Begin typing your search above and press return to search.

జంపింగుల‌కు నో ఛాన్స్‌: ఇలా అయితే ఎలా బాబూ ..!

టిడిపి పార్లమెంటరీ పార్టీ కమిటీల్లో నియామకాలు దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. పార్టీ వర్గాలు కూడా ఈ విషయంపై ఒక నిర్ణయానికి వచ్చాయి.

By:  Garuda Media   |   30 Aug 2025 9:36 AM IST
జంపింగుల‌కు నో ఛాన్స్‌: ఇలా అయితే ఎలా బాబూ ..!
X

టిడిపి పార్లమెంటరీ పార్టీ కమిటీల్లో నియామకాలు దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. పార్టీ వర్గాలు కూడా ఈ విషయంపై ఒక నిర్ణయానికి వచ్చాయి. పార్లమెంటరీ స్థాయిలో జిల్లా కమిటీలను నియమించడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ప‌రుగులు పెట్టించాల‌నేది సీఎం చంద్రబాబు ఆలోచన. దీంతో ఈ కమిటీల‌ను చాలా కీలకంగా తీసుకున్నారు. ఎక్కడా చిన్న పొరపాట్లు కూడా రాకుండా ఏ చిన్న పొరపాటు జరగకుండా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. దాని ప్రకారం సీనియర్ నాయకులు కూడా నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నుంచి అనేకమంది నాయకులు టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో వారికి కూడా పార్లమెంటరీ కమిటీల్లో చోటు కల్పించాలని చంద్రబాబు కొన్నాళ్ల కింద‌ట భావించారు. అయితే, దీనికి సీనియర్లుగా ఉన్న టిడిపి నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు. పార్టీలో ఎన్నాళ్ల బట్టో పనిచేస్తున్న నాయకులను విస్మరించి కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా వైసిపి నాయకులను పార్టీలోకి తీసుకుంటే అది రేపు వ్యతిరేక భావనను కల్పించే అవకాశం ఉందని పార్టీ నాయకులు కూడా సంతోషంగా పనిచేసే అవకాశం లేదని వారు చెప్తున్నారు.

దీంతో పార్లమెంటరీ కమిటీల్లో జంపింగ్ చేసి వచ్చిన నాయకులకు అవకాశం అయితే ఇవ్వడం లేదనేది తెలుస్తోంది. ప్రస్తుతానికి పార్లమెంటరీ కమిటీలు జాబితా సిద్దమైనప్పటికీ.. ఎక్కడ వాటిని బయట పెట్టకపోవడం వెనుక కారణం ఇదేనని సమాచారం. నిజానికి పార్టీ మారి టిడిపిలోకి వచ్చిన వారు చాలామంది పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారికి పార్లమెంటరీ కమిటీల్లో చోటు కల్పించడం ద్వారా కొంత ఉపశమనం కల్పించాలని చంద్రబాబు ఆలోచన. అయినప్పటికీ స్థానికంగా సీనియర్ నాయకులు మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు.

కోవర్టులుగా మారి పార్టీకి సంబంధించిన కీలక విషయాలను వైసీపీకి చేరవేసే అవకాశం ఉందన్నది వారు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఆధిపత్యం కారణంగానే తమను తీసుకునే అవకాశం లేకపోయే విధంగా ఉందని వైసీపీ నుంచి వచ్చిన నాయకులు చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం కొంత ఇబ్బందికరంగానే మారింది. పార్లమెంటరీ క‌మిటీల‌లో చోటు కల్పించాలని చాలామంది నాయకులు కోరుతున్నప్పటికీ క్షేత్రస్థాయి నాయకులు చర్యలు తీసుకోలేదు.

దీంతో ఈ వ్య‌వ‌హారంపై చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. ప్రస్తుతం పార్లమెంటరీ కమిటీల నాయకులను ఎంపిక చేసేసారు. ఇక మిగిలింది రాష్ట్రస్థాయిలో నాయకత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి జంపింగ్ లకు అవకాశం ఇస్తారా ఇవ్వరా అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ వారికి అవకాశం కల్పించకపోతే తిరిగి వారు పార్టీకి కంట్లో నలుసుల మాదిరిగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.