సుదర్శన్ రెడ్డికి అప్పుడు మద్దతు ఇచ్చేవాళ్ళమన్న బాబు
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ స్టాండ్ వెరీ క్లియర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాము 2024 ఎన్నికల ముందు నుంచి ఎన్డీయే కూటమిలో ఉన్నామని ఆయన చెప్పారు.
By: Satya P | 23 Aug 2025 2:02 PM ISTదేశ రాజకీయాల్లో ఒక చర్చగా ఉన్న ఉప రాష్ట్రపతి ఎన్నిక తెలుగు రాజకీయాలలోనూ కలకలం రేపుతోంది. ఉప రాష్ట్రపతి రేసులో ఎన్డీయే ఇండియా కూటములు పోటా పోటీగా నిలబడ్డాయి. అంతే కాదు గెలుపు కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి వ్యూహాత్మకంగా తెలుగు వారు అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నిలబెట్టింది. ఆయన ప్రాంతీయ సమీకరణలు సామాజిక సమీకరణలను ప్రభావితం చేయగలరని భావించే ఇండియా కూటమి ఈ నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు ఇక ప్రాంతీయ సెంటిమెంట్ ని కూడా ఇపుడు తెర మీదకు తెస్తున్నారు. తన పార్టీ పేరులోనే తెలుగుని ఉంచుకున్న టీడీపీకి జాతీయ స్థాయిలో ఇదే అంశం మీద ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
టీడీపీ వెరీ క్లియర్ :
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ స్టాండ్ వెరీ క్లియర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాము 2024 ఎన్నికల ముందు నుంచి ఎన్డీయే కూటమిలో ఉన్నామని ఆయన చెప్పారు. ఒక మిత్ర పక్షంగా తాము తమ కూటమి అభ్యర్ధిని గెలిపించుకోవడానికే చూస్తామని ఆయన చెప్పారు. ఇక బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ని ఎంపిక చేసే ముందు తమ అభిప్రాయాలను తెలుసుకుందని ఆయన చెబుతున్నారు. ఇలా అన్ని విధాలుగా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సి ఉందని ఆయన అంటూ సుదర్శన్ రెడ్డి కి ఏ విధంగా మద్దతు ఇవ్వాలని మీడియా ముందే ప్రశ్నించారు.
ఎన్డీయే నిలబెడితే కనుక :
సుదర్శన్ రెడ్డి కి ఎపుడు మద్దతు ఇస్తామో కూడా చంద్రబాబు చెప్పారు. ఎన్డీయే ఆయన పేరుని ప్రతిపాదించి అభ్యర్థిగా నిలబెడితే కచ్చితంగా తాము కూడా ఓటేస్తామని అన్నారు. అంటే ఎన్డీఎ నిలబెడితేనే ఓటు వేస్తాం తప్ప ప్రాంతీయ సమీకరణలను తెలుగు కార్డుని చూసుకుని తాము మద్దతు ఇచ్చేది ఉండదని బాబు నిక్కచ్చిగా చెప్పేశారు అని అంటున్నారు. పైగా ఇండియా కూటమి ఓటమి చెందుతామని తెలిసి తెలుగు అభ్యర్ధిని నిలబెట్టిందని ఆయన తప్పు పట్టారు.
జగన్ నే అడగాలి అంటూ :
మరో వైపు వైసీపీ కూడా ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం మీద కూడా బాబు స్పందించారు. ఆ విషయంలో తాము చెప్పేది ఏమీ ఉండదని అన్నారు అలా ఎందుకు మద్దతు ఇస్తున్నరో జగన్ నే అడగాలని ఆయన మీడియాకు సూచించడం విశేషం. తాము మాత్రం ఎన్డీఎ మిత్రులం కాబట్టి తమది అనుబంధం అని ఆయన చెప్పుకున్నారు. అయితే జగన్ విషయం మీద తాము మాట్లాడేది ఉండదని ఒకరి విషయాంలో తాము జోక్యం చేసుకునేది అంతకంటే ఉండదని అన్నారు. అయినా ఎవరి ఇష్టం వారిది అని వైసీపీ మద్దతు మీద బాబు నర్మగర్భంగా సమాధానం ఇచ్చారు.
ఆయనకే ఫుల్ సపోర్టు :
ఎన్డీయే నిలబెట్టిన ఉప రాష్ట్రపతి అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన ఉన్న వారని ఆయన దేశానికి తనకు దక్కిన పదవికి పూర్తి న్యాయం చేస్తారు అని బాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ఢిల్లీ పర్యటనలో బాబు రాధాకృష్ణన్ ఇంటికి వెళ్ళి మరీ ఆయనకు మర్యాదపూర్వకంగా కలిశారు. మొత్తం మీద చూస్తే చంద్రబాబు తాము జస్టిస్ సుదర్శన్ రెడ్డి విషయంలో వేరే ఆలోచనలో లేమని క్లారిటీ ఇచ్చేశారు తాము ఎన్డీయేతోనే అని కూడా తేల్చేశారు. ఇండియా కూటమికి సంఖ్యా బలం లేదని ఓటమి అని తెలిసి పోటీ చేస్తోందని విమర్శించారు.
