Begin typing your search above and press return to search.

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

చంద్రగిరిలో రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధ, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఆసక్తికర ఆఫర్ ఇచ్చారు. పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరిన ఆమె, ఇద్దరం కలిసి బూత్‌లు పరిశీలిద్దామని సూచించారు. అంతేకాకుండా తన కారులోనే చెవిరెడ్డిని తీసుకెళ్తానని చెప్పడంతో ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

By:  Garuda Media   |   5 Nov 2026 9:39 PM IST
చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!
X

రాజ‌కీయంగా బ‌ద్ధ శ‌త్రువులు.. ఒక‌రి ఇంటిపై వాలిన కాకి.. మ‌రో ఇంటిపై వాలితే ఒప్పుకోనంత రాజ‌కీయ శ‌త్రుత్వం.. అయినా.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో క‌లిసి ముందుకు సాగుదాం.. అంటూ టీడీపీ ఎమ్మెల్యే స‌తీమ‌ణి ఒక‌రు.. వైసీపీ సీనియ‌ర్ నేత చెవిరెడ్డి భాస్క‌ర‌ రెడ్డికి బిగ్ ఆఫ‌ర్ ఇచ్చారు. దీంతో ఈ వ్య‌వ‌హారం. ఏపీ రాజ‌కీయ వ‌ర్గా ల్లో ఆస‌క్తిగా మారింది.

ఎక్క‌డ.. ఎలా..

చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీనేత చెవిరెడ్డి భాస్క‌ర‌ రెడ్డికి, ఇక్క‌డి ప్ర‌స్తుత ఎమ్మెల్యే పులివ‌ర్తి నాని కుటుంబానికి మ‌ధ్య ద‌శాబ్దాల రాజ‌కీయ వైరం కొన‌సాగుతోంది. ఒక‌రంటే ఒక‌రికి గిట్ట‌దు. గ‌త 2024 ఎన్నిక‌ల స‌మ‌యంలో పులివ‌ర్తిపై వైసీపీ నేత‌లు.. హ‌త్యాయ‌త్నం కూడా చేశార‌న్న కేసు ఉంది. ఇలాంటి రెండు కుటుంబాల్లో తాజాగా ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది.

ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలో జ‌రుగుతున్న మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల స‌మ‌యంలో చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి బూత్‌ల‌ను ప‌రిశీలించేందుకు బ‌య‌లు దేరారు. అయితే.. ఆయ‌న ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగుతార‌ని ఊహించిన టీడీపీ ఎమ్మెల్యేపులివ‌ర్తినాని స‌తీమ‌ణి.. ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు సుధ‌.. ఆయ‌న ఇంటి వ‌ద్దకే చేరుకున్నారు. చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మండ‌లాల్లో ప్ర‌శాంతంగా ఎన్నిక‌లు సాగేందుకు స‌హ‌క‌రించాల‌ని చెవిరెడ్డిని కోరారు.

``చెవిరెడ్డ‌న్నా.. ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు స‌హ‌క‌రించండి.`` అని సుధ వ్యాఖ్యానించ‌డంతో చెవిరెడ్డి స‌హా.. ఆయ‌న అనుచ‌రులు షాక‌య్యారు. నిత్యం రాజ‌కీయ ఘ‌ర్ష‌ణ‌ల‌తో అట్టుడిగిపోయే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ త‌ర‌హా ప‌రిస్థితి వ‌స్తుంద‌ని చెవిరెడ్డికూడా ఊహించ‌రు.

అంతేకాదు.. ఇద్ద‌రం క‌లిసి బూత్‌ల‌ను ప‌రిశీలిద్దామ‌ని కూడా సుధ ఆఫ‌ర్ ఇచ్చారు. అక్క‌డితో కూడా ఆగ‌లేదు.. త‌న కారులోనే చెవిరెడ్డిని ఎక్కించుకుని ముందుకు వెళ్దామ‌ని కూడా ఆమె చెప్పారు. దీంతో చెవిరెడ్డికి ఏం చేయాలో తెలియ‌లేదు. అయితే.. ఈ త‌ర‌హా వాతావ‌ర‌ణం నెల‌కొన‌డం ప‌ట్ల ప్ర‌జ‌లు కూడా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే రాజ‌కీయ వాతావ‌ర‌ణం మున్ముందు కూడా కొన‌సాగాల‌ని కోరుతున్నారు.