ఇంత జరిగినా.. బయటకు రాలేదే.. టీడీపీ సీనియర్లకు ఏమైంది.. ?
బయటికి రావడం కూడా మానేశారు. యనమల రామకృష్ణుడు గానీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కానీ జెసి దివాకర్ రెడ్డి వంటి సీనియర్లు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు విప్పలేదు.
By: Garuda Media | 3 Feb 2026 4:00 AM ISTటిడిపి సీనియర్లు తీవ్రస్థాయిలో అసంతృప్తికి లోనవుతున్నట్టు కనిపిస్తోంది. ఎవరు కూడా సంతృప్తిగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. రాష్ట్రంలో తాజాగా జరిగిన పరిణామాలు సీఎం చంద్రబాబును తీవ్ర స్థాయిలో ఇరకాటంలోకి నెట్టిన విషయం తెలిసిందే. వైసిపి నాయకులు రెచ్చిపోయి చంద్రబాబును టార్గెట్ చేసి తీవ్ర పదజాలంతో దూషించారు. ఈ సమయంలో కార్యకర్తలు ఇతర నాయకులు రోడ్లెక్కి చంద్రబాబుకు మద్దతుగా పార్టీకి అనుకూలంగా సదరు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్లపై ఒక రకంగా దాడులు కూడా జరిగాయి. నిజానికి ఈ దాడులు చేసిన వారు కానీ చంద్రబాబుకు మద్దతుగా రోడ్డు ఎక్కిన వారు గాని కొత్త నాయకులు. అంటే గత ఏడాది కి ముందు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన నాయకులు ఉన్నారు. కానీ వాస్తవానికి ఇలాంటి సందర్భాల్లో స్పందించాల్సిన వారు చంద్రబాబు తరఫున నోరు విప్పి మాట్లాడాల్సిన వారు సీనియర్ నాయకులే. కానీ, వారు ఎందుకో ఈ దఫా చాలా మౌనంగా ఉన్నారు. ఎక్కడా నోరు విప్పి మాట్లాడ లేదు.
బయటికి రావడం కూడా మానేశారు. యనమల రామకృష్ణుడు గానీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కానీ జెసి దివాకర్ రెడ్డి వంటి సీనియర్లు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు విప్పలేదు. మరి దీనికి కారణం ఏంటి అంటే తమకు పదవులు ఇవ్వలేదని, లేకపోతే కనీసం తనకు ప్రాధాన్యం లేకుండా పోయిందన్న అనే ఆవేదన వారిలో కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా కొంతమంది నాయకులు పదవులు దక్కలేదని ఇప్పటికీ ఆవేదనలో ఉన్నారు. కానీ, వాస్తవానికి ఇప్పటికే వేలాది పదవులను చంద్రబాబు ఇచ్చారు.
కానీ ఇప్పటికే పదవులు అనుభవించిన వారిని మాత్రమే ఆయన పక్కన పెట్టారు. ఒకటికి రెండు పదవులు తీసుకుని గతంలో ప్రభుత్వంలో పార్టిసిపేట్ చేసిన చాలామంది నాయకులు ఉన్నారు. వారందరూ ఇంకా పెదవులు ఆశించడం పట్ల చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మనసులో పెట్టుకునే చాలా మంది నాయకులు ఇప్పుడు కీలకమైన సమయంలో పార్టీని కాపాడుకోవాల్సిన తరుణంలో చంద్రబాబుకు మద్దతుగా నిలవాల్సిన సమయంలో కూడా బయటకు రాకుండా వ్యవహరించారు.
అంతర్గత అభిప్రాయాలతో అంతర్గత అసంతృప్తులతో ఇంటికే పరిమితం కావడం వంటివి పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి వైఖరి సరికాదని టిడిపిని కాపాడుకునేందుకు సీనియర్లు సైతం బయటికి రావాలన్నది పార్టీ నాయకులు సూచిస్తున్న మాట. మరోవైపు టిడిపి కార్యకర్తలు సంయమనం కోల్పోకుండా కూడా సీనియర్లు సూచనలు చేయాల్సిన అవసరం ఉంది. అన్నీ చంద్రబాబు చూసుకుంటారు.. మాకు సంబంధం లేదు.. అన్నట్టుగా వ్యవహరించడం ద్వారా పార్టీని వారు ఏ విధంగా చూస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి వైఖరి సరికాదు అన్నది పార్టీలో జరుగుతున్న చర్చ.
