Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల మాట: బాబు మాకు స‌మ‌యం ఇవ్వ‌ట్లేదు.. !

రాష్ట్రంలోని టీడీపీ ఎమ్మెల్యేల కేంద్రంగా వివాదాలు.. విభేదాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

By:  Garuda Media   |   27 Oct 2025 1:00 PM IST
ఎమ్మెల్యేల మాట: బాబు మాకు స‌మ‌యం ఇవ్వ‌ట్లేదు.. !
X

రాష్ట్రంలోని టీడీపీ ఎమ్మెల్యేల కేంద్రంగా వివాదాలు.. విభేదాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. వీటిని సామాజిక మాధ్య‌మాలు స‌హా.. ఓ వ‌ర్గం మీడియా కూడా పెద్ద ఎత్తున హైలెట్ చేస్తోంది. ఇది వివాదాలు ఎదుర్కొంటు న్న ఎమ్మెల్యేల‌కు ఎలా ఉన్నా.. వివాద ర‌హితంగా ప‌నిచేసుకుంటున్న ఎక్కువ మంది ఎమ్మెల్యేల‌కు మాత్రం కంట్లో న‌లుసుగానే ఉంటోంది. అంద‌రినీ ఒకే గాట‌న క‌ట్టేస్తున్నార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. త‌ర‌చుగా ఎమ్మెల్యేలు ఇదే విష‌యాన్ని చెబుతున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఉన్న జిల్లాలలో ఎవ‌రో ఒక ఎమ్మెల్యే త‌ప్పు చేస్తే.. మొత్తంగా జిల్లాకు ఆపాదించి.. ''ఆ జిల్లాలో.. '' అంటూ వ్య‌తిరేక‌త చూపిస్తున్నార‌న్న‌ది వాస్త‌వం. దీనిని ఎమ్మెల్యేలు త‌ప్పుబ‌డుతున్నారు. ఒక‌రిద్దరు ఎమ్మెల్యేలు త‌ప్పులు చేస్తున్నార‌న్న‌ది పార్టీ అధినేత‌కు తెలిసిన‌ప్పుడు.. వారిని కంట్రోల్ చేస్తే బెట‌ర్‌.. అన్న‌ది వారి సూచ‌న‌. అలా కాకుండా.. మొత్తం అంద‌రినీ ఒకే త‌ర‌హాలో చూడ‌డం స‌రికాద‌ని చెబుతున్నారు.

అనంత‌పురంలో తాడిప‌త్రి ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. దీనిని చూపించి జిల్లా మొత్తంపైనా ముద్ర వేయ‌డం.. అస‌లు ఎమ్మెల్యేలు అంద‌రూ ఇలానే ఉన్నారంటూ.. త‌ర‌చుగా వీడియో కాన్ఫ‌రెన్సులు పెట్టి హెచ్చ‌రించ‌డం వంటివాటిని ఇత‌ర ఎమ్మెల్యేలు కొంత హ‌ర్ట్ అయ్యేలా చేస్తున్నాయని చెబుతున్నారు. ముందు త‌మ‌కు క‌నీసం వ్య‌క్తిగ‌తంగా స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు.. నిధులు ఇచ్చేందుకు 10 నుంచి 20 నిమిషాల స‌మ‌యం అయినా ఇవ్వాల‌ని కోరుతున్న వారు ఉన్నారు.

ఇక‌, వీరి మాట ఎలా ఉన్నా.. రాష్ట్రంలో 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కీల‌క నేత‌ల‌ను ప‌క్క‌న పెడితే.. 65-70 మంది కొత్త ముఖాలు ఉన్నాయి. వీరిలో అంద‌రూ త‌ప్పులు చేస్తున్నారా? అంటే లేద‌నేది వాస్త‌వం. కానీ.. త‌ప్పులు చేస్తున్న‌వారితో వీరిని కూడా క‌లిపేసి.. వ్యాఖ్య‌లు చేస్తున్న నేప‌థ్యాన్నే ఈ ఎమ్మెల్యేలు ప్ర‌శ్నిస్తున్నారు. అలా కాకుండా.. మంచి చేస్తున్న‌వారిని ప్రోత్స‌హించాల‌ని వారు కోరుతున్నారు. అంతేకాదు.. త‌మ‌కు సీఎం చంద్ర‌బాబు స‌మ‌యం ఇవ్వాల‌ని బ‌లంగా విన్న‌విస్తున్నారు. మ‌రి బాబు ఏం చేస్తారో చూడాలి.