ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు చంద్రబాబు తాజాగా క్లాస్
ఇలాంటి వేళ.. కొందరు ఎమ్మెల్యేలు అత్యుత్సాహంతో.. వ్యక్తిగత ఎజెండాతో చేస్తున్న వ్యాఖ్యలు అధికార పక్షాన్ని ఇరుకున పెడుతూ ఉన్నాయి.
By: Garuda Media | 27 Sept 2025 10:49 AM ISTఅసెంబ్లీ సమావేశాలు అన్నంతనే అధికారపక్షాన్ని ఇరుకున పెట్టే ఎజెండాతో విపక్ష సభ్యులు వ్యవహరించటం.. వారికి కౌంటర్లు ఇస్తూ అధికారపక్షం తాము చేస్తున్న పాలన గురించి చెప్పుకోవటం కనిపిస్తుంది. ఇందుకు భిన్నమైన సీన్ ఏపీ అసెంబ్లీలో కనిపిస్తోంది. దీనికి కారణం.. విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోవటం.. అధికారపక్ష కూటమి నేతలే అసెంబ్లీకి వస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. కొందరు ఎమ్మెల్యేలు అత్యుత్సాహంతో.. వ్యక్తిగత ఎజెండాతో చేస్తున్న వ్యాఖ్యలు అధికార పక్షాన్ని ఇరుకున పెడుతూ ఉన్నాయి.
మొన్నటికి మొన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ (టీడీపీ) చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనంగా మారాయో తెలిసిందే. పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) ఛైర్మన్ మాట వినటం లేదని.. తాము ఏదైనా చెబితే.. ఆ శాఖా మంత్రి అయిన పవన్ కల్యాణ్ కే చెప్పాలంటున్నట్లుగా పేర్కొంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. సొంత పార్టీ నేతలే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టటమా? అన్నది చర్చగా మారింది. ఇదిలా ఉంటే.. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో బొండా ఉమ మాదిరి.. వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు (కూన రవికుమార్, బొజ్జల సధీర్ రెడ్డి) తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చిన వారిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో..? ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? అంటూ క్లాస్ తీసుకుంటూ.. అక్కడే ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను.. ‘సభ్యులు అలా మాట్లాడుతుంటే కంట్రోల్ చేయలి కదా?’ అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
శాంతిభద్రతల అంశంపై చర్చ సందర్భంగా సుధీర్ రెడ్డి తదితరులు వ్యక్తిగత అంశాల్ని ప్రస్తావించటం.. ప్రభుత్వాన్ని నిలదీసేలా వారి వ్యాఖ్యలు ఉండటం.. శాంతిభద్రతల నిర్వహణ ప్రభుత్వానికి చేతకావట్లేదన్నట్లుగా కొందరు సీనియర్ సభ్యులు వ్యాఖ్యానించటంపై సీఎం ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు కొందరు గీత దాటి వ్యవహరిస్తుననారని.. ఇదేమైనా పార్టీ మీటింగ్ అనుకుంటున్నారా? అని నిలదీశారంటున్నారు.
ఎంతో సీనియార్టీ ఉన్న సభ్యులు కూడా పరిధులు దాటి వ్యవహరించటం ఏమిటి? ప్రతిపక్ష సభ్యులమని అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నిస్తూ.. ‘‘వెంటనే టీడీపీ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించండి. అక్కడే అందరికి గట్టిగా చెబుతా’ అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం ఇదే తొలిసారి అన్న మాట వినిపిస్తోంది. ఇటీవల కాలంలో అసెంబ్లీ సమావేశాల్లో వరుస పెట్టి చోటు చేసుకుంటున్న పరిణామాలు చంద్రబాబుకు చికాకుగా మారాయని.. ఎంత ఓర్చుకున్నా సభ్యుల తీరులో మార్పు రావటం తర్వాత.. కొత్త వాళ్లు కూడా కట్టు తప్పుతున్న వైనాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ చంద్రబాబులో ఇంత కోపాన్ని చూడలేదన్న మాట వినిపిస్తోంది.
