తమ్ముళ్ల తంటా: మంగళగిరి మోడల్ పనికిరావట్లేదా ..!
టీడీపీ ఎమ్మెల్యేలు.. తమ నియోజకవర్గాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నది కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట.
By: Garuda Media | 27 Oct 2025 10:00 AM ISTటీడీపీ ఎమ్మెల్యేలు.. తమ నియోజకవర్గాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నది కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట. సీమకు చెందిన ఎమ్మెల్యేలు సగం మందికిపైగా.. బెంగళూరుకు పరిమితం అవుతు న్నారు. కోస్తాకు చెందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని పార్టీలోనే చర్చ సాగుతోంది. నిజానికి వారు సమయం కేటాయిస్తే.. నియోజకవ ర్గంలో అభివృద్ధి సాధించడం పెద్ద విషయం కాదు.
ఈ విషయంలో సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళికతోనే ఉన్నారు. మూడు కీలక విషయాలపై ఆయన సూచనలు చేశారు. కానీ, వారు అవి పట్టించుకోవడం లేదన్న వాదన ఉంది.
1) కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
2) మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను గుర్తు పెట్టుకోవాలని తెలిపారు.
3) పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధిని కూడా గమనించాలని చెప్పారు. కానీ.. ఈ మూడు తప్ప.. అన్నట్టుగా ఎమ్మెల్యేలు ఉన్నారు.
వాస్తవానికి పైమూడు నియోజకవర్గాలు.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ కు చెందిన నియోజకవర్గాలు. వీటిలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమీ నిదులు ఇవ్వడం లేదు. అందరికీ ఇస్తున్నట్టే ఇస్తోంది. కానీ.. అక్కడ సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేశారు. నేతలు ఎంత బిజీగా ఉన్నా.. తరచుగా నియోజకవర్గాలపై దృష్టి పెడుతున్నారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను సక్రమంగా వాడుతున్నారు. రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న పథకాలను అందరికీ అందేలా చేస్తున్నారు.
తద్వారా.. ఆ మూడు నియోజకవర్గాలు డెవలప్‌మెంటులో దూసుకుపోతున్నాయి. ఇక, మంగళగిరిని మరింత ఎక్కువగా డెవలప్ చేయాలని మంత్రి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే ఎన్నారైలను ఆయన భాగస్వామ్యం చేస్తున్నారు. సో.. దీనిని చూసైనా ఎమ్మెల్యేలు.. తమ తమ నియోజకవర్గాల్లో చిన్న చిన్న పనులు చేసి.. అభివృద్ధి బాట పట్టించవచ్చు. ఉదాహరణకు ప్రభుత్వ పాఠశాలల్లో నిరంతరం తనిఖీలు చేయడం ద్వారా.. వాటిని బాగు చేసుకునే అవకాశం ఉంది. దాతల నుంచి సహకారం తీసుకుని మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు చాన్స్ ఉంది. కానీ, వీటిని వదిలేసి.. తమ సొంత పనులు చేసుకోవడమే అసలు సమస్యగా మారిందన్నదివాస్తవం.
