వార్నీ మరెవరూ దొరకలేదా.. ఏకంగా మంత్రి లోకేశ్ కే ఝలక్ ఇస్తారా!
మంత్రి లోకేశ్ ఫొటోను డీపీగా పెట్టుకుని, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంగా చెప్పుకుని మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
By: Tupaki Political Desk | 30 Oct 2025 11:09 AM ISTమంత్రి లోకేశ్ ఫొటోను డీపీగా పెట్టుకుని, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంగా చెప్పుకుని మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడుని ఈ ఏడాది జనవరిలోనే అరెస్టు చేయగా, ముఠాలోని కీలక సభ్యులు ఇద్దరిని బుధవారం హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ వద్ద పట్టుకున్నారు. వైద్య చికిత్సల కోసం సాయం చేస్తామని చెబుతూ మంత్రి లోకేశ్ పేరుతో విరాళాలు సేకరించిన నిందితులు, సాయం కోరిన బాధితులను వదలకుండా దోచుకున్నారు. మొత్తం రూ.54.34 లక్షల కొల్లగొట్టిన మోసగాళ్లను పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం సత్యసాయి జిల్లా రాచువారిపల్లెకు చెందిన ఏ1 కొండూరి రాజేష్, గుంటూరుకు చెందిన గుత్తికొండ సాయి శ్రీనాథ్, పటాన్ చెరు నివాసి చిత్తడితల సుమంత్ కలిసి హెల్ప్ ఎట్ నారా లోకేశ్, హెల్ప్ ఎట్ పవన్ కల్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్ లతో వైద్య చికిత్సల కోసం సాయం చేస్తామని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం తరఫున ‘ఎక్స్’లో పోస్టులు పెట్టేవారు. అంతేకాకుండా తమ ఎక్స్ అకౌంటుకు డీపీగా మంత్రి నారా లోకేశ్ ఫొటోను వాడుకున్నారు. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంగా చెప్పుకోవడం, మంత్రి లోకేశ్ ఫొటో ఉండటంతో నిందితులు పెట్టే పోస్టులను అంతా నిజమని నమ్మేవారు. అంతేకాకుండా సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితుల సమాచారం సేకరించి పోస్టులు పెట్టేవారు.
దీంతో నిందితులు పెట్టిన పోస్టులు నమ్మిన వారు కామెంట్ల రూపంలో సంప్రదిస్తే, వారికి విదేశీ నంబర్ తో కాల్ చేస్తున్నట్లు నకిలీ నంబరుతో వాట్సాప్ లో సంప్రదించేవారు. కొందరు నుంచి విరాళాల రూపంలో డబ్బు వసూలు చేయగా, మరికొందరు బాధితులకు విదేశీ సాయం అందుకోవాలంటే ముందుగా కొంత మొత్తం రెమిటెన్స్ గా చెల్లించాల్సివుంటుందని చెప్పి డబ్బు గుంజుకునేవారు. ఇలా సుమారు 26 మందిని మోసం చేసి దాదాపు రూ.54.34 లక్షలు వసూలు చేశారు. అయితే బాధితులు, విరాళాలు ఇచ్చిన వారు ఆ తర్వాత తాము మోసపోయామని గ్రహించి సైబర్ మోసాల ఫిర్యాదుల విభాగం 1930 ట్రోల్ ఫీకి ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగు చూసింది.
మొత్తం నిందితులపై 16 ఫిర్యాదులు అందగా, గత జనవరిలోనే ప్రధాన నిందితుడు కొండూరి రాజేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల నుంచి డబ్బు వసూలు చేసిన నిందితుడు తొలుత గోవాకు అక్కడి నుంచి అండమాన్, ఆపై ఉత్తరప్రదేశ్ మీదుగా నేపాల్ పారిపోయాడు. అయితే అతడి కదలికలపై నిఘా వేసిన పోలీసులు నిందితుడు పశ్చిమబెంగాల్ వచ్చాడని తెలుసుకుని, 15 రోజుల పాటు రెక్కీ నిర్వహించి గత జనవరిలో అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే సహ నిందితులైన సాయిశ్రీనాథ్, సుమంత్ తమ ఫోన్లు, సిమ్ కార్డులు మార్చేసి పరారయ్యారు. గత 10 నెలలుగా వీరి ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులకు ఎట్టకేలకు కొండాపూర్ లో చిక్కారు. నిందితులపై ఏపీలోని సీఐడీ పోలీసుస్టేషన్ తోపాటు గుంటూరు పట్టాభిపురం, అతిపిరి, ఆత్రేయపురం, ఉయ్యూరు, పాడేరు, తెలంగాణలోని రాచకొండ కమిషనరేటులో కేసులు నమోదయ్యాయి.
