కొత్త నేతలు వద్దు బాబూ.. ఎమ్మెల్యేల గగ్గోలు.. !
ఉన్నవారితోనే వేగలేక పోతున్నామని కొత్తవారిని పార్టీలోకి చేర్చుకోవద్దని టిడిపిలో కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్న విషయం ఆసక్తిగా మారింది.
By: Garuda Media | 14 Oct 2025 2:00 PM ISTఉన్నవారితోనే వేగలేక పోతున్నామని కొత్తవారిని పార్టీలోకి చేర్చుకోవద్దని టిడిపిలో కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్న విషయం ఆసక్తిగా మారింది. ఇటీవల సీఎం చంద్రబాబు వైసీపీలో ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని అది అంతరించిపోయే పార్టీ అని చెప్పుకొచ్చారు. ఆ పార్టీలో ఉన్న నాయకులు ముందుగానే విధానాలను మార్చుకుని, మెరుగైన మార్గంలో ప్రయాణం చేయాలని కూడా ఓ సభలో సూచించారు. ముఖ్యంగా విజయవాడలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు వైసీపీ నాయకులను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
అంతరించిపోయే పార్టీలో ఉన్నవారు ఇప్పుడే కళ్ళు తెరవాలని, రాక్షసుడు దగ్గర ఉంటే మంచి వాళ్ళు కూడా అలాగే మారిపోయే ప్రమాదం ఉందని.. వారిపై రాక్షసులు అనే ముద్ర పడుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ నుంచి వచ్చే వారికి టిడిపి రెడ్ కార్పెట్ పరుస్తుందన్న వాదన వినిపించింది. నిజానికి గత ఎన్నికల అనంతరం చాలామంది నాయకులను టిడిపి అలాగే జనసేనలో చేర్చుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్నిచోట్ల వివాదాలు తలెత్తయి. వీటిలో వైసిపి నుంచి వచ్చి టిడిపిలో చేరిన వారి పాత్ర ఉందని గ్రహించారు.
దీంతో చంద్రబాబు ఇక పార్టీలోకి ఎవరిని తీసుకునేది లేదని స్పష్టం చేశారు. కానీ మారుతున్న పరిణామాలు, వైసీపీ బలం పుంజుకుంటుందన్న వాదన వస్తున్న క్రమంలో తిరిగి వైసిపి నుంచి నాయకులు చేర్చుకోవాలని ఆయన భావిస్తున్నట్టుగా సంకేతాలు అయితే ఇచ్చారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల స్థాయిలో మాత్రం నాయకులు గగ్గోలు పెడుతున్నారు.
ఇప్పటికే వైసిపి నుంచి వచ్చిన వారితో తాము వేగలేకపోతున్నామని, వారు తమతో కలిసి పని చేయకపోగా తమ ప్రతిష్ట దెబ్బతినేలాగా, తమ పేరు దెబ్బతినేలాగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని అన్నారు. సుదీర్ఘకారంగా పార్టీలో ఉన్న తమకు ప్రాధాన్యం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల క్రమంలో అటు రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే మాట వినిపిస్తోంది.
ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి పార్టీలో చేర్చుకున్న వారే పార్టీకి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు కొత్తవారిని చేర్చుకోవాలా వద్దా అనే విషయంపై సీఎం చంద్రబాబు ఆలోచనలో పడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దీంతో పలువురు నాయకులను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా వైసీపీకి షాక్ ఇవ్వాలనేది టిడిపి నాయకుల వాదన. కానీ ఎమ్మెల్యేలు ఈ విషయంలో వద్దనే సమాధానం చెబుతున్నారు. దీనివల్ల పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏం చేస్తారు అసలు వైసీపీ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది వేచి చూడాలి.
