Begin typing your search above and press return to search.

జంపింగుల మ‌నోవేద‌న‌.. ప‌ట్టించుకోండి సార్‌.. !

గ‌త ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల అనంత‌రం.. వైసీపీ నుంచి చాలా మంది నాయ‌కులు టీడీపీలో చేరారు.

By:  Garuda Media   |   28 Aug 2025 10:00 AM IST
జంపింగుల మ‌నోవేద‌న‌.. ప‌ట్టించుకోండి సార్‌.. !
X

రాజ‌కీయాల్లో ఒక పార్టీ నుంచి మ‌రోపార్టీలోకి మారే నాయ‌కులు కామ‌న్‌. అవ‌కాశం-అవ‌స‌రం.. అనే రెండు ప‌ట్టాల‌పై ప్ర‌యాణించే నేత‌లు.. ఎక్క‌డ అవ‌కాశం ఉంద‌ని భావిస్తే.. అక్క‌డ‌కు వెళ్తారు. అయితే.. ఇలా జంప్ చేసిన వారికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో అవ‌కాశాలు చిక్క‌డం లేదు. స్థానికంగా ఉన్న రాజ‌కీయ ప‌రిణామాలు.. ప‌రిస్థితులు.. వారిని ఇబ్బందులు పెడుతున్నాయి. జంప్ చేసిన‌ నాయ‌కుల‌కు ప‌ద‌వులు ఇవ్వాల‌ని ఉన్నా.. పార్టీల అధినేతలు కూడా సీనియ‌ర్లు, ఇత‌ర నాయ‌కుల ప్రోద్బలంతో వెన‌క్కి త‌గ్గే ప‌రిస్థితి వ‌చ్చింది.

గ‌త ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల అనంత‌రం.. వైసీపీ నుంచి చాలా మంది నాయ‌కులు టీడీపీలో చేరారు. అప్ప‌టికే ఉన్న ప‌ద‌వులును కూడా వ‌దులుకుని వ‌చ్చారు. వారిపై ఉన్న అభియోగాలు కావొచ్చు.. లేదా.. ప్ర‌భుత్వం సెగ త‌గ‌ల‌కుండా చూసుకునేముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా కావొచ్చు. అనేక మంది నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే.. వీరికి టీడీపీలో ఇప్పుడు ప్రాధాన్యం ల‌భించ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. దీంతో జంపింగులు ఉసూరు మంటున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు.. బీద మ‌స్తాన్‌రావు, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌లు.. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాల‌ను త్యాగం చేసి.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది జ‌రిగి దాదాపు 8 నెల‌లు అయినా.. వారికి ప్రాధాన్యం లేకుండా పోయింద‌న్న ఆవేద‌న ఉంది. అయితే.. వీరికి ప్రాధాన్యం ఇస్తే.. క్షేత్ర‌స్థాయిలో అస‌లు టీడీపీ నేత‌లు డైల్యూట్ అవుతార‌న్న భావ‌న ఉంది. దీంతో వారిని ప‌క్క‌న పెట్టార‌ని తెలుస్తోంది. ఇక‌, ఎమ్మెల్సీసీట్లు వ‌దులుకుని కూడా ప‌లువురు నాయ‌కులు టీడీపీ చెంత‌కు చేరాల‌ని నిర్ణ‌యించారు.

వీరిలో బ‌ల్లి క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి, పోతుల సునీత‌, జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ వంటి వారు ఉన్నారు. వీరిలో జ‌య‌మంగ‌ళ ఒక్క‌రే టీడీపీలో నేరుగా చేరారు. మిగిలిన ఇద్ద‌రూ.. త‌మ త‌మ స‌భ్య‌త్వాల రాజీనామాల ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు. పోనీ.. వీరికి టీడీపీ నుంచి ద‌న్ను ల‌భిస్తోందా? అంటే.. ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. వీరిని ప్రోత్స‌హించాల‌ని చంద్ర‌బాబుకు ఉన్న‌ప్ప‌టికీ.. వీరికి ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న రాజ‌కీయ నేత‌లు మాత్రం స‌సేమిరా అంటున్నారు. దీంతో జంపింగుల‌కు ఎలాంటి అవ‌కాశం ఇచ్చే ప‌రిస్థితి లేకుండా పోయింద‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది.