Begin typing your search above and press return to search.

టీడీపీలో బీసీ నేతల కొరత.. విజయవాడ మేయర్ పీఠంపై కన్నేసిన వారంతా అగ్రవర్ణాల వారే?

ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి బుద్ధా వెంకన్నకు కాలం కలిసొచ్చేలా కనిపిస్తోందని టీడీపీలో ఓ వర్గం భావిస్తోంది.

By:  Tupaki Political Desk   |   5 Oct 2026 7:49 PM IST
టీడీపీలో బీసీ నేతల కొరత.. విజయవాడ మేయర్ పీఠంపై కన్నేసిన వారంతా అగ్రవర్ణాల వారే?
X

బడుగు, బలహీన వర్గాల పార్టీగా ప్రచారం చేసుకునే టీడీపీలో బీసీ నేతలకు కొదవ ఉండదని చెబుతుంటారు. పార్టీ ఆవిర్భవం నుంచి బీసీలకు అవకాశాలు కల్పించి పెద్ద పదవులు కట్టబెట్టిన పార్టీగా టీడీపీ భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటుంటుంది. అయితే గతమేమో కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని ప్రధాన నగరాల్లో టీడీపీకి బీసీ నాయకత్వం సమస్యగా మారినట్లు చెబుతున్నారు. ప్రధానంగా రాష్ట్ర రాజధాని పరిధిలో ఉన్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో సమర్థులైన బీసీ నేతల కొరత స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పదవి కోసం దాదాపు అర డజను మంది పోటీ పడుతుండగా, వారంతా అగ్రవర్ణాలకు చెందిన నాయకులే కావడం గమనార్హం. మేయర్ పీఠం బీసీలకు రిజర్వు అయితే పరిస్థితి ఏంటి? అన్న చర్చ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

రాష్ట్రంలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే చర్చ ఆసక్తి రేపుతోంది. రాజధాని అమరావతి పరధిలో ఉన్న విజయవాడ కార్పొరేషన్ పీఠంపై టీడీపీలో పలువురు నాయకులు ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ప్రధానంగా సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా కుమారుడు సిద్ధార్థ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సిద్ధార్థ్ తోపాటు సీనియర్ నేతలు కొమ్మారెడ్డి పట్టాభి, చెన్నుపాటి గాంధీ, గన్నే వెంకట నారాయణ ప్రసాద్, బొప్పన భవకుమార్, ముమ్మనేని ప్రసాద్, జాస్తి సాంబశివరావు, కోగంటి రామారావు, దేవినేని అపర్ణ, కోనేరు రమాదేవి, చెన్నుపాటి ఉషారాణి తదితరుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే వీరంతా అగ్రవర్ణాలకు చెందిన నాయకులే అంటున్నారు. దీంతో మేయర్ పీఠం బీసీలకు రిజర్వు అయితే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న టీడీపీ వర్గాలను ఆలోచనకు గురిచేస్తోందని అంటున్నారు.

గతంలో బీసీ మహిళకు రిజర్వు చేసిన విజయవాడ మేయర్ పీఠం ఈ సారి బీసీ జనరల్ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. దీంతో నగరంలో గుర్తింపు ఉన్న బీసీ నేతలు ఎవరు ఉన్నారు? మేయర్ సీటుకు తగిన నేతలు ఉన్నారా? అని టీడీపీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. రిజర్వేషన్లు రొటేషన్ ప్రకారం బీసీ జనరల్ లేదా ఓసీ జనరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతుండటంతో ఆశావహులు టెన్షన్ పడుతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఓసీ నేతలే ఎక్కువగా మేయర్ పదవిపై ఆశలు పెట్టుకోవడం, విజయవాడ నగరంలో బీసీ నేతలు జల్లెడ పట్టినా కనిపించకపోవడంపై కౌన్ బనేగా విజయవాడ మేయర్ అన్న టాపిక్ హాట్ హాట్ గా సాగుతోందని అంటున్నారు.

బుద్ధాకు కలిసొస్తున్న కాలం?

ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి బుద్ధా వెంకన్నకు కాలం కలిసొచ్చేలా కనిపిస్తోందని టీడీపీలో ఓ వర్గం భావిస్తోంది. నగరంలో గుర్తింపు ఉన్న బీసీ నేతగా ఆయన ఒక్కరే కనిపిస్తున్నారని చెబుతున్నారు. ఎంపీ కేశినేని చిన్ని అండదండలతోపాటు టీడీపీ అధిష్టానంతో సత్సంబంధాలు, ముఖ్యంగా యువనేత లోకేశ్ ఆశీస్సులు ఉండటంతో బుద్ధా కుటుంబం నుంచి ఎవరో ఒకరు మేయర్ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. అయితే బుద్ధాకు మేయర్ సీటుపై ఆలోచన లేదని, అవకాశం వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో నగరానికి చెందిన మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు, లుక్కా సాయిరామ్ ప్రసాద్ పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.

ప్రత్యక్షంతో తంటా

మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్ష విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఇప్పుడు ఇబ్బందికరంగా మారినట్లు ఉందని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. పరోక్ష విధానంలో అయితే చాలా మంది కార్పొరేటర్ అభ్యర్థులు అందుబాటులో ఉండేవారని, వారిలో ఒకరికి అవకాశం దక్కేదని అంటున్నారు. కానీ ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు అంటే మేయర్ అభ్యర్థికి ఫేస్ వాల్యూ ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. నగరంలోని ముఖ్యనేతలు అందరినీ కలుపుకొని వెళ్లడం, సమన్వయం చేసుకోవాల్సిన సమర్థత కూడా అవసరం అంటున్నారు. ఈ పరిస్థితుల్లో విజయవాడ మేయర్ రిజర్వేషన్ పై ఉత్కంఠ నెలకొందని అంటున్నారు. బీసీ రిజర్వేషన్ అయిన పక్షంలో సరైన అభ్యర్థి వెతకడం టీడీపీకి కత్తిమీద సాములా మారినట్లేనంటున్నారు.