బాబు పట్టు...జగన్ విడుపు
ఏపీ రాజకీయం చూస్తే రెండు కుటుంబాలు రెండే పార్టీలు, రెండే దారులు అన్నట్లుగానే సాగుతున్నాయి. ఇది రెండున్నర దశాబ్దాలుగా కొనసాగుతోంది.
By: Satya P | 20 Nov 2025 9:32 AM ISTఏపీ రాజకీయం చూస్తే రెండు కుటుంబాలు రెండే పార్టీలు, రెండే దారులు అన్నట్లుగానే సాగుతున్నాయి. ఇది రెండున్నర దశాబ్దాలుగా కొనసాగుతోంది. విభజన ఏపీలో కూడా అదే తీరుగా కధ ఉంది. 2011 కడప లోక్ సభ ఉప ఎన్నికల నుంచి వైసీపీ టీడీపీని నేరుగా ఢీ కొట్టడం మొదలెట్టింది. అక్కడ సూపర్ హిట్ అయింది. 2012లో జరిగిన వివిధ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లోనూ వైసీపీ విజయ ఢంకా భజాయించింది. ఇక 2014లో అయితే కేవలం అయిదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరం అయింది. అలా నవ్యాంధ్ర లో జరిగిన మొదటి ఎన్నికల్లోనే ఢీ అంటే ఢీ అంటూ దశాబ్దాల టీడీపీని మూడేళ్ళ వయసు కలిగిన వైసీపీ సూటిగా గట్టిగా ఎదుర్కొంది.
ఊపిరి ఆడనీయలేదుగా :
మరో వైపు చూస్తే 2014లో వైసీపీ మంచి నంబర్ తో ప్రతిపక్షంలోకి వచ్చింది. జగన్ తొలిసారి ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారు. ఆయనకు అనుభవం ఏముంది అనుకున్న వారిని షాక్ తినిపిస్తూ అసెంబ్లీ లోపలా బయటా టీడీపీని ఊపిరిసలపనీయకుండా చేశారు. అలా మూడేళ్ళ పాటు ఆందోళనలు అసెంబ్లీలో నిలదీతలతో జగన్ చిచ్చర పిడుగే అయ్యారు. ఆ తరువాత 2017 నుంచి జగన్ సాగించిన భారీ పాదయాత్ర మరో ఎత్తుగా ఉంది. 2019లో అధికారంలోకి వస్తాం అంటూ ధీమాగా చెప్పి అది నిజం చేసి చూపించారు జగన్. నాలుగు దశాబ్దాల టీడీపీని 23 సీట్లకు పరిమితం చేస్తూ 151 సీట్లతో వార్ వన్ సైడ్ చేశారు. సీఎం గా ఇక జగన్ అనుకున్నది క్యాడర్ కి చెప్పింది ఒక్కటే ఇక మరో మూడు దశాబ్దాల పాలన వైసీపీదే అని.
కట్ చేస్తే సీన్ సితార్ :
అయితే వైసీపీ అంచనాలు ఆలోచనలు ఏవీ 2024లో ఫలించలేదు, 11 సీట్లతో వైసీపీ చతికిలపడింది. ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ ఎరగని విధంగా ఘోర పరాజయం భుజాలకు ఎత్తుకుంది. దాంతో వైసీపీ నిలువెల్లా కృంగిపోయింది. అధినేత నుంచి క్యాడర్ వరకూ అంతా భారీ షాక్ నుంచి బయటపడడానికి చాలా సమయమే తీసుకుంది అని చెబుతారు. ఇక ఇపుడు చూస్తే వైసీపీ ఓడి పద్దెనిమిది నెలలు గడిచాయి. కూటమి అధికారం దాదాపుగా మూడింట ఒక వంతు మరో రెండు నెలలలో పూర్తి అవుతుంది. ప్రభుత్వం తీరు పట్ల జనాలు కూడా నెమ్మదిగా ఒక అంచనాకు వచ్చే సమయం కూడా ఇదే.
మునుపటి జగన్ కాదా :
ఏపీలో చూస్తే మూడు పార్టీలతో కూటమి బలంగా ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ హవా మామూలుగా లేదు, బీహార్ లో మరో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించి ఎన్డీయే ఊపు మీద ఉంది. ఏపీలో సైతం 2024 మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తోంది. ఇక తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఏపీలో చూస్తే విపక్షంగా వైసీపీ అనుకున్న స్థాయిలో దూకుడు చూపించలేకపోతోంది అని అంటున్నారు. జగన్ వైపు నుంచి అయితే సైలెన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ఆయన అసెంబ్లీకి రావడం లేదు, దాంతో చట్టసభకు ఉన్న విశేష ప్రాధాన్యత దృష్ట్యా ఆ వేదిక వైసీపీ కోరి వదులుకుంది. ఇక జనంలో అయినా ఉంటే మరో మేలుగా ఉండేది. కానీ అదీ పెద్దగా జరగడం లేదు, మీడియా సమావేశాల ద్వారా అయినా వాయిస్ వినిపించే ప్రయత్నం కూడా చాలా తక్కువగా సాగుతోంది. వైసీపీ అధినాయకత్వం ఈ తీరున ఉంటే నేతలు క్యాడర్ సైతం అయోయమయంలో పడుతున్నారు.
బిగించేశారా :
చంద్రబాబు ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు అనడానికి ఎన్నో ఉదాహరణలు. ఆయన ఈసారి వైసీపీకి మళ్ళీ చాన్స్ ఇవ్వదలచుకోలేదని ఆయన తీరుని బట్టే అర్థం అవుతోంది. కూటమి 2024లో సాధించిన 50 శాతానికి పైగా ఓట్ల షేర్ ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించుకోరాదని వీలైతే దానికి మరింత జత కలుపుకోవాలని చూస్తున్నారు. వైసీపీకి వచ్చిన 40 శాతం ఓటు షేర్ ని చిల్లు పెట్టాలని పధక రచన చేస్తున్నారు. అందుకే రాయలసీమకు అందునా జగన్ సొంత జిల్లా కడపకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఎప్పటికపుడు అనేక ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలు నిర్వహించి జనాలను తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు.
వ్యూహమా లేక :
ఇక మౌనంగా వైసీపీ అధినేత వ్యవహరిస్తున్నారు అంటే దాని వెనక బలమైన వ్యూహం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. అదే సమయంలో కూటమి దూకుడుకి ఏ పధక రచన చేయాలి అన్న ఆలోచనలు అయినా అయి ఉండాలని కూడా అంటున్నారు. లేక మూడు ఎన్నికలు చూసిన తరువాత తమ అయిదేళ్ళ పాలన తరువాత జనం ఇచ్చిన తీర్పుతో కొంత నిర్వేదం చెంది అయినా ఉండాలని విశ్లేషకులు అంటున్నారు. వీటికి జవాబు రావాలీ అంటే జగన్ యాక్షన్ ప్లాన్ ఏంటో తెలియాల్సి ఉంది. చంద్రబాబు అయితే గట్టిగానే పట్టు బిగిస్తున్నారు. జగన్ కోరి వదిలేస్తున్నారా లేక ఆ విడుపు వెనక పదునైన చాణక్యం ఉందా అంటే వెయిట్ అండ్ సీ.
