ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేసిందా.. లోకేశ్ కు లైన్ క్లియర్!!
అయితే మంత్రిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేశ్ ఎంతలా కష్టపడుతున్నా.. ఆయనకు పార్టీ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించకపోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అంటున్నారు.
By: Tupaki Political Desk | 27 Jan 2026 12:30 PM ISTఏపీలో అధికార తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా యువనేత లోకేశ్ కు పూర్తిస్థాయి పార్టీ బాధ్యతలు అప్పగించే సమయం ఆసన్నమైందన్న టాక్ వినిపిస్తోంది. నేడో, రేపో ఈ విషయమై అధికారిక ప్రకటన విడుదల అవుతుందని చెబుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ నాయకులను ఆహ్వానించారు. యువనేత లోకేశ్ యువగళం పాదయాత్ర చేపట్టి మంగళవారం నాటికి మూడేళ్లు పూర్తవుతుంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేసిన పార్టీ నేతలు నాయకత్వ బాధ్యతలు బదిలీపైనా ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నారు.
ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మంత్రిగా నారా లోకేశ్ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే కొన్ని విషయాల్లో లోకేశ్ జోరు ఎక్కువ ఉందన్న టాక్ నడుస్తోంది. ప్రభుత్వంలో లోకేశ్ ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతోంది. పెట్టుబడుల సాధనతోపాటు కొత్త ఉద్యోగాల కల్పన బాధ్యతను పూర్తిగా భుజానికెత్తుకున్న మంత్రి లోకేశ్ పార్టీపైనా పూర్తిస్థాయిలో ఫోకస్ చేస్తున్నారు. తరచూ పార్టీ కార్యాలయానికి వెళుతూ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అదేసమయంలో ప్రజాదర్బార్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు.
అయితే మంత్రిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేశ్ ఎంతలా కష్టపడుతున్నా.. ఆయనకు పార్టీ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించకపోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో తుది నిర్ణయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబును సంప్రదించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని అంటున్నారు. అయితే మంత్రి లోకేశ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తే ఈ ఇబ్బందిని అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ కేడర్ చెబుతోంది. లోకేశ్ కు పార్టీ బాధ్యతలు బదిలీ చేయడంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు ఏవీ లేకపోయినప్పటికీ ఏ కారణంచేతో ఆలస్యమవుతోంది.
అయితే, స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నందున ఇక ఈ విషయమై తాత్కార్యం చేయడం కరెక్టు కాదని టీడీపీ పెద్దలు భావిస్తున్నారు. మహనాడు సమయంలోనే లోకేశ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ వచ్చింది. నేతలు అంతా ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. కానీ, రకరకాల కారణాల వల్ల ఈ ప్రతిపాదన ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చల ఆధారంగా నేడో రేపో లోకేశ్ కు పార్టీ బాధ్యతలు అప్పగించడం ఖాయంగా తెలుస్తోంది.
