్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానకు కూడా ఇదే విధమైన రొమాంటిక్ గా, ఓపెన్ గా ప్రపోజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట మరింత వైరల్ గా మారింది. ఈ రెండు విషయాలు ఇప్పుడు మరోసారి నెట్టింట చర్చనీయాంశంగా మారాయి!
పలాశ్ కు మద్దతుగా అతని కజిన్ నీతి తక్!:
ఇలా సుమారు రెండు రోజులుగా పలాశ్ ను టార్గెట్ చేస్తూ అన్నట్లుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతున్న వేళ.. అతని కజిన్ నీతి తక్ అతనికి బాసటగా నిలిచారు. ఇందులో బాగంగా... పలాశ్ ఈ రోజు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడని.. నిజం తెలియకుండా అంతా అతనికి తీర్పు చెప్పకూడదని.. టెక్నాలజీతో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడాన్ని సులభతరం చేస్తుందని.. ఈ సమయంలో దాడికి బదులుగా అతని కోసం ప్రార్థించాలని అభిమానులను కోరింది.
స్మృతికి ఇలా జరగడం చాలా బాధాకరం!:
టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానకు నిజంగా ఇది బ్యాడ్ టైం అనే చెప్పాలి! సరిగ్గా నెల క్రితం ప్రపంచ కప్ ను చేతపట్టి, గుండెల నిండా ఆత్మవిశ్వాసం, సంతోషం, గర్వంతో నిండిన ఆమె హృదయం ఇప్పుడు కచ్చింతగా మానసికంగా ఇబ్బందిని ఎదుర్కొంటుందనే చెప్పాలి. అయితే... అది తన తండ్రి అనారోగ్యం గురించి అని అనుకుంటే.. ఆయన తాజాగా డిశ్చార్జ్ అయ్యారు.. ఆయన ఆరోగ్యానికి ఏమీ ఢోకా లేదని వైద్యులు చెప్పారని అంటున్నారు.
ఇక అంతా హ్యాపీస్, స్మృతి ఫ్యామిలీ హ్యాపీస్ అని అనుకుంటున్న వేళ... ఇలా సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారాలు జరుగుతుండటం నిజంగా బాధాకరమనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే.. సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన, ఆమె ప్రైవసీకి భంగం కలిగించే విషయాలపై ప్రచారాలు మానుకోవాలని.. ఆమె వివాహంపై (అది ఎలాంటిదైనా!) అధికారిక ప్రకటన వచ్చే వరకూ నెటిజన్లు సంయమనం పాటించాలని పలువురు కోరుకుంటున్నారు!
