పార్లమెంట్ కమిటీల్లో వైసీపీ ఎంపీలు...బీజేపీ బాలెన్స్ స్ట్రాటజీ ?
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. దానికి ప్రాణ వాయువు లాంటి మద్దతు ఏపీ నుంచి అందుతోంది.
By: Satya P | 5 Oct 2026 8:58 AM ISTకేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. దానికి ప్రాణ వాయువు లాంటి మద్దతు ఏపీ నుంచి అందుతోంది. 17 మంది టీడీపీ ఎంపీలు బీజేపీ అధికారానికి ఎంతో ముఖ్యం. అందుకే కేంద్ర మంత్రి వర్గంలో టీడీపీకి రెండు మంత్రి పదవులు దక్కాయి. విస్తరణలో మరో కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. అలాగే ఒక గవర్నర్ పదవి టీడీపీకి ఇచ్చారు, మరోటి కూడా ఇస్తారు అని ప్రచారంలో ఉన్న మాట. ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో టీడీపీకి కానీ జనసేనకు కానీ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి వైసీపీ. అలాగే ఫ్యాన్ పార్టీ కూడా ఎప్పుడూ ఈ రెండు పార్టీలనే టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఇక ఏపీ రాజకీయాల్లో బీజేపీ పెద్దగా లేదు, దాంతో ఆ పార్టీ వైసీపీ మీద అంత స్ట్రాంగ్ గా విమర్శలు చేయదు, మరో వైపు చూస్తే కేంద్ర బీజేపీ పెద్దలు ఎపుడూ ఏపీ మీద ప్రత్యేక ఫోకస్ పెడుతూ ఉంటారు. టీడీపీ వైసీపీల విషయంలో కూడా కాషాయ వ్యూహాలు ఉన్నాయని ప్రచారం కూడా ఉంది.
వైసీపీ ఎంపీలకు చాన్స్ :
ఇదిలా ఉంటే తాజాగా పునర్వ్యవస్థీకరించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలలో ఏపీలో మిత్ర పక్షంగా ఉన్న టీడీపీకి విశేష ప్రాధాన్యత దక్కింది. అది పెద్ద విషయం కాదు కానీ విపక్షంలో ఉన్న వైసీపీకి కూడా ప్రయారిటీ ఇవ్వడమే ఇపుడు రాజకీయ చర్చకు తావిస్తోంది. 2026-27 సంవత్సరానికి గాను పార్లమెంట్ పునర్వ్యవస్థీకరించిన వివిధ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలలో వైసీపీ ఎంపీలకు చోటు లభించింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సంయుక్తంగా ప్రకటించిన నూతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల జాబితా ప్రకారం వైసీపీ ఎంపీలు కీలక కమిటీలలో సభ్యులుగా ఎంపికయ్యారు. ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి వంటి వారు నియమితులయ్యారు. అలాగే అరకు ఎంపీ తనూజా రాణి, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు, మేడా మల్లికార్జున్ రెడ్డిలకు కూడా పార్లమెంటరీ కమిటీలలో పదవులు దక్కాయి. లోక్ సభ రాజ్యసభలలో పార్టీ సంఖ్యాబలం ఆధారంగా వివిధ శాఖలకు సంబంధించిన స్టాండింగ్ కమిటీలు సలహా సంఘాలలో ఎంపీలకు ఈ స్థానాలు కేటాయించారు. వైసీపీకి చూస్తే రెండు సభలలో కలుపుకుని ఎనిమిది మంది ఎంపీల బలం ఉంది.
టీడీపీకి పెద్ద పీట :
ఇదిలా ఉంటే గృహ, పట్టణ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియమితులయ్యారు. వాణిజ్యం పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా విశాఖ మతుకుమల్లి శ్రీభరత్, హోం విభాగం పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, పరిశ్రమలు కమిటీ చైర్మన్ గా రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్‌రావు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కమిటీ చైర్మన్ గా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, కమ్యూనికేషన్లు, ఐటీ కమిటీ చైర్మన్ గా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, రక్షణ కమిటీ చైర్మన్ గా టీడీపీ కేశినేని శివనాథ్, ఆర్థిక వ్యవహారల కమిటీ చైర్మన్ గా నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆహారం, ప్రజా పంపిణీ, వినియోగ వ్యవహారాల కమిటీ ఎంపీగా కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజు నియమితులు అయ్యారు.
కీలక పాత్ర గానే :
ఇక ప్రతి విభాగానికి సంబంధించిన స్టాండింగ్ కమిటీలో మొత్తం 31 మంది సభ్యులు ఉంటారు. ఇందులో లోక్‌సభ నుండి 21 మంది రాజ్యసభ నుండి 10 మంది ఉంటారు. ఈ పార్లమెంటరీ కమిటీల పదవీ కాలం ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత కమిటీలను మళ్లీ పునర్వ్యవస్థీకరిస్తారు. ఈ తాజా నియామకాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మూడు ప్రధాన పార్టీల ఎంపీలు కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల బిల్లుల బడ్జెట్ కేటాయింపులు పాలనా వ్యవహారాల పరిశీలనలో కీలక పాత్ర పోషించనున్నారు. అయితే స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవులు మాత్రం టీడీపీకే దక్కాయి. కానీ ఇందులో వైసీపీ ఎంపీలకు కూడా మెంబర్లుగా చోటు దక్కడం విశేషం. మరి ఏ విధంగా వైసీపీకి చాన్స్ ఇచ్చారు అన్నది మాత్రం రాజకీయ చర్చగా రచ్చగా ఉంది. అయితే పార్లమెంట్ లో పార్టీల ఎంపీల సంఖ్యాబలం బట్టే కమిటీలలో చోటు ఇస్తారని అక్కడ రాజకీయాలకు తావు ఉండదని అంటున్నారు. కానీ ఏపీలో నిప్పులా ఉప్పులా ఉన్న టీడీపీ వైసీపీ పార్లమెంటరీ కమిటీలలో కలసి పనిచేయడం ఆసక్తికరమైన అంశంగానే ఉంది.
