తిరువూరులో కొలికపూడి తాజా ఫైట్.. ఈ సారి టార్గెట్ ఎవరంటే?
టీడీపీలో అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా ముద్రపడిన తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదానికి తెరతీశారు.
By: Tupaki Political Desk | 8 April 2026 7:38 PM ISTటీడీపీలో అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా ముద్రపడిన తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదానికి తెరతీశారు. ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం నుంచి వివాదాలతో సహవాసం చేస్తున్న కొలికపూడి ఈ సారి టీడీపీ మాజీ ఇంచార్జి దేవదత్ ను టార్గెట్ చేశారు. ఏకంగా ఎమ్మెల్యేనన్న విషయాన్ని మరచి దేవదత్ కు వ్యతిరేకంగా రోడ్డుపై ధర్నాకు దిగారు ఎమ్మెల్యే కొలికపూడి. తిరువూరు జాతీయ రహదారిపై ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ధర్నాకు దిగడం చర్చనీయాంశం అవుతోంది. టీడీపీ సీనియర్ నేత దేవదత్ ను లక్ష్యంగా చేసుకునే ఎమ్మెల్యే ఇలా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో చివరి నిమిషంలో తిరువూరు టీడీపీ టికెట్ ను దక్కించుకున్నారు ఎమ్మెల్యే కొలికపూడి. అప్పటివరకు నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న దేవదత్ ను కాదని కొలికపూడికి టీడీపీ అధిష్టానం పెద్దపీట వేసింది. చివరి నిమిషంలో టికెట్ తిరస్కరించినా దేవదత్ మాత్రం పార్టీ సూచనలను పాటిస్తూ కొలికపూడి విజయానికి ప్రయత్నించారని అంటున్నారు. అయితే గెలిచిన మరుక్షణం నుంచి ఈ ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని, రానురాను ఇవి తీవ్ర రూపం దాల్చాయని చెబుతున్నారు. ప్రస్తుతం అధిష్టానం వద్ద ఎమ్మెల్యే కొలికపూడి పరపతి తగ్గడంతో దేవదత్ కొంచెం యాక్టివ్ అయ్యారని, ఇది జీర్ణించుకోలేక దేవదత్ కు చెక్ చెప్పేలా ఎమ్మెల్యే కొలికపూడి పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు.
తాజా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, టీడీపీ నేత దేవదత్ వర్గాల మధ్య విభేదాలతో ఉద్రిక్తతలు నెలకొనడంపై పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోందని అంటున్నారు. తిరువూరు జాతీయ రహదారిపై ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించడంతో పార్టీలో రెండు వర్గాలు మరోసారి రోడ్డెక్కినట్లైందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే ధర్నా చేస్తున్న సమయంలోనే పార్టీ నేత శావల దేవదత్ అక్కడికి చేరుకున్నారు. ఈయన ఇప్పుడు రాష్ట్ర ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్ గా పనిచేస్తున్నారు. కొలికపూడి రోడ్డుపై బైఠాయించిన సమయంలోనే దేవదత్ అక్కడికి రావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
రెండువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. అయితే తనతో విభేదిస్తున్న ఎమ్మెల్యే కొలికపూడి పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి చౌకబారు పనులు చేయడం ఎమ్మెల్యే స్థాయికి సరికాదని దేవదత్ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఇక ఎమ్మెల్యే మాత్రం వేరే వాదన వినిపిస్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే హోదాలో ఉంటూ రోడ్డుపై బైఠాయించడమే కలకలం రేపుతోంది. తొలి నుంచి వివాదాస్పద వైఖరితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కొలికపూడి తాజా వివాదంతో తనలో ఎలాంటి మార్పు రాలేదని, రాబోదని తేల్చిచెప్పారని టీడీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
