Begin typing your search above and press return to search.

న‌ర‌స‌న్న పేట‌లో మారుతున్న పాలిటిక్స్... రీజ‌నేంటి...?

టిడిపి తరఫున బ‌గ్గు రమణమూర్తి వైసీపీ తరఫున ధర్మాన కృష్ణ దాస్ రాజకీయ వ్యూహాలను అమలు చేస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.

By:  Garuda Media   |   9 May 2026 3:25 PM IST
న‌ర‌స‌న్న పేట‌లో మారుతున్న పాలిటిక్స్... రీజ‌నేంటి...?
X

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. వైసిపి వర్సెస్ టిడిపి మధ్య రాజకీయ వ్యూహాలు మారుతున్నాయి. నేతల మధ్య రాజకీయ పరిస్థితులు కూడా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి.. ఏ నాయకుడు ప్రజలను తన వైపు తిప్పుకుంటాడు అనే విషయం ఆసక్తిగా మారింది. గత చరిత్రను గమనిస్తే దాదాపు 2004 నుంచి ఇద్దరు నాయకుల మధ్య ఈ నియోజకవర్గంలో రాజకీయాలు కొనసాగుతున్నాయి.

టిడిపి తరఫున బ‌గ్గు రమణమూర్తి వైసీపీ తరఫున ధర్మాన కృష్ణ దాస్ రాజకీయ వ్యూహాలను అమలు చేస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ తరపున ధర్మాన కృష్ణ దాస్ ఇక్కడ విజయం సాధించారు. తర్వాత వైయస్ మరణానంతరం జగన్ వైసీపీని పెట్టడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ధర్మాన కృష్ణ దాస్ ఆయన వెంట నడిచారు. ఈ క్రమంలో 2012లో ఉప ఎన్నికలు జరగడంతో కృష్ణదాస్.. వైసీపీ తరఫున విజయం సాధించారు.

ఇక ఆ తర్వాత 2014లో మాత్రం ఆయన పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో బ‌గ్గు రమణమూర్తి విజయం దక్కించుకున్నాడు. 2019 ఎన్నికల నాటికి మరోసారి నియోజకవర్గంలో రాజకీయాలు కృష్ణదాస్‌కు అనుకూలంగా మారాయి. దీంతో ఆయన గెలుపు గుర్రం ఎక్కారు. మళ్లీ 2024 వచ్చేసరికి టిడిపి తరఫున బ‌గ్గు రమణమూర్తి పోటీ చేయడం ప్రజలు ఆయనను గెలిపించడం తెలిసిందే. మొత్తంగా సుమారు 20 ఏళ్లుగా ధర్మాన కృష్ణ దాస్ వర్సెస్ టిడిపి మధ్య రాజకీయంగా పోరాటం సాగుతోంది.

ఈ క్రమంలో కొందరు నాయకులు మారినప్పటికీ గత 2014 నుంచి బగ్గు రమణమూర్తి వర్సెస్ కృష్ణదాస్ మధ్య గెలుపు దోబూచులాడుతోంది. ఒక ఎన్నికల్లో ఒకరు గెలిస్తే.. మరొక ఎన్నికల్లో మరొకరు విజయం సాధిస్తున్నారు. విడతల వారీగా ఇక్కడ అభ్యర్థులను మారుస్తున్న ప్రజలు వచ్చే ఎన్నికల నాటికి ధర్మాన కృష్ణ దాస్ కు మళ్ళీ పట్టం కడతారా అనేది ఆసక్తిగా మారింది. 2014లో రమణమూర్తి గెలిపించారు. 2019 లో కృష్ణ దాస్ ను ఎన్నుకున్నారు. మళ్ళీ 2024 వచ్చేసరికి రమణమూర్తికి ఇక్కడ ప్రజలు అనుకూలంగా మారారు.

ఈ క్రమంలో 2029లో తమ విజయం ఖాయమని కృష్ణ దాస్ వర్గం చెబుతోంది. అయితే, రాజకీయాలు ఎప్పుడు విడతల వారీగా మారుతూ ఉంటాయా.. ప్రజల ఆలోచన విధానాలు కూడా విడతల వారీగా మారుతూ ఉంటాయా అనే విషయం చెప్పలేం. కానీ, వైసీపీలో మాత్రం ఆశలు కనిపిస్తున్నాయి. మరోవైపు కృష్ణ దాస్ కూడా దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. అయితే.. వ‌య‌సు రీత్యా కొంత ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ పార్టీ తరఫున కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

దీంతో నరసన్నపేట రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఇరువురి మధ్య రాజకీయ సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో పర్యటనలు కూడా అలాగే సాగుతున్నాయి. ఏ చిన్న కార్యక్రమం తలపెట్టిన వైసీపీ తరఫున ధర్మాన కృష్ణ దాస్ కచ్చితంగా పాల్గొంటున్నారు. ఇక టిడిపి తరఫున కూడా ప్రతి నెల ఒకటో తారీఖున ఇచ్చే పింఛన్ల కార్యక్రమంలో రమణమూర్తి హాజరవుతున్నారు. ఇలా ఎవరికివారు పోటాపోటీగా వ్యవహరిస్తుండడం విశేషం. మరి 2029లో విజయం ఎవరిని వివరిస్తుందనేది చూడాలి.