మహిళా మంత్రి పీఏపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. టీడీపీకి వరుస దెబ్బలు
ఉత్తరాంధ్రకు చెందిన ఓ మహిళా మంత్రి అనుచరులపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
By: Tupaki Political Desk | 27 Nov 2025 4:33 PM ISTఉత్తరాంధ్రకు చెందిన ఓ మహిళా మంత్రి అనుచరులపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జిల్లా పరిషత్ హైస్కూలులో పనిచేస్తున్న బాధితురాలి నుంచి మంత్రి ప్రైవేటు సహాయకుడు డబ్బులు తీసుకోవడమే కాకుండా, టీడీపీలో చాలా మంది మనసు పడుతున్నారని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వివాదంపై పోలీసు కేసు నమోదు చేయకపోయినా, బాధితురాలు సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడం సంచలనంగా మారింది. సాక్షి పత్రికతోపాటు టీవీలోనూ ఈ కథనాలు రావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఈ ఆరోపణల్లో నిజానిజాలు ఏంటో తెలియజేయాలని ఇంటెలిజెన్స్ అధికారులతోపాటు పార్టీ సొంత యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల కాలంలో టీడీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా జరుగుతున్న ప్రచారంతో ఆ పార్టీ అధిష్టానంలో తీవ్ర కలవరపాటు కనిపిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కొద్దిరోజుల వ్యవధిలోనే ఇటువంటి వార్తలు రావడంపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. గతంలో ఓ ఎమ్మెల్యే ఓ మహిళా ఉద్యోగి పట్ల దురుసుగా ప్రవర్తించారని వార్తలు వచ్చాయి. దీనిపై పెద్ద వివాదం రేగగా, కప్పిపుచ్చడానికి అధిష్టానం తల ప్రాణం తోకకు వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు మహిళా మంత్రి అనుచరుల ప్రమేయంపై వార్తలు రావడమే కాకుండా, ఆమె కుమారుడిపైనా ఆరోపణలు చేస్తూ సాక్షిలో కథనాలు రాశారు. అయితే సదరు మహిళా మంత్రి కుమారుడికి ఈ ఉదంతానికి ఎటువంటి సంబంధం లేదని ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి తెలియజేశారని అంటున్నారు.
మహిళా మంత్రి సొంత నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ ఓ పాఠశాలలో సబార్డినేట్ గా పనిచేస్తుండగా, ఆమె వద్ద మంత్రి సహాయకుడు రూ.5 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కోవిడ్ సమయంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహిళ భర్త మరణించగా, కారుణ్య నియామకం కోసం మంత్రి ప్రైవేటు పీఏగా పనిచేస్తున్న వ్యక్తి రూ.5 లక్షలు వసూలు చేశాడని ఆరోపిస్తోంది. అయితే తన ఉద్యోగానికి డబ్బు ఖర్చు కాలేదని తెలుసుకున్న బాధితురాలు, డబ్బు తిరిగి ఇచ్చేయమని కోరితే అతడు తప్పుగా ప్రవర్తించాడని చెబుతోంది. ఇదే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళితే ఆమె పట్టించుకోకపోగా, తిరిగి బాధితురాలిపైనే కోప్పడ్డారని చెబుతోంది. దీంతో ఈ విషయం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.
అయితే ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ అంతర్గత విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయని చెబుతున్నారు. బాధిత మహిళకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఉద్యోగం వచ్చిందని, కానీ ఉద్యోగం ఇప్పిస్తానని మంత్రి పీఏ డబ్బులు వసూలు చేశాడని చెప్పడంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో ఇంకేమైనా వివాదం ఉందా? అని ఆరా తీస్తోంది. అయితే తన వద్ద రూ.5 లక్షలు తీసుకున్న మంత్రి పీఏ.. ఆ డబ్బులు ఇమ్మంటే ఇవ్వకుండా తనను దూరంగా ఉన్న మండలానికి బదిలీ చేయించాడని బాధితురాలు ఆరోపిస్తోంది. దీంతో ఇద్దరి మధ్య డబ్బు లావాదేవీలే గొడవకు కారణమా? అని అనుమానిస్తున్నారు. ఏమైనప్పటికీ మహిళ నుంచి ఆరోపణలు రావడంతో ఈ అంశం రాజకీయంగా దుమారం రేపింది. ఇక ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రిని గతంలో కూడా ఓ విషయంలో రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్ చేశారని అంటున్నారు. పార్టీలో ఉన్న వ్యతిరేక వర్గం ప్రత్యర్థులతో చేతులు కలపడం వల్లే సదరు మహిళా మంత్రిపై దుష్ప్రచారం జరుగుతుందని ఆమె అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
