Begin typing your search above and press return to search.

యంగెస్ట్ పార్టీ...కేంద్ర మంత్రి రామ్మోహన్ కామెంట్స్

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్రా నుంచి కేంద్ర కేబినెట్ లో కీలకమైన పౌర విమానయాన శాఖని నిర్వహిస్తున్నారు.

By:  Satya P   |   21 March 2026 11:00 PM IST
యంగెస్ట్ పార్టీ...కేంద్ర మంత్రి రామ్మోహన్ కామెంట్స్
X

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్రా నుంచి కేంద్ర కేబినెట్ లో కీలకమైన పౌర విమానయాన శాఖని నిర్వహిస్తున్నారు. టాప్ పోర్టు ఫోలియోలలో ఒకటిగా ఉన్న ఈ శాఖను నిర్వహిస్తున్న అత్యంత పిన్న వయస్కుడుగా రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఆయన తండ్రి దివంగత ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రి అయ్యే నాటికి ఆయన వయసు నాలుగు పదులు దాటింది. కానీ రామ్మోహన్ అంత కంటే చిన్న వయసులోనే ఈ కీలక స్థానానికి చేరుకున్నారు. అంతే కాదు డైనమిక్ లీడర్ గా తనను తాను రుజువు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

టీడీపీ వెరీ యంగ్ :

ఈ నేపథ్యంలో విశాఖలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన తాజాగా మాట్లాడుతూ పార్లమెంట్ లో యంగ్ పార్టీగా టీడీపీ ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ మంచి ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు రాబడుతున్నారని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ఈ రోజున పార్లమెంట్ లో యువకుడైన తనతో పాటు ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, హరీష్ బాలయోగి ఇలా మిగిలిన పార్టీలతో పోలిస్తే వారితో యంగెస్ట్ పార్లమెంట్ పార్టీ ఇప్పుడు కేంద్రంలో టీడీపీ ఉందని అన్నారు. అంతే కాదు కేంద్ర అధికారంలో భాగస్వామ్యం అయి యువ శక్తిని చాటుతోందని అన్నారు.

కూటమిలోనూ యూత్ :

అంతే కాకుండా ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో సైతం యువకులే ఎక్కువగా ఎమ్మెల్యేగా ఉన్నారని రామ్మోహన్ తెలిపారు. నారా లోకేష్ నాయకత్వంలో ఐటీ విప్లవాన్ని ఏపీ సాధిస్తోందని, ఇది రాష్ట్ర అభివృద్ధి దిశను మార్చుతోందని కేంద్ర మంత్రి అన్నారు. అలాగే రాష్ట్రంలో కూడా నూతన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఈసారి ప్రభుత్వంలో ఉన్నారని చెప్పారు. అలాగే 80 మందికి పైగా 40 ఏళ్ల లోపు వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉండటం అంటే చాలా కీలక పరిణామం అన్నారు. ఇది కేవలం పొలిటికల్ ఇండికేషన్ మాత్రమే కాదని యువశక్తిపై చంద్రబాబుకు ఉన్న అచంచలమైన నమ్మకం అని ఆయన అన్నారు. యువశక్తికి చంద్రబాబు నిర్దేశించిన ప్రధాన లక్ష్యం అభివృద్ధి అని ఆయన చెప్పారు. బాబు దిశా నిర్దేశకత్వంలో అందరం అదే లక్ష్యం వైపు వెళ్తున్నామని రామ్మోహన్ నాయుడు అన్నారు.

చిన్న వయసులో బాబు :

ఇక ఉమ్మడి ఏపీకి బాబు చిన్న వయసులోనే సీఎం అయ్యారని రామ్మోహన్ గుర్తు చేశారు. తొలిసారిగా 1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సమయం నాడే తన నాయకత్వాన్ని పరిచయం చేస్తూ దేశాన్ని అబ్బురపరిచారని కేంద్ర మంత్రి కొనియాడారు. ఆనాడు బాబు విజన్ 2020 అంటే అపహాస్యం చేసిన వారు నేడు వాటి ఫలాలను అనుభవిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. విజన్ 2020 సాధనకు గతంలో ప్రధానిగా వాజ్ పేయ్ నాయకత్వం కూడా తోడు కావడంతో ఏపీలో స్పష్టమైన ఫలితాలు వచ్చాయని ఆయన విశ్లేషించారు

అవి ఒక పాఠ్యాంశంగా :

చంద్రబాబు ఆలోచనలు అన్నీ ఎపుడూ చాలా ముందు ఉంటాయని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏపీకి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన ఆలోచనలన్నీ స్వర్ణాంధ్ర 2047 మీదనే ఉంచారని అన్నారు. ఆ ఆలోచనలు లక్ష్యాలు సాకారం కావడానికి కూడా అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన చెప్పారు. అలా చంద్రబాబు లక్ష్యం వైపు బలంగా వేస్తున్న అడుగులు కానీ ఆయన ఆలోచనలు కానీ ఈనాటి తరానికి ఒక పాఠ్యాంశంగా మారాలని రామ్మోహన్ నాయుడు ప్రతిపాదించడం విశేషం. విజన్ 2047 సాధనకు బలమైన భాగస్వామ్యం అవసరమైన తరుణంలో పూర్తి తోడ్పాటు కేంద్రం నుండి లభిస్తూ ఉండటం ఏపీకి మరొక శుభపరిణామం అని ఆయన అన్నారు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో ఏపీ తన బలాన్ని ప్రపంచానికి చూపిస్తోందని ఆయన అన్నారు.