Begin typing your search above and press return to search.

తమ్ముడూ.. తెలుసుకో.. చిన్న లోపాలు.. పెద్ద స‌మ‌స్య‌లు ..!

కానీ, అలా జ‌ర‌గ‌లేదు. దీంతో క్షేత్ర‌స్థాయిలో స‌ద‌రు ఎమ్మెల్యేపై సొంత నేత‌లు తిరుఉబాటు బావుటా ఎగురవేశారు.

By:  Garuda Media   |   31 Oct 2025 10:00 PM IST
తమ్ముడూ.. తెలుసుకో.. చిన్న లోపాలు.. పెద్ద స‌మ‌స్య‌లు ..!
X

టీడీపీ ఎమ్మెల్యేలు కొంద‌రు తెలిసి చేస్తున్నారో.. తెలియక చేస్తున్నారో తెలియ‌దు కానీ.. చిన్న చిన్న లోపాల‌తో పెద్ద పెద్ద స‌మ‌స్య‌లు కొనితెచ్చుకుంటున్నారు. ఈ వ్య‌వ‌హారంలో ఎవ‌రు ముందు.. ఎవ‌రు త‌ర్వాత అనేది చ‌ర్చ‌కాదు. అస‌లు.. జ‌రుగుతున్న విష‌యాల‌పై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టి.. క్షేత్ర‌స్థాయిలో తెలుసుకుంటే.. అది స‌మ‌స్య‌లుగా కాకుండా.. సానుభూతిగా మారుతుంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఓటుగా కూడా పోటెత్తుతుంది.

పార్టీలో ఉన్న కొంద‌రు ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండ‌డం లేదు. కానీ. ఈ నేత‌లు మాత్రం పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్నారు. దీంతో అటు ఎమ్మెల్యే ఇటు.. నాయ‌కుల‌కు మ‌ధ్య గ్యాప్ పెరుగుతోంది. ఇది.. సోష‌ల్ మీడియాలో కామెంట్ల వ‌ర‌కు దారితీస్తోంది. తాజాగా నెల్లూరులోని ఓ నియోజ‌క వ‌ర్గంలో ఎమ్మెల్యే వ్య‌వ‌హార శైలిపై కీల‌క ద్వితీయ శ్రేణి నాయ‌కుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అనంతరం ఎమ్మెల్యే త‌ప్పు స‌రిచేసుకుని ఉంటే ఇబ్బంది ఉండేది కాదు.

కానీ, అలా జ‌ర‌గ‌లేదు. దీంతో క్షేత్ర‌స్థాయిలో స‌ద‌రు ఎమ్మెల్యేపై సొంత నేత‌లు తిరుఉబాటు బావుటా ఎగురవేశారు. ఇక‌, ఉమ్మ‌డి చిత్తూరులోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న యువ ఎమ్మెల్యే కూడా ఇదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న వాద‌న ఉంది. ఆయ‌న కూడా పార్టీ నాయ‌కు ల‌పై న‌మ్మ‌కం లేద‌న్న‌ట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో పార్టీ ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం స‌ద‌రు నేత‌ను ప‌క్క‌న పెట్టింది. దీంతో ఇప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లేందుకు ఎమ్మెల్యే ఇబ్బంది ప‌డుతున్నారు.

ఇక‌, ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో మాజీ ఉన్న‌తాధి ఒక‌రు విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈయ‌న కూడా పార్టీ నాయ‌కులకు చేరువ కావ‌డం లేదు. అదేమంటే.. ``పుస్త‌కం రాస్తున్నా. త‌ర్వాత క‌లుస్తా`` అని మెసేజ్ పెడుతున్నారు. ఆయ‌న ఎవ‌ర‌నేది అంద‌రికీ తెలిసిందే. పుస్త‌కం రాసుకోవ‌డం త‌ప్పుకాక‌పోయినా.. పార్టీలో త‌న‌ను గెలిపించిన వారికి అవ‌కాశం ఇవ్వాలి క‌దా!. కానీ ఆయ‌న మ‌రిచిపోయారు. ఇక‌, ఇదే జిల్లాకు చెందిన మరో కొత్త ఎమ్మెల్యే.. వ్య‌వ‌హారం కూడా ఇలానే ఉంది. ఆయ‌న `రేంజ్‌`ను బ‌ట్టి త‌మ్ముళ్ల‌కు అప్పాయింట్‌మెంటు ఇస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటివే ఎమ్మెల్యేల‌కు ఇబ్బంది క‌లిగిస్తున్నా య‌న్న వాద‌న ఉంది. దీనిని స‌రిచేసుకోవ‌డం పెద్ద క‌ష్టం కాదు. కానీ, త‌మ్ముళ్లు తెలుసుకోవాలి క‌దా..!.