Begin typing your search above and press return to search.

స్థానిక ఎన్నికల్లో సంచలనం: వందల కోట్ల ఆస్తులతో బరిలోకి టీడీపీ మహిళా నేత!

గుడిపాల జడ్పీటీసీ అభ్యర్థి మమత శ్రీ నామినేషన్ పత్రాలతో పాటు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తన కుటుంబ సభ్యుల చరా, స్థిరాస్తుల లెక్కలను అధికారికంగా వెల్లడించారు.

By:  Tupaki Political Desk   |   30 Oct 2026 1:06 PM IST
స్థానిక ఎన్నికల్లో సంచలనం: వందల కోట్ల ఆస్తులతో బరిలోకి టీడీపీ మహిళా నేత!
X

స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సాధారణంగా స్థానిక ఎన్నికలంటే సామాన్య కార్యకర్తలు, మధ్యతరగతి వారే ఎక్కువగా పోటీ పడుతుంటారు. కానీ, ఇందుకు భిన్నంగా కొన్నిచోట్ల సంపన్నులు బరిలోకి దిగుతుండటం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చిత్తూరు జిల్లా గుడిపాల జడ్పీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి మమత శ్రీ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ వివరాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి.

రూ.172.27 కోట్ల ఆస్తులు

గుడిపాల జడ్పీటీసీ అభ్యర్థి మమత శ్రీ నామినేషన్ పత్రాలతో పాటు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తన కుటుంబ సభ్యుల చరా, స్థిరాస్తుల లెక్కలను అధికారికంగా వెల్లడించారు. అఫిడవిట్ ప్రకారం ఆమె కుటుంబానికి మొత్తం రూ.172.27 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో సింహభాగం స్థిరాస్తులే కావడం విశేషం. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.162.99 కోట్లుగా పేర్కొనగా, చరాస్తుల విలువ రూ.9.28 కోట్లుగా ఉంది.

కుటుంబానికి ఉన్న స్థిరాస్తులలో రూ.119.80 కోట్ల విలువైన ఆస్తి మమతశ్రీ భర్త మొగిలీశ్వర నాయుడు (ఈశ్వర నాయుడు) పేరు మీద ఉండగా, మమత శ్రీ పేరుపై రూ.43.64 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీరికి మొత్తం 44.62 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు రూ.24.89 కోట్ల విలువైన నివాస భవనాలు ఉన్నాయి. ఈ స్థిరాస్తులు చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంతో పాటు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనూ విస్తరించి ఉన్నట్లు అఫిడవిట్‌లో పొందుపరిచారు.

అప్పులే రూ.32 కోట్లు

చరాస్తుల విషయానికి వస్తే, టీడీపీ అభ్యర్థి మమతశ్రీ పేరుపై 2 స్కూటీలు ఉండగా, ఆమె వద్ద 1.10 కిలోల బంగారం, 15 కిలోల వెండి ఉన్నాయి. ఆమె భర్త ఈశ్వర నాయుడి పేరుపై 3 సరకు రవాణా వాహనాలు, మరో 3 కాంక్రీట్ మిక్సర్ ట్రక్కులు ఉన్నట్లు తెలిపారు. కాగా, ఆస్తులతో పాటు భార్యాభర్తలిద్దరి పేరిట సంయుక్తంగా రూ.32 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు కూడా స్పష్టం చేశారు. ఆమె భర్త 'ఈశ్వర అభయ' ఫౌండేషన్ ద్వారా వివిధ వ్యాపారాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

స్థానిక ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు

స్థానిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో అభ్యర్థుల ఆస్తుల వెల్లడి రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు జరిగే ప్రత్యక్ష ఎన్నికల్లో కోట్లాది రూపాయల ఆస్తులున్న వ్యాపారవేత్తలు పోటీ చేయడం సహజమే అయినప్పటికీ, గ్రామీణ స్థాయి ప్రజాప్రతినిధి పదవికి కూడా కోటీశ్వరులు బరిలో దిగడమే ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. సాధారణ జడ్పీటీసీ అభ్యర్థిత్వానికే వంద కోట్ల ఆస్తిపరులు పోటీపడుతుండటం చూస్తే రాజకీయాలు పూర్తిగా ధనమయం అయిపోయినట్లుగా భావించాల్సివస్తోందని అంటున్నారు.