'దొరికిందని' దోచేస్తే.. జైలు పాలే!
ఇప్పుడు ప్రధాన నగరాలు, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు సహా.. దాదాపు ప్రతి చోటా ఉంటున్నాయి.
By: Garuda Media | 17 Nov 2025 5:24 PM ISTదొరికింది కదా.. అని పక్కవారి సొమ్మును సొంతం చేసుకుందామంటే కుదరదు. ఎందుకంటే.. ఇప్పుడు సీసీ కెమెరాల నిఘాప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. ఒకప్పుడు కొన్ని కార్యాలయాలు.. ఇళ్లకు మాత్రమే పరిమితమైన సీసీ కెమెరాలు.. ఇప్పుడు ప్రధాన నగరాలు, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు సహా.. దాదాపు ప్రతి చోటా ఉంటున్నాయి. దీంతో ఎంత చిన్న దొంగతనమైనా దొరికిపోతోంది. మరీముఖ్యంగా.. ఈ విషయంలో సైబర్ పోలీసులు దేశవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉంటున్నారు.
ఇటీవల యూపీలో ఒక ఘటన వెలుగు చూసింది. గుర్గావ్‌లోని ఓ రోడ్డు పక్కన ఓ వ్యక్తికి బ్యాగు దొరికింది. నేరుగా పోలీసులకు ఇవ్వాలని అనుకుని స్టేషన్‌కు వెళ్లి కూడా.. ఏమైందో ఏమో.. ఆ బ్యాగుతో ఇంటికి చేరుకుని విప్పి చూశాడు. దానిలో 30 వేల నగదు, కొంత బంగారం ఉన్నాయి. వాటిని సొంతం చేసుకున్నాడు. గప్ చుప్‌గా.. ఆ బ్యాగును కాల్చి బూడిద చేశాడు. కానీ.. 20 రోజుల తర్వాత.. బ్యాగు పోగొట్టుకున్న వ్యక్తి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి.. జైలుకు పంపించారు.
ఇక, తాజాగా కూడా దీనికి మించిన ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలోని వేలూరుకు చెందిన ఇన్బ కుమారి అనే మహిళ.. తన డెబిట్ కార్డును పోగొట్టుకున్నారు. తర్వాత.. కొన్ని గంటలకే .. దానిలో 50 వేల రూపాయల నగదును ఎవరో బయటకు తీసేశారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఇంకేముంది.. మెసేజ్‌లో వచ్చిన వివరాల ఆధారంగా ఏటీఎంకు వెళ్లి.. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి.. నగదు డ్రా చేసిన వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. సదరు నగదులో 20 వేలు స్వాధీనం చేసుకున్నారు. 30 వేలతో కొన్న బంగారాన్ని కూడా తీసుకున్నారు.
ఇంతకీ.. ఇలా దొరికిన ఏటీఎంతో నగదు విత్ డ్రా చేసిన వ్యక్తి ఓ మహిళ. ఆమె పేరు దేవి. ఉన్నత విద్యా వంతురాలు. టీచర్ గా పనిచేస్తున్నారు. కానీ, దొరికింది కదా.. అని ఏటీఎం కార్డుతో నగదు దోచేసి.. దొరికిపోయారు. సో.. దొరికింది కదా.. అని దోచుకుందామంటే కుదరదు. సమాజాన్ని గమనిస్తూ.. ప్రతి ఒక్కరి కదలికలపైనా నిఘా నేత్రం(సీసీ కెమెరా) ఒకటుందని గుర్తు పెట్టుకోవాలని చెబుతున్నారు చిత్తూరు జిల్లా పోలీసులు.
