నెల్లూరు టాక్: కేంద్ర మంత్రిగా వేమిరెడ్డి.. ?
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. అవకాశం కోసం ఎదురు చూసే నాయకులకు అదృష్టం ఏ రూపంలో ఎప్పుడైనా తలుపు తట్టే అవకాశం ఉంటుంది.
By: Garuda Media | 14 Jan 2026 11:37 AM ISTరాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. అవకాశం కోసం ఎదురు చూసే నాయకులకు అదృష్టం ఏ రూపంలో ఎప్పుడైనా తలుపు తట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే కేంద్ర మంత్రి వర్గ ప్రక్షాళన ఉన్న నేపథ్యంలో నెల్లూరు ఎంపీ.. టీడీపీ నాయకుడు వ్యాపారవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అదృష్టం తలుపుతడుతోందని అంటున్నారు పరిశీలకులు. ఈ వ్యవహారంపై నెల్లూరులో పెద్ద ఎత్తున చర్చ కూడా సాగుతోంది.
ఈ ఏడాది వచ్చే రెండు మూడు మాసాల్లో కేంద్ర మంత్రి వర్గ ప్రక్షాళన జరగనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కేంద్రంలో తమకు అండగా ఉంటున్న పార్టీలకు మరిన్నిపదవులు ఇవ్వాలని.. తద్వారా బలాన్ని పెంచుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో టీడీపీకి ఇప్పటికే రెండు పదవులు దక్కాయి. అయితే.. మరోపదవిని కూడా టీడీపీకి ఇస్తున్నారన్న ప్రచారం ఉంది.
దీనికి గత కొంత కాలంగా..పలువురు పోటీ పడుతున్నారు. అయితే.. నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు తాజాగా తెరమీదికి వచ్చింది. వచ్చే 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఎంపిక విషయంపై చర్చ జరుగుతోంది. వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలన్నది కూటమి ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలోనే రెడ్డి సామాజిక వర్గాన్ని మరింతగా తమవైపు తిప్పుకోవడం లేదా.. వైసీపీకి దూరంగా ఉంచడం అనే కాన్సెప్టుతో టీడీపీ పనిచేస్తోంది.
దీనిలో భాగంగానే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వేమిరెడ్డిని కేంద్రంలో మంత్రిని చేయడం ద్వారా.. ఈ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. .ప్రస్తుతం.. గుంటూరు కు చెందిన పెమ్మసాని చంద్రశేఖర్.. శ్రీకాకుళానికి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు మంత్రులుగా ఉన్నారు. వీరిలో పెమ్మసాని కమ్మసామాజిక వర్గానికి చెందిన నాయకుడు.
ఇక, కింజరాపు బీసీ సామాజిక వర్గం యువ నేత. ఈ క్రమంలో రెడ్లకు కూడా కేంద్రంలో ప్రాధాన్యం ఇస్తే..దాదాపు 11 సంవత్సరాల తర్వాత.. ఏపీ నుంచి రెడ్డినేత కేంద్రంలో మంత్రి అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇది తమకు లాభిస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఈ చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.
