సీఎం సొంత జిల్లాలో ట్రాక్టర్ తో వెళ్లి మరీ టీడీపీ కార్యకర్త ప్రహరీ ఢీ
ఈ ఉదంతంలో షాకింగ్ అంశం ఏమంటే.. ట్రాక్టర్ తీసుకొచ్చి టీడీపీ కార్యకర్త ఇంటి ప్రహరీని ఢీ కొట్టటం. ఈ ఉదంతంలో టీడీపీ కార్యకర్తకు గాయాలుఅయ్యాయి.
By: Garuda Media | 22 Aug 2025 9:42 AM ISTఎవరు అవునన్నా.. కాదన్నా.. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉండే ఆ పార్టీ నేతలకు కానీ కార్యకర్తలకు కానీ కొంత సానుకూలత పక్కా. అయితే.. ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన సీన్లు చోటుచేసుకుంటున్నట్లుగా తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ఐదేళ్ల జగన్ పాలనతో టీడీపీ నేతలు.. కార్యకర్తలు అష్టకష్టాలు పడ్డామని తరచూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. కూటమి సర్కారు కొలువు తీరినంతనే.. తమకు తిరుగు లేదన్నట్లుగా పలువురు చెప్పుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఏపీలోని పలుచోట్ల టీడీపీ నేతలు.. కార్యకర్తలపై వైసీపీ నేతలు.. కార్యకర్తల దాడుల ఉదంతాలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా ఆ కోవలోకే మరో ఉదంతం చోటు చేసుకుంది.
ఈ ఉదంతంలో ప్రత్యేకత ఏమంటే.. అది సీఎం చంద్రబాబు సొంత జిల్లా కావటం. ఎన్నికల్లో తన భర్త టీడీపీ ఏజెంట్ గా వ్యవహరించారన్న కోపంతో తన ఇంటి మీదకు దాడి చేయటమే కాదు.. తమను గాయపరిచినట్లుగా బాధితుడి సతీమణి పేర్కొంటున్నారు. తమను ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రి లోకేశ్ లే కాపాడాలని కోరుకుంటున్నారు. ఇంతకూ అసలేం జరిగిందంటే.. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం తమండలంలోని పిళ్లారికుప్పం ఎస్సీ కాలనీకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మునస్వామి ఇంటిపైకి అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త జగన్నాధం దాడికి పాల్పడ్డారు.
ఈ ఉదంతంలో షాకింగ్ అంశం ఏమంటే.. ట్రాక్టర్ తీసుకొచ్చి టీడీపీ కార్యకర్త ఇంటి ప్రహరీని ఢీ కొట్టటం. ఈ ఉదంతంలో టీడీపీ కార్యకర్తకు గాయాలుఅయ్యాయి. ప్రస్తుతం బాధితుడు మునస్వామిని స్థానికులు ఆసుపత్రికి తరలించి.. చికిత్స చేయిస్తున్నారు. తమ మీద రాజకీయ కక్షతో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఈ ఉదంతానికి సంబంధించి స్థానిక ఎస్ఐ మాత్రం.. ఇరువురి మధ్య భూ తగదాలు.. పాతకక్షలు ఉన్నాయని.. అందుకే దాడి జరిగినట్లుగా చెబుతున్నారు. పాతకక్షలు రాజకీయంగానా? వ్యక్తిగతంగానా? అన్న దానిపై మరింత క్లారిటీతో పాటు.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో హాట్ టాపిక్ గా మారింది.
