టీడీపీలో బిగ్ డిబేట్: నేతల ప్రాధాన్యంపై రగడ!
పొరుగు నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల టిడిపిలో తీవ్రస్థాయి నిరసన వ్యక్తమవుతోంది. అంతర్గత సంభాషణలో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది.
By: Garuda Media | 31 March 2026 9:00 PM ISTపొరుగు నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల టిడిపిలో తీవ్రస్థాయి నిరసన వ్యక్తమవుతోంది. అంతర్గత సంభాషణలో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. తాజాగా జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకలలో కొంతమంది నాయకులు వ్యవహరించిన తీరుపై సీనియర్ నాయకులు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా గత ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చిన వారికి కీలక పదవులు ఇవ్వడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో సంస్థగతంగా 10- 15 సంవత్సరాలుగా సేవ చేస్తున్న వారు ఉన్నారని చెబుతున్నారు.
ఆస్తులను అమ్ముకుని కూడా పార్టీ కోసం ఖర్చు చేసిన నాయకులు ఉన్నారని, అలాంటి వారికి పదవులు ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు వంటి పదవులను వైసీపీ నుంచి వచ్చిన కొందరికి ఎమ్మెల్యేలు సిఫారసు చేయటంపై మండిపడుతున్నారు. వారి వ్యవహారాన్ని పార్టీ నాయకులు కూడా అర్థం చేసుకోకుండా పదవులు ఇచ్చేసారని సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై రాజమండ్రి అదే విధంగా విశాఖపట్నం నుంచి కూడా పార్టీకి ఫిర్యాదులు అందాయి.
పొరుగు పార్టీ నుంచి వచ్చిన నాయకులలో నిబద్దత ఏ మేరకు ఉంటుందో అధిష్టానం ఆలోచించుకోవాలని కూడా సూచనలు చేశారు. పార్టీని నమ్ముకుని పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. అయితే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు చేసిన సిఫారసులకే పార్టీ అధిష్టానం గత ఏడాది ప్రాధాన్యం ఇచ్చింది. వారు సూచించిన వారికే పదవులు ఇచ్చింది. ఈ క్రమంలోనే కొన్ని పొరపాట్లు జరిగాయి అన్నది వాస్తవం. ఈ విషయాన్ని ఇటీవల చంద్రబాబు సైతం అంగీకరించారు.
ఎమ్మెల్యేలు చేసిన సిఫారసుల్లో కొన్నింటిని ఆయన పక్కనపెట్టి తన సొంత నిర్ణయం తీసుకుని కొంతమందిని నియమించారు. అయితే అప్పటికే కొన్నిచోట్ల నియామకాలు జరిగిపోవడంతో ఇప్పుడు వారు వ్యవహరిస్తున్న తీరు పట్ల స్థానికంగా ఉన్న నాయకులు.. ముఖ్యంగా సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరంతా పార్టీని ముందుకు నడిపించే పరిస్థితి ఉండదన్నది వారి ఆవేదన. దీనిని అర్థం చేసుకోవాలని అధిష్టానానికి చెబుతున్నారు.
దీనిపై పార్టీ ఏం చేస్తుంది? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. మొత్తంగా అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కీలక పదవులు ఇవ్వడం పట్ల పార్టీలో అంతర్గతంగా తీవ్ర స్థాయిలో చేర్చి నడుస్తోంది. ఈ విధానాన్ని మార్చుకోవాలని సూచనలు కూడా వస్తున్నాయి. కాబట్టి పార్టీలో దీనిపై నిర్ణయాత్మక వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది.
