Begin typing your search above and press return to search.

టీడీపీ కంచుకోట‌కు.. త‌మ్ముళ్ల బీట‌లు.. !

టీడీపీకి కంచుకోట వంటి నియోజ‌క‌వ‌ర్గాలు చాలానే ఉన్నాయి. పైకి అంద‌రికీ తెలిసినవి కొన్ని ఉంటే.. కొంద‌రికి మాత్ర‌మే తెలిసిన‌వి కొన్ని ఉన్నాయి.

By:  Garuda Media   |   17 Feb 2026 11:00 AM IST
టీడీపీ కంచుకోట‌కు.. త‌మ్ముళ్ల బీట‌లు.. !
X

టీడీపీకి కంచుకోట వంటి నియోజ‌క‌వ‌ర్గాలు చాలానే ఉన్నాయి. పైకి అంద‌రికీ తెలిసినవి కొన్ని ఉంటే.. కొంద‌రికి మాత్ర‌మే తెలిసిన‌వి కొన్ని ఉన్నాయి. ఇలాంటి రెండో రకం జాబితాలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గమే ఉండి. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి నియోక‌వ‌ర్గంలో టీడీపీ వ‌రుస విజ‌యాలు దక్కించుకోవ డ‌మే కాదు.. 2004లో త‌ప్ప‌.. ఎప్పుడు ప‌రాజ‌యం అన్న‌మాటే లేకుండా సైకిల్ ప‌రుగులు పెట్టింది. క్ష‌త్రియులకు బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గంగా కూడా పేరుంది.

ఇక‌, ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గం మింగుడుప‌డ‌డం లేదు. వైసీపీ త‌ర‌ఫున అనేక ప్ర‌యోగాలు కూడా ఇక్క‌డ జ‌రుగుతున్నాయి. టీడీపీ కంచుకోట‌ల‌ను బ‌దాబ‌దులు చేయాల‌ని పెట్టుకున్న నియోజ‌క‌వర్గా ల్లో ఉండి కూడా ఉంది. అయినా.. వైసీపీకి ఇక్క‌డి ప్ర‌జ‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఛాన్స్ ఇవ్వ‌లేదు. పైగా గ‌త ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థిని మార్చి ర‌ఘు రామ‌ కృష్ణ‌ రాజుకు సీటు ఇచ్చినా.. ప్ర‌జ‌లు ఆయ‌న‌ను కూడా ఇక్క‌డి ప్ర‌జ‌లు గెలుపు గుర్రం ఎక్కించారు.

అయితే.. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీలోని సొంత నేత‌లే చికాకులు తెస్తున్నారు. సొంత పార్టీలో కుమ్ములాట‌లు పెట్టుకుని.. కంచుకోట‌కు బీట‌లు ప‌డేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎమ్మెల్యే క‌మ్‌.. ఉప స‌భాప‌తిగా ఉన్న ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వైఖ‌రిని త‌ప్పుబ‌డుతూ.. ఒక‌రిద్ద‌రు నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపుతున్నాయి. ఆయ‌న ఒంటెత్తు పోక‌డ‌లు పోతున్నార‌ని.. ఆయ‌న వ‌ల్ల పార్టీలో ఐక్య‌త దెబ్బ‌తింటోంద‌ని కొంద‌రు నాయ‌కులు బ‌హిరంగ వేదిక‌ల‌పైనే వ్యాఖ్యాని స్తున్నారు.

ఏపార్టీలో అయినా.. ఏ నియోజ‌క‌వ‌ర్గంలో అయినా.. ఇలాంటి వాదోప‌వాదాలు స‌హ‌జంగానే ఉన్నాయి. అయితే.. వాటిని సామ‌రస్యంగా ప‌రిష్క‌రించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. సీనియ‌ర్ల‌తో చ‌ర్చించు కుని త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొని వాటిని ప‌రిష్కార మార్గాల‌ను అన్వేషించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. కానీ, దీనిని వ‌దిలేసిన కొంద‌రు నేత‌లు.. బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఫ‌లితంగా అస‌లు ఏమీ చోట‌.. చిన్న నేత‌లు చేస్తున్న ఈ విమ‌ర్శ‌ల‌ను ప్ర‌త్య‌ర్థులు మ‌రింత ఎక్కువ చేసి ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇలాంటి వాటి విష‌యంలో పార్టీ అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని టీడీపీ అభిమానులు కోరుతున్నారు.