Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకు రేవంత్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారే.. !

తెలంగాణలో టిడిపి పుంజుకునే విషయంపై ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికీ తర్జ‌న‌భ‌ర్జ‌న‌లోనే ఉన్నారు.

By:  Garuda Media   |   4 Sept 2025 9:00 PM IST
చంద్ర‌బాబుకు రేవంత్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారే.. !
X

తెలంగాణలో టిడిపి పుంజుకునే విషయంపై ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికీ తర్జ‌న‌భ‌ర్జ‌న‌లోనే ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియక ఇబ్బంది పడుతూనే ఉన్నారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన టిడిపి 2023 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం దూరంగా ఉంది. అంతేకాదు కనీసం పార్టీని కూడా బలోపేతం చేసే విషయంపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గతంలో కాసాని జ్ఞానేశ్వర్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. 2023 ఎన్నికల్లో ఆయన పార్టీని వదిలి అప్పటి బి ఆర్ ఎస్ పార్టీలో చేరిపోయారు, ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా పార్టీకి అధ్యక్షుడు లేకుండానే పార్టీ కొనసాగుతోంది.

ఇటువంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొంత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. గతంలో టిడిపిని ఇక్కడ ఎదగకుండా అడ్డుకున్నారని, పార్టీని భూస్థాపితం చేయాలని గత పాలకులు నిర్ణయించుకున్నారని, అందుకే టిడిపి ఇక్కడ పుంజుకోలేక పోయింది అన్నది రేవంత్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్య. దీనిని బట్టి ఇప్పుడు ఆ పార్టీ పుంజుకుంటే ఇప్పుడు తాము అడ్డుపడము అనే సంకేతాలను ఆయన ఇచ్చినట్టు అయింది. ఇదే టిడిపిలో ఉత్సాహానికి కారణంగా మారింది.

ఒకప్పుడు టిడిపి జెండా పట్టుకునేందుకు కూడా జిల్లాల్లోనూ, గ్రామాల్లోనూ భ‌యపడిన పరిస్థితి కనిపించింది. ఇది వాస్తవం కూడా. బీఆర్ఎస్ హయాంలో టిడిపి నాయకుల పై దాడులు జరిగాయి. ఆంధ్ర పార్టీ అంటూ ముద్ర కూడా వేశారు. దీంతో టిడిపి తెలంగాణలో పుంజుకోలేకపోయిన పరిస్థితి కనిపించింది. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా గత ప్రభుత్వం, గత పాలకులు టిడిపిని పుంజుకోకుండా చేశారని చెప్పుకొచ్చారు. దీనిని బట్టి తాము అడ్డుపడబోమని పార్టీ పుంజుకుంటే ఇబ్బంది లేద‌న్న‌ట్టు వ్యాఖ్యానించారు.

దీనిని అవకాశం గా తీసుకుని చంద్రబాబు తెలంగాణలో పార్టీని విస్తరించే ప్రయత్నం చేస్తారా.. పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన చర్యలు తీసుకుంటారా.. అనేది చూడాలి. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టిడిపి పుంజుకుంటే ఆ పార్టీకి మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేకమంది నాయకులు ఏ పార్టీలోనూ చేరకుండా తటస్థంగా ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్లంతా టిడిపిలోకి చేరే అవకాశం కనిపిస్తోంది. ఎలా చూసుకున్నా టిడిపి తెలంగాణలో పాగా వేసేందుకు ఇది సరైన సమయం అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.