కర్నూలు టీడీపీలో నామినేటెడ్ రచ్చ... ఎందుకిలా?
టీడీపీలో నామినేటెడ్ పోస్టుల నియామకం దుమారం రేపుతోంది. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలం ఆలయ ట్రస్టు బోర్డు సభ్యుల ఎంపికపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
By: Tupaki Political Desk | 6 Oct 2025 12:53 PM ISTటీడీపీలో నామినేటెడ్ పోస్టుల నియామకం దుమారం రేపుతోంది. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలం ఆలయ ట్రస్టు బోర్డు సభ్యుల ఎంపికపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని నమ్ముకున్న వారిని కాదని, వైసీపీ నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని కేడర్ మండిపడుతోంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో టీడీపీలో పలు అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్లు నామినేటెడ్ పోస్టుల భర్తీ రాజకీయ రచ్చకు దారితీసింది.
శ్రీశైలం ఆలయ ట్రస్టు బోర్డులో బీసీ కోటా కింద సింధు శ్రీ అనే మహిళను నియమించారు. బీసీ కోటాలో ఆమెను నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నియామకంపై టీడీపీలో ఓ వర్గం తీవ్ర అభ్యంతరం లేవనెత్తుతున్నారు. సింధు శ్రీకి పార్టీకి ఏం సంబంధం ఉందంటూ నిలదీస్తున్నారు. సింధు శ్రీ భర్త డాక్టర్ జగన్మోహనరెడ్డి అగ్ర వర్ణాలకు చెందిన వారని, అంతేకాకుండా ఆయన కుటుంబం విపక్ష పార్టీ వైసీపీకి సన్నిహితంగా ఉంటుందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
శ్రీశైలం ట్రస్టు బోర్డు నియామకంపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. ఎన్నికలకు ముందు పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని, వైసీపీ నుంచి వచ్చిన వారికి, వైసీపీ సానుభూతిపరులకు నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టడం ఎంతవరకు న్యాయమని కార్యకర్తలు అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. ప్రతిభ ఆధారంగా కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పారని, కానీ సింధు శ్రీని ఏ లెక్కల్లో నియమించారో చెప్పాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
కార్యకర్తల అభ్యంతరాలతో శ్రీశైలం ఆలయ పాలకవర్గ నియామకంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయంలో పార్టీ పునరాలోచన చేస్తుందా? లేదా? అనేది హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే ఇప్పటికే పాలకవర్గ నియామక ప్రకటన విడుదలైనందున ప్రభుత్వం ఆ ఉత్తర్వులను ఉపశంహరించుకునే పరిస్థితి లేదని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. సామాజిక సమీకరణలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని కార్యకర్తలను సర్ది చెబుతున్నారు.
