టీడీఆర్ బాండ్ల కుంభకోణం.. ఏపీలో మరో దుమారం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి టీడీఆర్ (TDR - ట్రాన్స్ ఫరబల్ డెవలప్ మెంట్ రైట్స్) బాండ్ల కుంభకోణం చర్చనీయాంశంగా మారింది.
By: A.N.Kumar | 26 Aug 2025 3:58 PM ISTఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి టీడీఆర్ ( TDR - ట్రాన్స్ ఫరబల్ డెవలప్ మెంట్ రైట్స్) బాండ్ల కుంభకోణం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ సీనియర్ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తాజాగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిణిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఒక వీడియోను విడుదల చేయడం సంచలనం కలిగించింది. ఈ కుంభకోణానికి ఆ అధికారిణియే ప్రధాన కారణమని, ఆమె అవినీతిలో ‘అనకొండ’లా వ్యవహరించారని భూమన తీవ్ర విమర్శలు గుప్పించారు.
భూమన ఆరోపణల సారాంశం
భూమన కరుణాకర్‌రెడ్డి తన వీడియోలో మాట్లాడుతూ ఆ ఐఏఎస్ అధికారిణికి ఎటువంటి నైతిక విలువలు లేవని, ఆమె కేవలం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. మంత్రులను కూడా పూచికపుల్లలా చూసేవారని, సొంత శాఖ మంత్రులను సైతం లెక్కచేయలేదని తెలిపారు. కింది స్థాయి అధికారులను తాటకిలా భయపెట్టి తన పనులు చేయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో ఆమె ప్రవర్తన రాష్ట్రానికి తీరని నష్టం కలిగించిందని భూమన ఆరోపించారు
- కుంభకోణం నేపథ్యం - అక్రమాలు
తిరుపతి మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా టీడీఆర్ బాండ్ల జారీలో జరిగిన అవకతవకలు గతంలోనే రాజకీయ వర్గాలలో చర్చకు వచ్చాయి. అయితే, భూమన తాజాగా ఈ అంశాలను మళ్లీ ప్రస్తావించి, ఒక సీనియర్ అధికారిణిపై నేరుగా ఆరోపణలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కుంభకోణంలో జరిగిన ప్రధాన అక్రమాలు చూస్తే.. అసలైన భూ యజమానులకు కాకుండా, నకిలీ జీపీఏల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేసి, అక్రమంగా టీడీఆర్ బాండ్లను జారీ చేశారనేది ఒక ప్రధాన ఆరోపణ. దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని భూమన ఆరోపించారు. టీడీఆర్ బాండ్ల విలువను నిర్ధారించే క్రమంలో భారీ అక్రమాలు జరిగాయి. నగర పరిధిలోని వాణిజ్య భూములకు ఉండే అధిక ధరలను గ్రామీణ ప్రాంతాల భూములకు కూడా అక్రమంగా వర్తింపజేశారని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది.
తిరుపతిలో 18 రోడ్ల విస్తరణ కోసం మొత్తం 375 టీడీఆర్ బాండ్లు జారీ అయ్యాయి. అయితే, వాటిలో సగానికి పైగా అనుమానాస్పదంగా ఉన్నాయని, ఈ కుంభకోణం వల్ల వేల కోట్ల రూపాయల విలువైన బాండ్లు అక్రమంగా జారీ అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి.
- రాజకీయ వర్గాలలో చర్చ
భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపణలతో టీడీఆర్ బాండ్ల వ్యవహారం మరోసారి రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కుంభకోణంలో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం జరిగిందని, కొందరు వ్యక్తులు అక్రమంగా లాభపడ్డారని సమాచారం. భూమన ఆరోపణలపై అధికార ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిణి నుండి ఏమైనా వివరణ వస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై భవిష్యత్తులో మరిన్ని రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది.
