జనసేనలో చేరికలు ...కమిటీ ఏం చేస్తోంది ?
జనసేన ఏపీలో బలపడదామనుకుంటున్న మూడవ ప్రాంతీయ పార్టీ. 2014 లో పుట్టిన ఈ పార్టీ 2019 ఎన్నికల్లో పోటీ చేసింది.
By: Satya P | 10 Sept 2026 9:04 AM ISTజనసేన ఏపీలో బలపడదామనుకుంటున్న మూడవ ప్రాంతీయ పార్టీ. 2014 లో పుట్టిన ఈ పార్టీ 2019 ఎన్నికల్లో పోటీ చేసింది. 2024 లో కూటమి కట్టి పొత్తులతో ఏకంగా 21 సీట్లను తీసుకుని మొత్తానికి మొత్తం గెలిచి సత్తా చాటింది. ఇక ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 27 నెలలు పూర్తి అయిపోయాయి. అంటే మొత్తం 60 నెలల కాలంలో సగానికి పాలన చేరువ అయింది అన్న మాట. ఇక రాజకీయంగా మరింత బలపడాలని జనసేన ఆకాంక్షిస్తోంది. అంతే కాదు వీలైన చోట్ల కొత్త నాయకత్వాలను పెంచాలని ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని తీసుకోవాలని కూడా నిర్ణయించింది.
కమిటీ ఏర్పాటుతో :
ప్రత్యేకించి ఏ పార్టీలో లేని విధంగా జాయినింగ్స్ కమిటీ అని కూడా సీనియర్ నేతలతో జనసేన ఏర్పాటు చేసింది. అంటే ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని గుర్తించి వారిని తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడానికి అన్న మాట. ఈ కమిటీలో చూస్తే వైసీపీ నుంచి వచ్చిన సీనియర్ , మాజీ నేతలు సీనియర్ వంటి వారు ఉన్నారు. వారికి వైసీపీ మిత్రులతో టచ్ ఉంటుందని భావించి అలా కమిటీలో వేశారు అని కూడా చెప్పుకున్నారు. అయితే ఇది జరిగి చాలా కాలం అవుతున్న జనసేనలో జాయింగ్స్ అయితే పెద్దగా లేవు, ఎందుకు ఇలా అన్న చర్చ వస్తోంది.
జనసేన పేరు నలిగి :
చిత్రం ఏంటి అంటే తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ బిగ్ షాట్ అనదగిన నాయకుడు మజ్జి శ్రీనివాసరావు అనూహ్యంగా టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆయన నిజానికి జనసేనలో చేరుతారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఆయన కంటే ముందు సీనియర్ నేత బొత్స జనసేనలో చేరుతున్నారు అని కూడా మరో ప్రచారం సాగింది. ఇలా విజయనగరంలో బొత్స కుటుంబం నుంచి ఎవరో ఒక బిగ్ షాట్ అయితే బయటకు వస్తారని జనసేనలో చేరుతారని ముమ్మరంగా సాగిన ఆ ప్రచారంతో అంతా ఆ పార్టీ వైపే చూశారు. ఎందుకంటే ఉత్తరాంధ్రాలో బలపడాలని జనసేన చూస్తోంది. కానీ చిత్రంగా జనసేన కాదు టీడీపీ అని మజ్జి శ్రీనివాసరావు పసుపు కండువా కప్పుకోగానే అంతా విస్తుపోయారు. ఇదేమిటి అని ఒకటికి రెండు సార్లు చర్చించుకున్నారు కూడా.
సూదంటు రాయిగా :
అయితే ఏపీ రాజకీయాల్లో చాంపియన్ గా ఉన్న టీడీపీ సూదంటురాయిగా ఇతర పార్టీల నేతలను ఆకట్టుకుంటోంది అని అంటున్నారు. చడీ చప్పుడూ లేకుండా మజ్జి శ్రీనివాసరావు అంతటి నేతలు ఒక్కసారిగా సైకిలెక్కించేయడం వెనక టీడీపీ పక్కా వ్యూహం ఏమిటో అర్థం అవుతోంది అని అంటున్నారు. ఇక టీడీపీకి ఎంతో మంది నేతలు ఉన్నారు, అయినా సరే వచ్చిన వారికి సాదరంగా కండువా కప్పుతున్నారు. ఎంతమంది వచ్చినా సర్దుకుపోయేలా పుష్పక విమానం మాదిరిగా పార్టీని ఉంచగలుస్తున్నారు. పైగా వచ్చిన నేతలకు ఇస్తున్న హామీలు కూడా మరింతమందిని ఆకట్టుకునేలా ఉన్నాయని అంటున్నారు. అందువల్లనే ఇతర పార్టీలలో చేరికలు పెద్దగా ఉండడం లేదని అంటున్నారు. ఇదంతా టీడీపీ వ్యూహాత్మకంగా టీడీపీ అనుసరిస్తున్న విధంగా ఉంది అని అంటున్నారు.
ప్లస్ అయ్యేది కానీ :
ఇక టీడీపీలో మజ్జి శ్రీనివాసరావు చేరిక వల్ల ఆ పార్టీ మరింతగా బలపడుతుంది. అది వేరే విషయం కానీ జనసేనలో ఆయన చేరి ఉంటే ఉత్తరాంధ్రాలోనే జనసేనకు సరికొత్త బలం వచ్చేదని అంటున్నారు. మరి టీడీపీ ఏ రకమైన వ్యూహాలు అనుసరించింది అన్నది పక్కన పెడితే జనసేనలోకి బొత్స ఫ్యామిలీలో కీలక నేత చేరుతారు అన్న ప్రచారం ఎలా వచ్చింది. అది ఎంత వరకూ నిజం, ఒకవేళ నిజం అయి ఉంటే చివరి నిముషంలో ఈ బిగ్ ట్విస్ట్ ఏమిటి ఎందువల్ల అన్నదే ఇపుడు ఉత్తరాంధ్రాలో ప్రత్యేకంగా చర్చ సాగుతోంది.
