టీడీపీలో సివంగులు.. వదల్లేదుగా.. !
తాజా మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ మహిళా నేతలు తమ సత్తా చాటారు. కడపలో ఎమ్మెల్యే ఆర్. మాధవి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు చురుగ్గా వ్యవహరించి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. మంత్రి సవిత అనంతపురం జిల్లాలో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమి అభ్యర్థుల విజయానికి పనిచేశారు. చంద్రగిరిలో పులవర్తి సుధ పోలింగ్ సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అనుసరిస్తూ వ్యవహరించిన తీరు కూడా చర్చనీయాంశమైంది.
By: Garuda Media | 6 Nov 2026 5:00 PM ISTకూటమి పార్టీల్లో కీలకమైన టీడీపీలో మహిళా నేతల దూకుడు మరోసారి చర్చకు వచ్చింది. 2024 ఎన్నికల సమ యంలో విజయం దక్కించుకున్న మహిళా నాయకులు.. పార్టీని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతోపాటు పురుష నేతల కంటే కూడా ఎక్కువగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు. అదేసమయంలో ఏ ఎన్నికలు వచ్చినా.. మేమున్నామని నిరూపిస్తున్నారు. తాజాగా జరిగిన మునిసిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పురుష నేతల ప్రభావం ఒకవైపు ఉన్నా.. మరోవైపు టీడీపీ మహిళా నాయకులు కూడా దూకుడు ప్రదర్శించారు.
ఆర్.మాధవి: కడప కార్పొరేషన్ సహా.. తాజాగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కడప ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డప్పగారి మాధవి రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ పార్టీతో పాటు తన హవాను కూడా పెంచుకునేందు కు ఆమె చేసిన ప్రయత్నం ఫలించింది. నియోజకవర్గంపై పట్టును కొనసాగించే క్రమంలో వైసీపీ నేతలకు కౌంటర్‌గా బలమైన అభ్యర్థుల ఎంపిక నుంచి ఆమె ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఫైర్ బ్రాండ్ నాయకురాలు కావడంతో నియోజకవర్గంలో ఆమె మాటే చెల్లుబాటు అయింది. ఇక, ఎన్నికల వేళలో ప్రత్యర్థులను కట్టడి చేసే విషయంలోనూ మాధవి దూకుడుగానే వ్యవహరించారు.
సవిత: ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన సంజీవరెడ్డిగారి సవిత.. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. కానీ.. ఆమె ఆది నుంచి కూడా.. జిల్లాపై బలమైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. తాజా ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకునే విషయంలో సవిత తనదైన దూకుడు ప్రదర్శించారు. ఫైర్‌బ్రాండ్ నాయకురాలు కాకపోయినా.. వివాదాలకు దూరంగా ఉన్నా.. ప్రజలను ఆకర్షించే విషయంలోను.. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని వివరించి ప్రజల ఓటు బ్యాంకును సానుకూలంగా మార్చుకునే విషయంలోనూ మంత్రి సవిత తనదైన ముద్ర వేసుకుని చాలా మునిసిపాలిటీల్లో క్లీన్‌స్వీప్ చేశారు.
పులవర్తి సుధ: పార్టీ పరంగా టీడీపీలో కీలక పోస్టు లేకపోయినా.. చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానీ సతీమణిగా .. జిల్లాలో పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలోని మంగళం పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తనదైన చాతుర్యంతో కట్టడి చేశారు. రిగ్గింగులు, ఘర్షణలు జరగకుండా.. ఆయనను అనుసరిస్తూ.. జనరల్ ఏజెంట్‌గా వ్యవహరించిన సుధా రెడ్డి, ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో "చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికి తన వాహనంలో వెంబడిస్తానని, ఆయన వెంటే ఉంటానని" హెచ్చరించి రాజకీయంగా సంచలనం సృష్టించారు. ఇలా.. అనేక మంది మహిళా నాయకులు టీడీపీలో విశేషంగా కృషి చేయడం గమనార్హం.
