Begin typing your search above and press return to search.

అంద‌రూ కావాల్సిందే.. టీడీపీ కొత్త స్ట్రాట‌జీ.. !

ఈ క్ర‌మంలో ఆయ‌న స్థానికంగా ఉన్న పార్టీ కేడ‌ర్‌తోనూ మ‌మేకం అవుతున్నారు. ఇలాంటి స‌మయంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆశించిన మేర‌కు అన్ని సామాజిక వ‌ర్గాల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని గుర్తించారు.

By:  Garuda Media   |   7 Dec 2025 12:00 AM IST
అంద‌రూ కావాల్సిందే.. టీడీపీ కొత్త స్ట్రాట‌జీ.. !
X

తెలుగు దేశం పార్టీ అంటేనే అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చే పార్టీగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా బీసీల‌కు ప్రాధా న్యం ఇస్తున్న‌ప్ప‌టికీ.. ఇత‌ర కులాల‌కు చెందిన వారికి ముఖ్యంగా ఎస్సీల‌కు కూడా ఇటీవ‌ల కాలంలోనే కాదు.. గ‌తంలోనూ చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. ఇప్పుడు మ‌రింత ఎక్కువ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించారు. దీనిలో భాగంగా క్షేత్ర‌స్థాయి నుంచే ఈ మార్పు క‌నిపించేలా చూస్తున్నారు. ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు జిల్లాల్లో ఎక్కువ‌గా ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఆయ‌న స్థానికంగా ఉన్న పార్టీ కేడ‌ర్‌తోనూ మ‌మేకం అవుతున్నారు. ఇలాంటి స‌మయంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆశించిన మేర‌కు అన్ని సామాజిక వ‌ర్గాల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని గుర్తించారు. ఉదాహ‌ర‌ణ‌కు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గలో ఒక సామాజికవర్గానికి చెందినవారు 29% ఉంటే, వారికి 39% పదవులు ఇచ్చారు. వాస్త‌వానికి ఇన్ని ప‌ద‌వులు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, ఇచ్చారు. దీనిపై చంద్ర‌బాబు స‌మీక్షించారు. అదేస‌మ‌యంలో ఎస్సీల్లోని ఒక వర్గంవారు 11 శాతం ఉంటే 8 శాతం పదవులే కేటాయించారు.

ఈ వ్య‌వ‌హారం కూడా చంద్ర‌బాబుకు అస‌హ‌నం క‌లిగించింది. ఇలా ఒకే వ‌ర్గానికి ఇన్నేసి ప‌ద‌వులు ఇస్తూ.. పోతే, మిగిలిన వ‌ర్గాల‌కు అన్యాయం చేసిన‌ట్టు అవుతుందని భావించిన ఆయ‌న‌.. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌ద‌వులు ఏయే వ‌ర్గాల‌కు ఇచ్చారన్న స‌మాచారాన్ని తెప్పించుకున్నారు. పదవుల పంపకంలో నియోజకవర్గ స్థాయిలో సామాజికవర్గాల్ని బ్యాలెన్స్‌ చేసుకోవాల‌న్న‌ది చంద్ర‌బాబు వ్యూహం. త‌ద్వారా.. వారి వ‌ల్లే పార్టీ ఎదుగుతుంద‌ని భావిస్తున్నారు. కేవ‌లం ఒక‌టి రెండు సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇస్తూ పోతే.. ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌ను ప్ర‌భావితం చేయ‌లేమ‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే ఫార్ములా అనుస‌రించేలా నూత‌న స్ట్రాట‌జీని రూపొందిస్తున్నారు. దీనిలో జిల్లాల వారీగా ఎక్కువ మంది జ‌నాభా, సామాజిక వ‌ర్గాల ఆధారంగా ప‌ద‌వులు పంచాల‌ని చూస్తున్నారు. ప్ర‌స్తుతం కేడ‌ర్ బ‌లోపేతంపై దృష్టి పెట్టిన నేప‌థ్యంలో సామాజిక వ‌ర్గాల ఆధారంగా కూడాప‌ద‌వులు పంచిన‌ట్ట‌యితే.. అది లాభిస్తున్న వాద‌న వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి కీల‌క నిర్ణ‌యం వెలువ‌రించ‌నున్నారు. చిన్నచిన్న వర్గాల్ని విస్మరిస్తే ఆయా వ‌ర్గాల‌కు చెందిన వారు బాధ్యత తీసుకోరని.. త‌ద్వారా పార్టీలో భిన్న‌మైన వ్య‌వ‌హారాలు న‌డుస్తాయ‌ని భావిస్తున్నారు. అందుకే మార్పు దిశ‌గా అడుగులు వేస్తున్నారు.