టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవాల్సిందేనా ?
టీడీపీ అంటేనే క్రమశిక్షణకు మారు పేరుగా ఉన్న పార్టీ. ఆ పార్టీకి ఒక విధానం ఉంటుంది.
By: Satya P | 18 Aug 2025 6:00 PM ISTటీడీపీ అంటేనే క్రమశిక్షణకు మారు పేరుగా ఉన్న పార్టీ. ఆ పార్టీకి ఒక విధానం ఉంటుంది. కట్టు తప్పిన వారి విషయంలో ఉపేక్షించిన దాఖలాలు అయితే లేవు. గతంలో అయితే ఎవరైనా గీత దాటితే ఎన్టీఆర్ వెంటనే వేటు వేసేవారు చంద్రబాబు జమానాలో అయితే అది కాస్తా మారింది. క్రమశిక్షణా సంఘం ముందు వారిని హాజరు పరచడం, వారి విషయంలో వివరణ తీసుకోవడం వంటివి చేస్తూ తుది హెచ్చరికలు జారీ చేసేవారు. ఇక బాబు హయాంలో టీడీపీ నుంచి సస్పెషన్లు బహు తక్కువ. అలా పరిస్థితి ముదరకుండా ముందే జాగ్రత్త పడేవారు.
గతం అలా ఇపుడిలా :
ఇక చంద్రబాబు మాట అంటే టీడీపీలో శిలా శాసనం గా ఉండేది. ఆయన వద్ద ఎవరైనా భయపడాల్సిందే. బాబు ఒకటి రెండు సార్లు చెబుతారు. ముందే సీరియస్ అవరు, కానీ ఆ ఇచ్చిన సమయాన్ని అవకాశాన్ని వాడుకోకపోతే మాత్రం ఎంతటి వారికైనా శిక్ష తప్పదని హెచ్చరికగా ఉండేది. కానీ ఇదంతా గతంగా మారుతోంది. టీడీపీలో బాబు మాటను జవ దాటుతున్న వారు పెరుగుతున్నారు. కట్టు తప్పుతున్నారు. చాలా మంది ఎంతలా చెప్పినా తమకు తోచిన విధంగా చేసుకుని పోతున్నారు. చివరికి ఇవే తలనొప్పులుగా మారుతున్నాయి.
మంచి పనులు మరుగున :
ఒక వైపు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అలాగే అభివృద్ధి అజెండాను ముందు పెట్టుకుని అడుగులు వేస్తోంది. అయితే ఇవి జనంలో చర్చకు పెట్టడం కనా కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారమే హైలెట్ అవుతోంది వారు చేస్తున్న పనులే జనంలోకి చర్చకు వస్తున్నాయి. ఆ తరహా ఎమ్మెల్యేలు అధికారం ఉంది కదా అని దూకుడుగా ఉంటున్నారు. దాంతో చెడ్డ పేరు పార్టీకి ప్రభుత్వానికి కూడా వస్తోంది అంటున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు అని ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేసుకున్నా దానిని మించి ఎమంలెయేలు కొందరు చేస్తున్న వ్యవహారాలే చర్చకు వస్తున్నాయంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఆయా ఎమ్మెల్యేలు చేసే పనులే వైరల్ అవుతున్నాయి అని అంటున్నారు.
వారి విషయం సీరియస్ గానే :
ఇక టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మూడు ప్రాంతాలకు చెందిన వారి మీద వచ్చిన ఆరోపణలు కానీ విమర్శలు కానీ ఈ సండెని రాజకీయంగా మండించేశాయి. ఎక్కడ చూసినా వీటి మీదనే చర్చ సాగుతూ వస్తోంది. అనంతపురం ఎమ్మెల్యే కానీ అలాగ గుంటూరులో ఉన్న మరో ఎమ్మెల్యే కానీ ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇంకో ఎమ్మెల్యే కానీ వీరి విషయంలో అధినాయకత్వం సీరియస్ గా ఉంది అని అంటున్నారు. వీరి మీద వచ్చిన ఆరోపణల పైన హై కమాండ్ గట్టిగానే రియాక్ట్ అవుతోంది. దీంతో వీరి విషయంలో నివేదికలను పార్టీ పెద్దలు కోరుతున్నారని అంటున్నారు.
యాక్షన్ తప్పదా :
వివాదాలు లేదా అవినీతి ఆరోపణలు లేదా దాష్టికాలు ఇలా కొందరు ఎమ్మెల్యేలు వార్తలలో ఉంటూ వస్తున్నారు. వారి వల్లనే చెడ్డ పేరు వస్తోంది అని హైకమాండ్ కూడా అర్ధం చేసుకుంది అందుకే ఈసారి సీరియస్ గానే యాక్షన్ ఉంటుందా అన్నది చర్చగా ఉన్నది. కొంతమంది మీద అయినా యాక్షన్ తీసుకుంటే మిగిలిన వారు దారిలోకి వస్తారు అన్న మాట కూడా ఉంది. టీడీపీకి ఎమ్మెల్యేలు ఏకంగా 135 మంది దాకా ఉన్నారు. ఒకరిద్దరు విషయంలో సీరియస్ గా చర్యలు తీసుకున్నా పోయేది ఏమీ లేదు అన్న మాట కూడా ఉంది.
అందుకే ఒకరిద్దరి విషయంలో సస్పెన్షన్ వేటుకు అయినా సిద్ధపడితే మొత్తం పార్టీ దారికి వస్తుంది అని అంటున్నారు. లేకపోతే మొత్తంగా నష్టపోయే ప్రమాదం ఉంది అని అంటున్నారు. ఇక క్రమశిక్షణ కలిగిన పార్టీ అని టీడీపీ రుజువు చేసుకోవాలీ అంటే గట్టి చర్యలు తీసుకోకతప్పదని సూచనలు అయితే వస్తున్నారు. మరి ఒకరిద్దరి విషయంలో చర్యలు తప్పవా అంటే ఏమో వేచి చూడాల్సిందే అంటున్నారు.
